Sarvam Shakthi Mayam On AHA OTT: ప్రస్తుతం సినిమాలతో పాటు ఓటీటీలోనూ సందడి చేస్తోంది సీనియర్ నటి ప్రియమణి. అలాగే టీవీ షోలు, డ్యాన్స్‌షోలతోనూ ప్రేక్షకులను అలరిస్తోంది. గతంలో ప్రియమణి నటించిన ఫ్యామిలీ మ్యాన్, హిజ్ స్టోరీస్ వంటి వెబ్ సిరీస్‌లతో పాటు భామాకలాపం సినిమా ఓటీటీలో మంచి ఆదరణ దక్కించుకున్నాయి. ఇప్పుడు మరొక ఆసక్తికర వెబ్ సిరీస్‌తో మన ముందుకు రానుంది ప్రియమణి. అష్టాదశ శక్తి పీఠాల నేపథ్యంలో తెరకెక్కుబోతన్న సర్వం శక్తి మయం అనే వెబ్ సిరీస్‌లో ఈ అందాల తార ప్రధాన పాత్ర పోషించింది. ఆమెతో పాటు సంజయ్ సూరిలతో పాటు సమీర్ సోని, సుబ్బరాజు, అభయ్ సింహా, అశ్లేష ఠాకూర్, కుషితా కల్లాపు సహా పలువురు కీలక పాత్రలు పోషించారు. ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్‌కు ప్రముఖ నటుడు, డైరెక్టర్ బీవీఎస్ రవి కథను అందించడం విశేషం. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న సర్వం శక్తి మయం వెబ్ సిరీస్ అక్టోబర్ 20 నుంచి ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన ట్రైలర్ ను మాస్ మహారాజా రవితేజ విడుదల చేశారు. ‘పనే దైవంగా పనిచేసుకుంటూ పోయే.. మన మాస్ మహారాజా రవితేజ గారు రిలీజ్ చేసిన ‘సర్వం శక్తిమయం’ ట్రైలర్’ అంటూ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది ఆహా.
సర్వం శక్తి మయం ట్రైలర్ విషయానికి వస్తే.. 18 అష్ఠాదశ శక్తి పీఠాల నేపథ్యంలో ఈ ఈవెబ్ సిరీస్ తెరకెక్కింది. మొత్తం ఇందులో 10 ఎపిసోడ్స్ ఉండనున్నాయి. అష్టాదశ శక్తి పీఠాలను పరిచయం చేస్తూ సర్వం శక్తి మయం ట్రైలర్ ప్రారంభమవుతుంది. ఒక కుటుంబం శక్తి పీఠాలను సందర్శించడానికి బయలు దేరతారు. అంతలోనే ఆ శక్తి పీఠాలపై రీసెర్చ్ చేసే ఓ పరిశోధకుడు వాళ్లకు పరిచయం అవుతాడు. అసలు అష్టాదశ శక్తిపీఠాలు ఏర్పడటానికి కారణం, శక్తి పీఠాల మహత్యం , ఆదిశంకరాచార్యుల ప్రస్తావన, శక్తిపీఠాలతో ముడిపడిన పలు ఆసక్తికర అంశాలను ఈ వెబ్ సిరీస్‌లో చూపించనున్నట్లు తెలుస్తోంది. అలాగే మరోవైపు ఒక నాస్తికుడు ఆస్తికుడైయ్యే ప్రయాణంగా సనాతన ధర్మం గురించి చర్చగా కూడా కథ సాగుతుంది. అంకిత్, విజయ్ చాడ, కౌముది కే నేమాని ఈ వెబ్ సిరీస్‌ను సంయుక్తంగా నిర్మించారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..