తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ (Rajinikanth) గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బస్ కండక్టర్ నుంచి భారతీయ చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ అత్యుత్తమ నటుల్లో ఒకరిగా ఎదిగారాయన. తనదైన స్టైలిష్ యాక్షన్‌తో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారీ సూపర్ స్టార్. సిల్వర్ స్ర్కీన్‌పై ఎంత స్టైల్‌గా ఉన్న నిజ జీవితంలో మాత్రం ఆయన ఎంతో సింప్లిసిటీతో కనిపిస్తారు. ఇదే ఆయనకు ఎనలేని అభిమానాన్ని తెచ్చిపెట్టింది. కాగా సినిమా రంగంలో ఆయన అందించిన సేవలకు గానూ దాదాసాహెబ్ పాల్కే అవార్డు, పద్మభూషణ్ పద్మవిభూషణ్ లాంటి పురస్కారాలు అందుకున్న రజనీకాంత్‌కు మరో అవార్డు వచ్చింది. అయితే అది నటన విషయంలో కాదు. సరైన సమయంలో అత్యధికంగా ఆదాయపు పన్ను చెల్లించినందుకు తమిళనాడు ఇన్‌కమ్‌ట్యాక్స్ అధికారులు ఆయనను ఘనంగా సత్కరించారు.
కూతురిగా గర్వ పడుతున్నా..
ఇన్‌కమ్ ట్యాక్స్ దినోత్సవం సందర్భంగా తాజాగా చెన్నైలో ఓ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సకాలంలో అత్యధిక ఆదాయపు పన్ను చెల్లిస్తోన్న రజనీని అవార్డుతో సత్కరించింది తమిళనాడు ఆదాయపు పన్ను శాఖ. ఈ అవార్డుని తెలంగాణ గవర్నర్ తమిళిసై చేతుల మీదుగా రజనీ కూతురు ఐశ్వర్యా రజనీకాంత్ అందుకున్నారు. అనంతరం దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఐశ్వర్య ‘ అధిక, సత్వర పన్ను చెల్లింపుదారునిగా గుర్తింపు పొందిన ట్యాక్స్ పేయర్ కూతురిగా నేను గరర్వపడుతున్నా. ఇన్‌కమ్ ట్యాక్స్ రోజున అప్పా (నాన్న)ను గౌరవించినందుకు తమిళనాడు ఆదాయపు పన్ను శాఖకు కృతజ్ఞతలు ‘ అని రాసుకొచ్చింది. కాగా ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట్లో వైరలవుతోంది. అభిమానులు రజనీకాంత్‌పై అభినందనలు కురిపిస్తున్నారు. ‘తలైవా అభిమానినైనందుకు తలెత్తుకుంటున్నా’, అంటూ కామెంట్లు పెడుతున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..