
యువ గాయనీ, గాయకుల కోసం తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 వచ్చేస్తోంది. ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా మూడు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ సింగింగ్ రియాలిటీ షో కొత్త సీజన్ ఆగస్టు 29 నుంచి ప్రారంభం కానుంది. తమన్, గీతా మాధురి, కార్తీక్ జడ్జిలుగా వ్యవహరించనున్నారు. అలాగే సింగర్స్ శ్రీరామచంద్ర, సమీరా భరద్వాజ్ లు యాంకరింగ్ చేయనున్నారు. తాజాగా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో ఆడిషన్స్ కు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ క్రమంలో ఓ అంధుడు కూడా ఈ సింగింగ్ రియాలిటీ షో ఆడిషన్స్ కు హాజరయ్యాడు. సూర్య నటించిన గజినీ సినిమాలోని ‘ఒక మారు కలిసిన బంధం’ అనే పాటను అతను ఎంతో అద్బుతంగా ఆలపించాడు. జడ్జీలు సైతం ఆ అంధుడి ట్యాలెంట్ కు ఫిదా అయ్యారు. ఈ సందర్భంగా అంధుడి పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేశాడు తమన్. ‘ ఎలా మీకు కంటి చూపు పోయింది. చిన్నప్పటి నుంచే ఇంతేనా? అని తమన్ అడగ్గా.. పుట్టినప్పటినుంచే గుడ్డివాడిని అని సదరు కంటెస్టెంట్ తెలిపాడు. దీంతో ఎమోషనలైన తమన్ ‘నేను, కార్తీక్ కలిసి నీకు కళ్లు కనిపించేలా చేస్తాం’ అని అందరి ముందు హామీ ఇచ్చాడు. ఆ మాటకు అంధుడు ఎంతగానో పరవశించిపోయాడు. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట బాగా వైరలవుతోంది. కళ్లు లేని వ్యక్తికి ఆపరేషన్ ద్వారా చూపు ప్రసాదించేందుకు ముందుకు వచ్చిన తమన్, కార్తీక్‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఇలా సాయం చేయడం తమన్ కు ఇదేమీ మొదటి సారి కాదు. గతంలో ఎంతో మందికి తన సొంత డబ్బులతో వైద్యం చేయించాడీ మ్యూజిక్ డైరెక్టర్. ఇక ఇదే షోలో పాల్గొన్న సింగర్లకు తన సినిమాల్లో కూడా పాడే అవకాశం కల్పిస్తున్నాడు. తద్వారా వారి జీవితానికి బంగారు బాటలు వేస్తున్నాడు. ఇందులో భాగంగా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 లో పాల్గొన్న నజీర్, భరత్ రాజ్ లకు ఓజీ సినిమాలో అవకాశం కల్పించాడు తమన్. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కుతున్నఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన
ఫైర్ స్ట్రామ్ పాటలో ఈ సింగర్లకు అవకాశం కల్పించారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.