దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథతో మమ్ముట్టి ప్రధాన పాత్రలో రూపొందించిన చిత్రం యాత్ర. ప్రముఖ ఫిల్మ్ మేకర్ మహి. వి. రాఘవ ఈ బయోపిక్‌ను అద్భుతంగా తెరకెక్కించి ప్రశంసలు అందుకున్నారు. అంతకు ముందు పాఠశాల, ఆనందో బ్రహ్మ లాంటి కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలతో హిట్లు అందుకున్నారాయన. ఇప్పుడు ఆయన ఓటీటీ బాట పట్టారు. సేవ్ ది టైగర్స్ పేరుతో ఓ సరికొత్త వెబ్ సిరీస్‌ను నిర్మించారు. అంతరించిపోతున్న పులులను, మొగుళ్లను కాపాడుకుందాం… అనేది ఈ సిరీస్ ఉప శీర్షిక. చిన్నా వాసుదేవ రెడ్డితో కలిసి మహి వి. రాఘవ ఈ కామెడీ సిరీస్‌ను రూపొందించారు. అలాగే ప్రదీప్ అద్వైతంతో కలిసి షో రన్నర్ గా వ్యవహరిస్తున్నారు. అభినవ్ గోమటం, పావని గంగిరెడ్డి, ప్రియదర్శి, జోర్దార్ సుజాత, చైతన్య కృష్ణ, దేవయాని తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న సేవ్ ది టైగర్స్ డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో ఏప్రిల్ 27 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.
కాగా ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్లలో పాల్గొన్న మహి. వి. రాఘవ ‘యాత్ర 2’ పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ జీవిత కథ ఆధారంగా యాత్ర సీక్వెల్ ఉంటుందని రాఘవ ప్రకటించారు. అయితే, ఇప్పటి వరకు అది సెట్స్ మీదకు వెళ్ళలేదు. తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చారాయన. ‘ యాత్ర2 సినిమా తప్పకుండా ఉంటుంది. అయితే ప్రస్తుతానికి ఈ సీక్వెల్ గురించి ఎక్కువగా నేను మాట్లాడలేను. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగిన వాస్తవ సంఘటలను తీసుకుని సినిమా చేయాలి? నటీనటులుగా ఎవరిని తీసుకోవాలి? కంటెంట్ ఏం ఉండాలి? వంటి అంశాల గురించి నాకు క్లారిటీ వచ్చిన తర్వాత మరింత మాట్లాడతాను. అయితే, ఒక్కటి మాత్రం చెప్పగలను… ‘యాత్ర 2′, నేను చెప్పాలి అనుకున్న కథ! తప్పకుండా చెప్పి తీరుతా’ అని తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు రాఘవ.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..