జక్కన్న మాటలను కీర్తిస్తూ ట్వీట్ చేసిన రష్యా ఎంబసీ..!

| Edited By:

Jun 06, 2020 | 5:36 PM

బాహుబలితో ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతిని గడించారు దర్శకధీరుడు రాజమౌళి. ఆ సినిమాతో భారత దేశ కీర్తిని కూడా ఆయన ప్రపంచం నలుమూలలా చాటారు.

జక్కన్న మాటలను కీర్తిస్తూ ట్వీట్ చేసిన రష్యా ఎంబసీ..!
Follow us on

బాహుబలితో ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతిని గడించారు దర్శకధీరుడు రాజమౌళి. ఆ సినిమాతో భారత దేశ కీర్తిని కూడా ఆయన ప్రపంచం నలుమూలలా చాటారు. ఇదిలా ఉంటే తాజాగా జక్కన్నను కీర్తిస్తూ రష్యా ఎంబసీ ట్వీట్ చేసింది. 2017 మాస్కో ఫిలిం ఫెస్టివల్‌లో భాగంగా బాహుబలి 2 ప్రదర్శన కోసం రాజమౌళి, ఆయన సతీమణి రమా రాజమౌళి, నిర్మాత శోభు యార్లగడ్డ అక్కడకు వెళ్లారు.

ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.. కుటుంబ విలువలు భారతీయుల డీఎన్‌ఏలో ఉంటాయి. ఈ సినిమా దేశంలోని సోదరులు, తల్లి-కొడుకు, భార్య భర్తలు ఇలా పలు రకాల బంధాలతో కుటుంబ విలువలను కాపాడుతున్న వారందరికీ నా సినిమా అంకితం. భారతీయ కుటుంబ విలువలను ప్రపంచానికి చాటి చెప్పడమే నా ముఖ్య ఉద్దేశం. ఇప్పుడది జరిగింది. నా సినిమా మొత్తం కుటుంబ విలువలతోనే ఉంటుంది అని అన్నారు. ఈ మాటలను ఓ ప్రకటనలో వెల్లడించిన రష్యా ఎంబసీ జక్కన్నపై ప్రశంసలు కురిపించింది. కాగా గత నెల 28న బాహుబలి 2 చిత్రం రష్యన్ భాషలో అక్కడి బుల్లితెరపై ప్రసారమైంది. ఆ చిత్రానికి అనూహ్యమైన స్పందన వచ్చిందని రష్యా ఎంబసీ ప్రకటించింది.

కాగా రెండు భాగాలుగా వచ్చిన బాహుబలిలో ప్రభాస్‌ హీరోగా నటించగా.. రమ్యకృష్ణ, అనుష్క, తమన్నా, రానా, నాజర్, సత్యరాజ్‌ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. ఆర్కా మీడియా పతాకంపై ప్రసాద్ దేవినేని, శోభు యార్లగడ్డ సంయుక్తంగా నిర్మించిన ఈ సిరీస్‌కి కీరవాణి సంగీతం అందించారు.

Read This Story Also: త్వరలో నయన్‌-విఘ్నేష్‌ పెళ్లి.. మొదలైన ఏర్పాట్లు..!