Annapurna Studios Into OTT: ఒకప్పుడు సినిమా అంటే కేవలం థియేటర్లకు వెళ్లి చూడాల్సిందే. కానీ మారుతోన్న కాలానికి అనుగుణంగా సినిమా వీక్షణలోనూ మార్పులు వచ్చాయి. ఇప్పుడు అరచేతిలో కొత్త కొత్త సినిమాలు చూసే రోజులొచ్చాయి. కొన్ని చిత్రాలైతే నేరుగా ఓటీటీలోనే విడుదలవుతున్నాయి. మారుతోన్న కాలానికి అనుగుణంగా దర్శక, నిర్మాతల ఆలోచనల్లోనూ మార్పులు వచ్చాయి. దీనికి అనుగుణంగానే వేగంగా అడుగులు పడుతున్నాయి.
ఈ మార్పులో తెలుగు ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ముందు వరుసలో ఉంటారు. ఆహా పేరుతో తొలి తెలుగు ఓటీటీని అందుబాటులోకి తీసుకొచ్చి కొత్త సంప్రదాయానికి నాంది పలికారీ స్టార్ ప్రొడ్యుసర్. ప్రస్తుతం ఆహా ఓటీటీ సేవలు ఓ రేంజ్‌లో దూసుకెళుతున్నాయి. దీంతో తెలుగు నుంచి మరో సంస్థ ఓటీటీ రంగంలోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. మారుతోన్న కాలానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు మారుతూ వచ్చే అక్కినేని నాగార్జున ఓటీటీ రంగంలోకి రానున్నారనేది సదరు వార్త సారాంశం. అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి వస్తోన్న ఈ డిజిటల్ స్ట్రీమింగ్ యాప్‌లో స్థాపనలో నాగార్జునతో పాటు ఆయన స్నేహితులు కూడా భాస్వామ్యులుగా ఉండనున్నట్లు తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఇప్పటికే సినిమా నిర్మాణాలు, అన్నపూర్ణ స్టూడియోస్‌తోపాటు యాక్టింగ్ స్కూల్‌ను విజయవంతంగా నడిపిస్తోన్న నాగార్జున డిజిటల్ రంగంలో ఏమేర రాణిస్తాడో చూడాలి.
Also Read: కేరళలో ఎల్‌డీఎఫ్ మళ్లీ అధికారంలో రావచ్చు కానీ అరకొర మెజారిటీనే రాబోతున్నది