
బాలీవుడ్ తెరపై ఎనర్జీకి కేరాఫ్ అడ్రస్ ఆయన. విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించే ఆ హీరో.. ఇటీవలే బాక్సాఫీస్ వద్ద ఒక సునామీ సృష్టించారు. గతేడాది చివర్లో విడుదలైన ఆ సినిమా ఏకంగా వెయ్యి కోట్ల క్లబ్ లో చేరి బాలీవుడ్ రికార్డులను తిరగరాసింది. అయితే సక్సెస్ ఎంత వేగంగా వచ్చిందో, వివాదాలు కూడా అంతే వేగంగా ఆయనను చుట్టుముట్టాయి. షూటింగ్ సమయంలో ఆ స్టార్ హీరో ప్రవర్తన బాలేదని, నిర్మాతలను ఇబ్బంది పెడుతూ ఏకంగా మూడు కేరవాన్లు అడిగారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. అసలు ఆ హీరో సెట్స్‌లో అంతగా ఎందుకు డిమాండ్ చేశారు? నిర్మాతలకు ఆయనకు మధ్య గొడవ జరిగిందా?
బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఇటీవలే ఆయన నటించిన ‘ధురంధర్’ బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో భారీ యాక్షన్ చిత్రంగా వచ్చిన ఈ సినిమా.. 2025 డిసెంబర్ 5న విడుదలై ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 1300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఒకవైపు సినిమాపై విమర్శలు, బ్యాన్ చేయాలనే డిమాండ్లు వినిపించినా.. ప్రేక్షకులు మాత్రం బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమా భారీ విజయం సాధించడంతో రణవీర్ సింగ్ క్రేజ్ ఒక్కసారిగా ఆకాశాన్ని తాకింది.
ధురంధర్ సినిమా రెండు భాగాలుగా రాబోతున్న విషయం తెలిసిందే. మొదటి భాగం విడుదలైన కొద్ది రోజులకే సీక్వెల్ కూడా రెడీ అయిపోయింది. ‘ధురంధర్: ది రివేంజ్’ పేరుతో ఈ సినిమా మార్చిలో విడుదల కాబోతోంది. ఈ క్రమంలో రణవీర్ సింగ్ సెట్స్‌లో మూడు కేరవాన్లు కావాలని మారాం చేశారంటూ బాలీవుడ్ మీడియాలో ప్రచారం మొదలైంది. తన కోసం ఒకటి, తన వ్యక్తిగత సిబ్బంది కోసం మరో రెండు వానిటీ వ్యాన్లు అడిగారని వార్తలు వచ్చాయి. దీంతో నెటిజన్లు ఆయనను విమర్శించడం మొదలుపెట్టారు.
ఈ వివాదంపై ధురంధర్ చిత్ర నిర్మాణ బృందంలోని ఒక కీలక సభ్యుడు స్పందిస్తూ అసలు నిజం బయటపెట్టారు. “బ్యాంకాక్‌లో షూటింగ్ చేసినప్పుడు మేము కేవలం ఒక వానిటీ వ్యాన్ మాత్రమే వాడాము. అది హీరో కోసం కేటాయించాం. మిగిలిన రెండు వానిటీ వ్యాన్లు కావు.. అవి కేవలం కార్లు మాత్రమే. సిబ్బంది ప్రయాణానికి, సామాగ్రి తరలింపునకు ఆ కార్లను ఉపయోగించాం తప్ప.. హీరో ఎక్కడా మూడు వానిటీ వ్యాన్లు కావాలని డిమాండ్ చేయలేదు” అని ఆయన స్పష్టం చేశారు. దీంతో రణవీర్ పై వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదని తేలిపోయింది.
రణవీర్ సింగ్ గొప్ప నటుడని, ఆయన పని పట్ల ఎంతో అంకితభావంతో ఉంటారని మేకర్స్ ప్రశంసించారు. సీక్వెల్ కోసం ఆయన రోజుకు 12 నుంచి 15 గంటల పాటు కష్టపడ్డారని వెల్లడించారు. ఈ పాత్ర కోసం ఆయన ఏకంగా 15 కిలోల బరువు తగ్గడం విశేషం. ధురంధర్ పార్ట్-2 లో రణవీర్ యాక్షన్ సన్నివేశాలు మునుపెన్నడూ చూడని విధంగా ఉండబోతున్నాయని సమాచారం. మార్చిలో రాబోతున్న ఈ సినిమాతో రణవీర్ మరోసారి బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేయడం ఖాయమని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. సక్సెస్ ఉన్నప్పుడు విమర్శలు రావడం సాధారణమే కానీ.. వాస్తవాలు తెలుసుకోకుండా ట్రోల్ చేయడం సరికాదని రణవీర్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. మరి ‘ధురంధర్’ పార్ట్-2 తో రణవీర్ ఎలాంటి రికార్డులు సృష్టిస్తారో చూడాలి.