కేరళలో ఎల్‌డీఎఫ్‌ మళ్లీ అధికారంలో రావచ్చు కానీ అరకొర మెజారిటీనే రాబోతున్నది

కేరళ ఎన్నికల ఫలితాలు ఎవరికీ పెద్దగా ఆశ్చర్యాన్ని కలిగించకపోవచ్చు. కారణం అక్కడ ఎల్‌డీఎఫ్‌ మళ్లీ అధికారంలోకి రాబోతున్నదని ప్రీపోల్‌ సర్వేలు, ఎగ్జిట్‌పోల్స్‌ చెప్పేశాయి..

కేరళలో ఎల్‌డీఎఫ్‌ మళ్లీ అధికారంలో రావచ్చు కానీ అరకొర మెజారిటీనే రాబోతున్నది
Ldf To Retain Power With 73 Seats
Follow us
Balu

| Edited By: Phani CH

Updated on: May 01, 2021 | 4:48 PM

కేరళ ఎన్నికల ఫలితాలు ఎవరికీ పెద్దగా ఆశ్చర్యాన్ని కలిగించకపోవచ్చు. కారణం అక్కడ ఎల్‌డీఎఫ్‌ మళ్లీ అధికారంలోకి రాబోతున్నదని ప్రీపోల్‌ సర్వేలు, ఎగ్జిట్‌పోల్స్‌ చెప్పేశాయి.. అంకెల్లో అటు ఇటుగా కాసింత తేడాలుండవచ్చేమో కానీ మొత్తంగా ఎల్‌డీఎఫ్‌ అధికారంలోకి రావడానికి సరిపడా సీట్లను గెల్చుకుంటుందని గట్టి నమ్మకంతో చెప్పాయి సర్వేలు. కాంగ్రెస్‌ సారథ్యంలోని యునైటెడ్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌ మరో అయిదేళ్లపాటు ప్రతిపక్షంలో ఉండాల్సిన పరిస్థితి రాబోతున్నది. 140 అసెంబ్లీ స్థానాలు ఉన్న కేరళలలో లెఫ్ట్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌ 73 సీట్లు గెల్చుకోవచ్చని మలయాళం మనోరమ అంటోంది. యూడీఎఫ్‌కు 64 స్థానాలు లభించవచ్చు.. అధికారంలోకి వచ్చే అవకాశాన్ని తృటిలో చేజార్చుకుంటున్నదన్నమాట! కాసర్‌గోడ్‌ జిల్లాలో మొత్తం అయిదు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 2016 ఎన్నికల్లో ఎల్‌డీఎఫ్‌కు మూడు స్థానాలు లభించాయి.. ఈసారి ఉద్మా నియోజకవర్గాన్ని స్వల్ప మెజారిటీతో ఎల్‌డీఎఫ్‌ కోల్పోనుంది. ఇక మంజేశ్వరం నియోజకవర్గం ఈసారి బీజేపీ సొంతం కాబోతున్నది. కేరళ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె.సురేంద్రన్‌ విజయం సాధించబోతున్నారు. ఆయనకు 35.9 శాతం ఓట్లు లభించబోతున్నాయి. యూడీఎఫ్‌ అభ్యర్థి ఎకేఎమ్‌ అష్రఫ్‌కు 35.3 శాతం ఓట్లు, ఎల్‌డీఎఫ్‌ అభ్యర్థి వి.వి.రమేశన్‌కు 27 శాతం ఓట్లు రాబోతున్నాయి. ఒక కన్నూరు జిల్లా విషయానికి వస్తే ఇక్కడున్న 11 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎల్‌డీఎఫ్‌ ఏడు గెల్చుకోబోతున్నది. యూడీఎఫ్‌కు నాలుగు సీట్లు దక్కనున్నాయి. కన్నూరులో మంత్రి రామచంద్రన్‌కు ఓటమి తప్పదంటున్నారు. పయ్యనూర్‌, కల్లైస్సెరీ, తాలిపరంబ, కూతుపరంబ, మట్టన్నూరు, తలస్సెరీ, ధర్మదామ్‌ నియోజకవర్గాలలో ఎల్‌డీఎఫ్‌ ఆధిక్యంలో ఉంటే, అజీకోడ్‌, కన్నూరు, ఇరిక్కుర్‌, పెరవూర్‌ స్థానాలు యూడీఎఫ్‌కు దక్కబోతున్నాయి. రాహుల్‌గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న వాయినాడ్‌ జిల్లాలో యూడీఎఫ్‌ క్లీన్‌స్వీప్‌ చేయబోతున్నది. ఉన్న మూడు స్థానాలు మనంతవాడి, సుల్తాన్‌ బాతెరీ, కలపెట్టా యూడీఎఫ్‌ సొంతం కాబోతున్నాయి. కోజికూడ్‌లో ఉన్న 13 నియోజకవర్గాలలో యూడీఎఫ్‌ తొమ్మిది, ఎల్‌డీఎఫ్‌ నాలుగు సీట్లు లభించబోతున్నాయి. మలప్పురమ్‌ జిల్లాలో ఉన్న 16 అసెంబ్లీ నియోజకవర్గాలలో యూడీఎఫ్‌ 14 స్థానాలను గెల్చుకోబోతున్నది. ఎల్‌డీఎఫ్‌ రెండు సీట్లకే పరిమితం కాబోతున్నది. ఈ జిల్లాలో ఇండియన్‌ యూనియన్‌ ముస్లింలీగ్‌ బలంగా ఉంది. 2016లో 12 సీట్లు గెల్చుకున్న యూడీఎఫ్‌ ఈసారి అదనంగా రెండు సీట్లను దక్కించుకోనుంది. నీలంబర్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసిన వీ.వీ.ప్రకాశ్‌ గురువారం గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన ఘన విజయం సాధించబోతున్నట్టు ఎగ్జిట్‌ ఫలితాలు చెబుతున్నాయి. క్రితం సారి ఎల్‌డీఎఫ్‌ గెల్చుకున్న నీలాంబర్‌, తనూర్‌, తవనుర్‌ నియోజకవర్గాలు ఇప్పుడు యూడీఎఫ్‌ వశం కాబోతున్నాయి. అలాగే తిరుర్‌ స్థానాన్ని యూడీఎఫ్‌ నుంచి ఎల్‌డీఎఫ్‌ చేజిక్కించుకోబోతున్నది. పాలక్కాడ్‌ జిల్లాకు సంబంధించి ఇక్కడున్న 11 నియోజకవర్గాలలో ఎల్‌డీఎఫ్‌ తొమ్మిది, యూడీఎఫ్‌ మూడు సీట్లు గెలవబోతున్నాయి. పాలక్కాడ్‌ నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్న మెట్రోమాన్‌ ఈ.శ్రీధరన్‌ పరాజయాన్ని మూటగట్టుకోబోతున్నారు. త్రిసూర్‌ జిల్లాలో ఉన్న 13 నియోజకవర్గాలలో ఎల్‌డీఎఫ్‌ పది, యూడీఎఫ్‌ మూడు సీట్లను గెల్చుకోబోతున్నాయి. ఎర్నాకులం జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో యూడీఎఫ్‌కు 11 స్థానాలు, ఎల్‌డీఎఫ్‌కు మూడు స్థానాలు లభించబోతున్నాయి. 2016లో యూడీఎఫ్‌ గెల్చుకున్నవి తొమ్మిది స్థానాలే. అంటే ఈసారి రెండు స్థానాలు అదనంగా సంపాదించుకోబోతున్నది.

ఇడుక్కి జిల్లా కూడా యూడీఎఫ్‌ పక్షాన నిలవబోతున్నది. అయిదు స్థానాల్లో నాలుగింటిని గెలవబోతున్నది. ఎల్‌డీఎఫ్‌కు ఒక్క సీటు దక్కే ఛాన్సుంది. 2016 ఎన్నికల్లో యూడీఎఫ్‌కు రెండు సీట్లు మాత్రమే లభించాయి. కొట్టయం జిల్లాలో ఉన్న తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎల్‌డీఎప్కు అయిదు, యూడీఎఫ్‌కు మూడు సీట్లు రాబోతున్నాయి. ఇతరులు ఒక స్థానాన్ని గెల్చుకోబోతున్నారు. 2016లో యూడీఎఫ్‌కు ఇక్కడ అయిదు సీట్లు లభించాయి. ఏ కూటమికి చెందని వ్యక్తి పీసీ జార్జ్‌ పూంజర్‌ నియోజకవర్గం నుంచి గెలవబోతున్నారు. కేరళ కాంగ్రెస్‌కు చెందిన జోస్‌.కె.మణి, ఎన్‌.జయరాజ్‌, జాబ్ మైకేల్‌ ఈజీగా గెలుస్తారని సర్వే చెబుతోంది. అలాగే కాంగ్రెస్‌ నేతలైన ఊమెన్‌ చాందీ, తిరువంచూర్‌ రాధాకృష్ణన్‌, సీపీఎం సీనియర్‌ నేత వి.ఎన్‌.వాసన్‌లు విజయం నల్లేరు మీద నడక కానుంది. అలపుజ జిల్లాలో ఉన్న తొమ్మిది నియోజకవర్గాలలో ఎల్‌డీఎఫ్‌కు ఆరు సీట్లు, యూడీఎఫ్‌కు మూడు సీట్లు రాబోతున్నాయి. పత్తనంతిట్ట జిల్లాలో అయిదు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ అయిదు స్థానాలను ఎల్‌డీఎఫ్‌ గెలవబోతున్నది. కొన్ని నుంచి కూడా పోటీ చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. సురేంద్రన్‌ మూడో స్థానంలో నిలవబోతున్నారు. కొల్లం జిల్లాలో ఉన్న 11 నియోజకవర్గాలలో ఎల్‌డీఎఫ్‌ తొమ్మిదింటిలో విజయం సాధించబోతున్నది. యూడీఎఫ్‌ రెండు స్థానాలు గెలవబోతున్నది. 2016 ఎన్నికల్లో ఎడీఎఫ్‌ జిల్లాను క్వీన్‌ స్వీప్‌ చేసిన సంగతి మర్చిపోకూడదు. అంటే యూడీఎఫ్‌కు ఈ రెండు సీట్లు ప్లస్‌ అన్నమాటే! తిరువనంతపురం జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో ఎల్‌డీఎఫ్‌ పది స్థానాలను గెలవబోతున్నది. యూడీఎఫ్‌కు మూడు సీట్లు వస్తాయి. కజక్కూట్టమ్‌ నియోజకవర్గంలో బీజేపీకి చెందిన శోభా సురేంద్రన్‌ విజయం సాధించబోతున్నారు. ఆమె దేవాదాయశాఖ మంత్రి కడకంపల్లి సురేంద్రన్‌ మీద గెలవబోతుండటం మరో విశేషం

మరిన్ని ఇక్కడ చూడండి: Oxygen Shortage: ఢిల్లీలో ఆక్సిజన్‌ కొరత తీవ్రతరం.. ఆక్సిజన్‌ లేక డాక్టర్‌‌తో సహా, ఎనిమిది మంది మృతి

రోడ్డు పక్కన ట్రక్కులో 2 లక్షలకు పైగా డోసుల వ్యాక్సిన్, పత్తా లేని, డ్రైవర్, క్లీనర్, ఎక్కడంటే ?