కమెడియన్ సత్యం రాజేష్ ప్రధాన పాత్రలో సుమారు రెండేళ్ల క్రితం ఓటీటీలో రిలీజైన చిత్రం మా ఊరి పొలిమేర. చేతబడుల నేపథ్యంలో సస్పెన్స్ అండ్ హార్రర్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమా సూపర్‌హిట్‌గా నిలిచింది. రికార్డు స్థాయిలో వ్యూస్ సొంతం చేసుకుంది. దీంతో సీక్వెల్‌ను థియేటర్లలో రిలీజ్ చేశారు. మా ఊరి పొలిమేర 2 పేరుతో నవంబర్ 3న విడుదలైన రెండో పార్ట్‌కు కూడా పాజిటివ్ టాక్ వస్తోంది. ఊహించని ట్విస్టులతో సినిమా అదిరిపోయిందని ప్రశంసలు వినిపిస్తున్నాయి. మా ఊరి పొలిమేర 2కి ఇప్పటివరకు రూ. 12 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. మూ ఊరి పొలిమేర 2 సినిమాతో డాక్టర్ కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, బాలాదిత్య, రాకెండ్ మౌళి, రవి వర్మ, సాహితి దాసరి, చిత్రం శ్రీను, అక్షత శ్రీనివాస్ తదితరులు ప్రధాన పాత్రల్లో మెరిశారు. ఇదిలా ఉంటే మా ఊరి పొలిమేర 2 సినిమా ఓటీటీ రిలీజ్‌కు సంబంధించి సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. ఈ నెల చివరి వారంలోనే ఈ సస్పెన్స్ అండ్ హార్రర్ థ్రిల్లర్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కు రానుందని టాక్ వినిపిస్తోంది. థియేటర్లలో రిలీజై నెల పూర్తి కాకముందే ఓటీటీలోకి రానుందన్నమాట. ఒక వేళ నవంబర్ చివరి వారంలో రాకపోయినా డిసెంబర్ మొదటి వారంలోనైనా మా ఊరి పొలిమేర 2 ఓటీటీలోకి అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది.
మా ఊరి పొలిమేర మూవీ డిస్నీప్లస్ హాట్ స్టార్‌లోనే స్ట్రీమింగ్ అయ్యింది కాబట్టి రెండో పార్టును కూడా ఇదే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోనే రిలీజ్ చేయనున్నట్లు టాక్ నడుస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మా ఊరి పొలిమేర 2 సినిమాకు అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహించారు. శ్రీ కృష్ణ క్రియేషన్స్ బ్యానర్‌పై గౌరికృష్ణ ఈ సినిమాను నిర్మించారు. సినిమాటోగ్రాఫర్‌గా కుశేదర్ రమేష్ రెడ్డి, ఎడిటర్ గా శ్రీ వర బాధ్యతలు నిర్వర్తించారు. జ్ఞాని సంగీతం అందించారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..