Bujji ila raa Review: కమెడియన్లుగా తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సునీల్, ధనరాజ్ హీరోలుగా నటించిన సినిమా బుజ్జి ఇలా రా. ఇద్దరు కామెడీ నటులు ఉన్నా కూడా ఇది పూర్తిగా సీరియస్ సైకోయిక్ డ్రామాగానే వచ్చింది. మరి ఈ థ్రిల్లర్ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో చూద్దాం..
నటీనటులు: సునీల్, ధనరాజ్, చాందిని తమిళరసన్, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు
సంగీత దర్శకుడు: సాయి కార్తీక్
సినిమాటోగ్రఫీ: గరుడవేగ అంజి
ఎడిటర్: ఛోటా కె. ప్రసాద్
దర్శకత్వం : గరుడవేగ అంజి
నిర్మాతలు: అగ్రహారం నాగి రెడ్డి, ఎన్. సంజీవ రెడ్డి
రిలీజ్ డేట్: 02/09/22
వరంగల్ పట్టణంలో సిఐగా పని చేస్తుంటాడు కేశవ (ధనరాజ్). ఏపీ నుంచి వరంగల్‌కు ట్రాన్స్ ఫర్ అవుతాడు. ఆయన వచ్చిన తర్వాత సిటీలో వరసగా పిల్లలు కిడ్నాప్ అవుతుంటారు.. అందులో ఇద్దర్ని చంపేస్తారు కూడా. దాంతో ఆ కేసును సీరియస్‌గా తీసుకుంటాడు కేశవ. ఈ క్రమంలోనే పిల్లల్ని కిడ్నాప్ చేసే గ్యాంగ్ దొరుకుతుంది.. కానీ వాళ్లు చంపే వాళ్లు కాదని తెలుసుకుంటాడు. మరి పిల్లలను అతి దారుణంగా చంపేదెవరు అని ఇన్వెస్టిగేషన్ మొదలుపెడతాడు. ఈ క్రమంలోనే అతడికి కొన్ని భయంకరమైన నిజాలు తెలుస్తాయి. అదే సమయంలో కేశవకు పెద్ద యాక్సిడెంట్ అవుతుంది. ఆ ప్లేస్‌లోకి కొత్త సిఐ ఖయ్యూమ్ (సునీల్) వస్తాడు. వచ్చీ రాగానే ఈయన కూడా ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతాడు. అందులో ఏం తేలింది.. పిల్లల్ని ఎవరు కిడ్నాప్ చేస్తున్నారు.. చంపుతున్నదెవరు అనేది మిగిలిన కథ..
థ్రిల్లింగ్ కంటెంట్‌తో వచ్చే సినిమాలను ప్రమోట్ కూడా అదే స్థాయిలో చేసుకోవాలి. లేదంటే ఒక్కోసారి చేతిలో మంచి ప్రాడక్ట్ ఉన్నా ఏం చేయలేం. బుజ్జి ఇలా రా సినిమా విషయంలో ఇదే జరిగింది. ఈ సినిమాలో నిజంగానే కొన్ని థ్రిల్లింగ్ మూవెంట్స్ ఉన్నాయి. దర్శకుడు రాసుకున్న కథ చాలా సీరియస్‌గా ఉంటుంది.. ఆసక్తికరంగానూ ఉంటుంది కాకపోతే దాన్ని ప్రజెంట్ చేసే విధానంలో మాత్రం అక్కడక్కడా కాస్త తడబడ్డాడు. సైకో థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్లకు మంచి ఛాయిస్ ఇది. వరంగల్ సిటీలో పిల్లల కిడ్నాప్‌లతోనే కథ మొదలవుతుంది. అదే టెంపోలో ఇంటర్వెల్ వరకు ఆసక్తికరంగానే తీసుకెళ్లాడు దర్శకుడు. ధనరాజ్ ఇన్వెస్టిగేషన్ చేసే విధానం బాగుంది. స్క్రీన్ ప్లే బాగానే రాసుకున్నా.. దానికి సరిపోయే బలమైన సీన్స్ సినిమాలో కనిపించలేదు. కొన్నింటిని మరీ ఈజీగా వదిలేసాడు దర్శకుడు. పకడ్బందీగా రాసుకుని ఉంటే బుజ్జి ఇంకాస్త మంచి సినిమా అయ్యుండేది. ఫస్టాఫ్ అంతా పిల్లల్ని కిడ్నాప్ చేయడం దగ్గర్నుంచి.. ఆ బ్యాచ్‌ను పట్టుకునే వరకు బాగానే ఉంటుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా బాగుంటుంది. అయితే సెకండాఫ్ మాత్రం ఆ స్టఫ్ ఇవ్వలేదు. ఇన్వెస్టిగేషన్ బాగానే ఉన్నా.. సన్నివేశాలు మాత్రం బలంగా పడలేదు. పైగా క్లైమాక్స్ రాసుకున్న తీరు బాగుంది కానీ తీసిన విధానం మరీ హింసాత్మకంగా ఉంది. అంత హింస ప్రేక్షకులకు ఎక్కుతుందా అనేది మిలియన్ డాలర్ ప్రశ్న. ఆర్టిస్టుల విషయంలోనూ ఇంకాస్త జాగ్రత్త తీసుకుని ఉండాల్సింది. అయినా కూడా బుజ్జి ఇలా రా అక్కడక్కడా మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఇచ్చింది.
కమెడియన్‌గా ముద్ర పడిన సునీల్ సీరియస్ పాత్రలో ఆకట్టుకున్నాడు.. పోలీస్ పాత్రలో బాగున్నాడు.. అలాగే ఎమోషనల్ సీన్స్ బాగా చేసాడు. ధనరాజ్ తన వరకు న్యాయం చేసాడు. ఎమోషనల్ సీన్స్‌లో చాలా బాగా నటించాడు. ఆయన భార్యగా నటించిన చాందిని భయపెట్టేసింది. అక్కడక్కడా అతి అనిపించినా.. ఎక్స్ ప్రెషన్స్ ఆకట్టుకున్నాయి. శ్రీకాంత్ అయ్యాంగార్‌కు మంచి పాత్ర పడింది. మిగిలిన వాళ్లంతా ఓకే..
సాయి కార్తిక్ సంగీతం అంతగా ఆకట్టుకోలేదు. బ్యాగ్రౌండ్ స్కోర్ మరీ భయంకరంగా ఉంది. లౌడ్ మ్యూజిక్ ఓవర్‌గా అనిపించింది. ఎడిటింగ్ ఓకే.. సెకండాఫ్ కొన్ని సీన్స్ సాగదీసినట్లు అనిపించాయి. క్లైమాక్స్‌లో రక్తపాతం కట్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది. దర్శకుడు కమ్ సినిమాటోగ్రఫర్ గరుడవేగ అంజి పనితీరు బాగుంది. కథ బాగానే రాసుకున్నా స్క్రీన్ ప్లే పరంగా లోటుపాట్లున్నాయి. దర్శకుడు జి నాగేశ్వరరెడ్డి టీమ్ కంటెంట్ బాగా రాసుకున్నారు. కానీ ప్రజెంటేషన్ విషయంలో ఇంకకాస్త శ్రద్ధ వహించాల్సి ఉంది. నిర్మాణ విలువలు కథకు తగ్గట్లుగానే ఉన్నాయి.
పంచ్ లైన్: బుజ్జి ఇలా రా.. సైకో డ్రామాలు ఇష్టపడేవాళ్లకు నచ్చే అవకాశం ఉంది..
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..