Singer Mangli Bonalu Maisamma Song: మాటకారి మంగ్లీగా ఓ న్యూస్ ఛానెల్‌లో కెరీర్ మొదలు పెట్టిన సత్యవతి.. ఆ తర్వాత తన ప్రతిభతో మంచి సింగర్‌గా పేరు తెచ్చుకుంది. అంతేకాదు పెద్ద హీరోల సినిమాల్లో తన పాటలతో అలరిస్తోంది. ఇప్పటికే ఈమె ‘అల వైకుంఠపురుములో’లో రాములో రాములా పాటతో పాటు నాగ చైతన్య, సాయి పల్లవి హీరో, హీరోయిన్లుగా నటించిన ‘లవ్ స్టోరీ’లో పాడిన సారంగదరియా పాట యూట్యూబ్‌ను ఓ రేంజ్‌లో షేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. మరోవైపు మంగ్లీ సినిమా సాంగ్స్ మాత్రమే కాకుండా.. వినాయక చవితి, బతుకమ్మ, బోనాలు, సంక్రాంతి, శివరాత్రి సందర్భంగా ప్రత్యేక గీతాలు పాడటమే కాకుండా అందులో నటించి ప్రేక్షకుల మన్ననలు కూడా అందుకుంది. తాజాగా ఈమె బోనాల సందర్భంగా పాడిన పాట ఇపుడు వివాదానికి కారణమైంది.
సింగర్ మంగ్లీ పాటలంటే.. తెలంగాణలో వేరే లెవెల్. ఆమె పాట కోసం ఎదురుచూసే అభిమానులున్నారు. పండగలకన్నా ముందే.. ఆమె పాటలు ఆ సందడిని తీసకొస్తాయి. అందుకే ఆమెకంత క్రేజ్. రాములో రాములా అంటూ సినిమా పాటపాడినా.. రేలారే అంటూ జానపదం పాడినా… భక్తిపాటల్లో వచ్చే కిక్కు నిజంగానే వేరే లెవెల్. కాని.. లేటెస్ట్ సాంగ్ ఆ లెవెల్ దాటేసినట్టుంది. క్రేజ్ కాస్త కరిగిపోయింది. మంగ్లీ పాటపై వస్తున్న విమర్శలు ఇటు అభిమానులను.. అటు భక్తులను ఆందోళనకు గురి చేసింది.
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా ప్రతి ఏటా బోనాల ఉత్సవాలు జరుగుతుంటాయి. ఈ వేడుకల్లో తెలంగాణ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పిస్తుంటారు. ఈ సీజన్‌లో సింగర్ మంగ్లీ పాటలు వాడవాడనూ ఉర్రూతలూగిస్తుంటాయి. ప్రతి ఏడాది బోనాల పండగ సమయంలో ఓ స్పెషల్ సాంగ్ రిలీజ్ చేసి చిందులేపిస్తుంటుంది మంగ్లీ. ఇదే బాటలో ఈ ఏడాది రిలీజ్ చేసిన బోనాల స్పెషల్ సాంగ్ కూడా యూబ్యూబ్‌ను షేక్ చేసింది. జులై 11న రిలీజ్ చేసిన పాటలో లిరిక్స్ మాత్రం వివాదాస్పదమయ్యాయి. ‘చెట్టు కింద కూసున్నవమ్మా.. సుట్టం లెక్క ఓ మైసమ్మా..’ అంటూ సాగే ఈ పాటపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. మైసమ్మను అంత మాట అంటావా అంటూ కొందరు మంగ్లీపై విమర్శలకు దిగారు. అమ్మవారిని చుట్టంగా, మోతెవరిలా అభివర్ణించడమేంటి? అంటూ మండిపడ్డారు.
పాట అంటే భక్తిని పెంచేదిలా ఉండాలని, దీనికి విరుద్ధంగా అమ్మవారిని మోతెవరిలాగా, అక్కరకు రాని చుట్టంలా అభివర్ణించడం సరికాదని పలువురు నెటిజన్స్ కామెంట్స్ చేశారు. సెలెబ్రిటీ హోదా రాగానే అహంకారం నెత్తికెక్కిందా? అంటూ మంగ్లీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బీజేపీ నేతలు సింగర్ మంగ్లీపై రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సాంగ్‌ను తక్షణమే సామాజిక మాధ్యమాల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు బీజేపీ కార్పోరేటర్. రాచకొండ సీపీని కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సాంగ్ దేవతని మొక్కినట్టులేదు.. తిడుతున్నట్టుంది అని పేర్కొంటూ వెంటనే లిరిక్స్ మార్చాలని, అదే విధంగా మంగ్లీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
అయితే, ఈ వివాదాలన్నింటికి తెర దించుతూ దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టింది మంగ్లీ. లేటెస్ట్‌గా మంగ్లీ పాత పాటను డిలీట్ చేసి… కొత్త లిరిక్స్‌తో పాటను రిలీజ్ చేసింది. నిన్న తన అఫీషియల్ యూట్యూబ్ చానల్‌లో అప్‌లోడ్ చేసింది. వివాదాస్పద లిరిక్స్ స్థానంలో కొత్త పదాలను చేర్చి విడుదల చేశారు. ఈ కొత్త పాటతో అభిమానులు శాంతిస్తారని అశిద్ధాం.
Read Also… మళ్ళీ మొదటికి..పంజాబ్ కాంగ్రెస్ లో లుకలుకలు..సిద్దు క్షమాపణ కోరాల్సిందేనంటున్న సీఎం అమరేందర్ సింగ్ వర్గం