Oscars Awards 2023: టాలీవుడ్‌లో పెద్ద రచ్చ.. ఆస్కార్ అవార్డు రావాలంటే సినిమా ప్రమోషన్‌కు అన్ని కోట్లు ఖర్చు చేయాలా?

తమ్మారెడ్డి భరద్వాజ ఆర్ఆర్ఆర్ ఆస్కార్ ప్రమోషన్లకే రూ.80 కోట్లు ఖర్చు చేశారని, ఆ డబ్బులతో కనీసం 10 సినిమాలు తియ్యవచ్చంటూ చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో తీవ్ర దుమారాన్ని రేపాయి. నిజానికి ఆయన చేసిన కామెంట్లు కొత్తవేం కావు..

Oscars Awards 2023: టాలీవుడ్‌లో పెద్ద రచ్చ.. ఆస్కార్ అవార్డు రావాలంటే సినిమా ప్రమోషన్‌కు అన్ని కోట్లు ఖర్చు చేయాలా?
Oscars Award
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Mar 10, 2023 | 12:54 PM

RRR చిత్రం ఆస్కార్ ప్రమోషన్లపై ఖర్చుపై ఇప్పుడు టాలివుడ్‌లో చర్చ అనడం కన్నా పెద్ద రచ్చే జరుగుతోందని చెప్పొచ్చు. తాజాగా తమ్మారెడ్డి భరద్వాజ ఆర్ఆర్ఆర్ ఆస్కార్ ప్రమోషన్లకే రూ.80 కోట్లు ఖర్చు చేశారని, ఆ డబ్బులతో కనీసం 10 సినిమాలు తియ్యవచ్చంటూ చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో తీవ్ర దుమారాన్ని రేపాయి. నిజానికి ఆయన చేసిన కామెంట్లు కొత్తవేం కావు.. దాదాపు నెలన్నర క్రితం నుంచి అన్ని మీడియాల్లో వస్తున్న వార్తలే. అయితే ఈ సారి అది తమ్మారెడ్డి భరద్వాజ లాంటి వ్యక్తుల నోటి నుంచి వచ్చాయి. అందుకు ఖర్చు పెట్టిన వాళ్లు… కౌంటర్ ఇవ్వాల్సిన వాళ్లు కాకుండా మరి కొందరు సినీ పెద్దలు, రాజకీయ నాయకులు స్పందించారు. అందులో ముఖ్యంగా నాగబాబు ఒకరైతే.. ఆ తర్వాత దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు.

సరే.. ఇప్పుడు మనం ఆ వివాదం జోలికి వెళ్లొద్దు.. నేరుగా పాయింట్‌కి వచ్చేద్దాం. అసలు నిజంగా ఆస్కార్ రేసులో పోటీ పడాలన్నా.. ఆ పోటీలో నిలవాలన్నా.. చివరకు గెలవాలన్నా.. భారీగా ఖర్చు పెట్టాల్సిందేనా? గత అనుభవాలు ఏం చెబుతున్నాయి? ప్రమోషన్ కోసం కోట్లు కుమ్మరించారనడంలో వాస్తవమెంత..?

ఆస్కార్ నామినేషన్‌కు కండీషన్స్..

ఇవి కూడా చదవండి

మొట్ట మొదట ఒక సినిమా ఆస్కార్ నామినేషన్‌కు పోటీ పడాలంటే, ఆ సినిమా ప్రొడ్యూసర్ లేదా డిస్ట్రిబ్యూటర్ ఆస్కార్ (అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్‌)కి అప్లికేషన్ పెట్టుకోవాలి. విదేశీ చిత్రాలకు సంబంధించి కొన్ని నియమాలు, నిబంధనలు ఉంటాయి. అవన్నీ అకాడమీ వెబ్‌సైట్‌లో వివరం‌గా రాసి ఉంటాయి.

ముందుగా ఆ చిత్రం థియేటర్లో రిలీజ్ కావాలి. దాని నిడివి 40 నిమిషాల కన్నా ఎక్కువ ఉండాలి. సబ్ టైటిల్స్ ఉండాలి. 2023 ఆస్కార్ రేసులో ఓటీటీలో విడుదలైన సినిమాలకు చోటు కల్పించారు. డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్స్మ్, డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్స్ కూడా సొంతంగా నామినేషన్ కోసం పోటీ పడవచ్చు.

మొత్తంగా ఆ నియమాలన్నింటినీ పాటిస్తూ, సినిమా క్రెడిట్స్ అందిస్తూ ‘ఆస్కార్ సబ్మిషన్ ఫార్మ్’ నింపి దరఖాస్తు చేసుకోవాలి.

సొంతంగా ఆస్కార్ బరిలో ఆర్ఆర్ఆర్..

నిజానికి భారతదేశం నుంచి ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రతి సారి అధికారికంగా ఒక సినిమాను ఆస్కార్‌కు పంపిస్తుంది. 2023కి గానూ ఎఫ్ఎఫ్ఐ గుజరాతీ సినిమా ‘ఛెల్లో షో’ ను పంపించింది. అంటే ‘ఆర్ఆర్ఆర్’ సినిమా భారత ప్రభుత్వం తరఫు నుంచి కాకుండా.. సొంతంగా ఆస్కార్ బరిలోకి దిగిందన్నమాట.

ఇదే కాకుండా ‘కాంతారా’, ‘విక్రాంత్‌ రోణ’, ‘గంగూభాయ్‌’, ‘మి వసంతరావ్‌’, ‘రాకెట్రీ’, ‘తుజ్యా సాథీ కహీ హై’, ‘ఇరవిన్‌ నిళల్‌’ సినిమాలు 2023 ఆస్కార్ అవార్డులకు మన దేశం నుంచి సొంతంగా బరిలోకి దిగాయి. అయితే, ఇవేవీ ఏ విభాగంలోనూ నామినేట్ అవ్వలేదు. ఆర్ఆర్ఆర్ మాత్రమే నామినేషన్ సాధించింది.

Oscars 2023

Oscars 2023

నామినేషన్, ప్రమోషన్లకు ఎంత ఖర్చు?

ఇక ‘నామినేషన్, ప్రమోషన్లకు సినిమా బడ్జెట్ కన్నా ఎక్కువ ఖర్చు అవుతుందా..? అందులో నిజమెంత..?

సినిమా అప్లికేషన్ వివరాలన్ని అకాడమీ పరిశీలించి, నామినేషన్‌కు షార్ట్ లిస్ట్ అవ్వడానికి అర్హత ఉందో లేదో నిర్థరిస్తుంది. ఇక అక్కడి నుంచి మొదలవుతుంది అసలు కథ. భారీ స్థాయిలో క్యాంపెయిన్ చేయాల్సి ఉంటుంది. ప్రమోషన్స్‌కు కోట్లు ఖర్చు అవుతాయి. 2016లో వెట్రిమారన్ దర్శకత్వం వహించిన తమిళ సినిమా ‘విసారణై’ (విచారణ) భారత్ నుంచి అధికారికంగా ఆస్కార్ నామినేషన్‌కు వెళ్లింది.

ఆ సమయంలో తన అనుభవాలను ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు వెట్రిమారన్. ఆస్కార్‌కు సినిమా పంపించడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదని, సినిమా బడ్జెట్ కంటే కొన్ని రెట్లు ఎక్కువ ఖర్చు అవుతుందని చెప్పారు. “ఆస్కార్ నామినేషన్‌కు ఒక సినిమా షార్ట్ లిస్ట్ అయిన తరువాత, క్యాంపెయిన్ నిర్వహించడానికి కనీసం రెండు నెలల ముందు నుంచీ అక్కడ (లాస్ ఏంజిల్స్‌లో) తిష్ట వేయాలి. ఆ ఖర్చులన్నీ మనవే.

అన్నిటికన్నా, ముఖ్యంగా ఒక మంచి పీఆర్‌ని వెతికి పట్టుకోవాలి. ఆస్కార్‌లో విదేశీ భాషా చిత్రాల మీద పట్టు ఉన్న పీఆర్ కావాలి. ఇది అత్యంత కీలకం. ఆ స్థాయి పీఆర్‌లు ఇద్దరు నుంచి ముగ్గురు మాత్రమే ఉన్నారు. వాళ్లు అంత సులువుగా దొరకరు. షార్ట్ లిస్ట్ అవ్వడానికి ప్రమోషన్ల మీద కనీసం 15000 డాలర్లు మన కరెన్సీలో చెప్పాలంటే సుమారు 12లక్షల 24వేల రుపాయలు, ఒకవేళ నామినేట్ అయితే అదనంగా సుమారు మరో 4 లక్షల 8 వేలు కేవలం పీఆర్‌కి మాత్రమే ఖర్చవుతాయి.

లాజ్ ఏంజిల్స్‌లో పార్టీ, విందులు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. చాలా లాబీయింగ్ చేయాలి. వాటన్నింటికీ ఖర్చులు కూడా మాములుగా ఉండవు. అలాగే నామినేట్ అవ్వాలంటే పత్రికల్లో యాడ్స్ ఇవ్వాలి. ‘వెరైటీ’, ‘ది హాలీవుడ్ రిపోర్టర్’ వంటి ప్రముఖ పత్రికల్లో మన సినిమా గురించి యాడ్స్ ఇవ్వాలి. రెండు పత్రికల్లో యాడ్స్ వేయడానికి మాత్రమే విసారణై చిత్రానికి సుమారు 26 లక్షల రుపాయలు ఖర్చుయ్యిందని వెట్రిమారన్ గతంలో చెప్పారు. ఈ ప్రచారం తమకు కొంత మేర గుర్తింపు తెచ్చిందని కూడా అన్నారు.

Oscar Awards 2023

Oscar Awards 2023

అంతేకాదు థియేటర్లను అద్దెకు తీసుకొని అతిథుల్ని ఆహ్వానించి వారికి రాచమర్యాదలు చెయ్యాలి. క్యాంపైనింగ్‌కు కూడా భారీగానే ఖర్చు చేయాల్సి ఉంటుంది. వెట్రిమారన్ చెప్పిన లెక్కలు చూస్తుంటే ఆస్కార్‌ ప్రచారానికి కోట్లు ఖర్చవుతాయన్న మాట వాస్తవం.

2016 అమెరికాకు చెందిన ప్రముఖ సినీ పత్రిక వెరైటీ చేసిన అధ్యయనంలో ఆస్కార్ క్యాంపైన్‌కు కనీసం ప్రస్తుత లెక్కల ప్రకారం సుమారు రూ.24 కోట్ల నుంచి 82 కోట్ల  వరకు ఖర్చువుతుందని తెలిపింది. ఈ విషయంలో పారామౌంట్, ఫాక్స్, యూనివర్సల్ లాంటి పెద్ద పెద్ద సినిమా రంగ సంస్థలు ఇంకా భారీగా ఖర్చుపెడతాయని ఆ వార్తపత్రిక అప్పట్లో చెప్పింది. చిన్న సినిమాల ఖర్చే ప్రస్తుత లెక్కల ప్రకారం సుమారు రూ.24.50 లక్షల నుంచి 80 కోట్ల వరకు ఖర్చు పెట్టే అవకాశం ఉంది.

2017లో ది గార్డియన్ పత్రిక ఆస్కార్ వేడుకకు, సినిమా ప్రమోషన్లకు అయ్యే ఖర్చు గురించి ప్రత్యేక కథనాలను ఇచ్చింది. అందులో కూడా అటూ ఇటూగా అందులో ప్రతి విభాగంలోనూ ఎంతెంత ఖర్చువుతుందో సవివరంగా చెప్పింది. 2017లో ది న్యూయార్కర్ అనే పత్రిక కూడా అప్పటి లెక్కల ప్రకారం ఆస్కార్ ప్రమోషన్లకు అయ్యే ఖర్చును వివరిస్తూ ప్రత్యేక కథనాలను ప్రచురించింది. అందరూ చెప్పిన మాట అదే. ఆస్కార్‌ పోటీలో నిలవాలంటే అయ్యే ఖర్చు అటూ ఇటూగా తక్కువలో తక్కువ 24 కోట్ల నుంచి 120 కోట్ల వరకు ఉంటుంది. ఒకప్పుడు పేపర్ యాడ్స్ మాత్రమే ఉండేవి. ఇప్పుడు డిజిటల్ క్యాంపైన్ ఓ రేంజ్‌లో జరుగుతోంది. ఇక ఖర్చు గురించి చెప్పేదేముంటుంది?

అంతర్జాతీయ స్థాయికి తెలుగు గౌరవం..

సరే..ఈ ఖర్చుల సంగతి పక్కనపెడదాం. ఆస్కార్.. నిన్న మొన్నటి వరకు మన తెలుగు సినిమా ఆ పేరెత్తే సాహసం కూడా చెయ్యలేదు. ఆ మాటకొస్తే ఇండియన్ సినిమాయే అప్పుడప్పుడు ఏ పదేళ్లకో.. ఇరవై ఏళ్లకే ఆస్కార్ వేదికలపై మెరుస్తూ వచ్చింది. అలాంటి ఇన్నాళ్లకు మన సినిమా ఆస్కార్ రేసులో చివరి వరకు వచ్చిందన్న సంబరంలో అభిమానులు ఉంటే.. మధ్యలో ఈ లెక్కల గొడవేంటంటి అన్న విమర్శలు ఎక్కువయ్యాయి. గడచిన నాలుగైదు నెలల్లో ట్రిపుల్ ఆర్ టీంకి ప్రపంచ వ్యాప్తంగా ఏ స్థాయిలో గుర్తింపు వచ్చిందో అందరం చూశాం. ఇప్పటికే రామ్ చరణ్‌కు హాలివుడ్ అవకాశాలు వస్తున్నాయన్న ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గట్టే త్వరలోనే హాలివుడ్‌లో అడుగుపెడతానంటూ సాక్షాత్తు చెర్రీయే అభిమానులకు చెప్పాడు కూడా. మరి ఇది కాదా.. తెలుగు సినిమాకు అంతర్జాతీయ వేదికపై వచ్చిన గౌరవం.

అసలు ఆ విషయానికొస్తే ఆస్కార్ బరిలోకి దిగే ఏ దర్శక నిర్మాతలు ఈ స్థాయిలో ఖర్చు పెట్టేందుకు ఎందుకు వెనుకాడుతారు? 80 కోట్లు పెడితే ఎనిమిదో పదో సినిమాలు తియ్యవచ్చేమో… కానీ అవి ఆస్కార్ రేంజ్‌కి వెళ్తాయా… వెళ్లినా మాత్రం 8-10 కోట్లు పెట్టి సినిమా తీసే వ్యక్తులు 80 కోట్లు ఖర్చు పెట్టి ఆస్కార్ బరిలో నిలుస్తారా..? అయినా మరి కొద్ది గంటల్లో రానున్న ఆస్కార్ ఫలితాల్లో మన పాటకి అవార్డు వస్తుందా.. రాదా అంటూ సినీ అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్న ఈ సమయంలో ఈ లెక్కల తిప్పలు ఏంటో..?

ఇంత చెప్పిన తర్వాత కూడా అంత ఖర్చవుతుంది.. ఇంత ఖర్చయ్యింది.. ఇన్ని సినిమాలు తియ్యచ్చు.. అన్ని సినిమాలు తియ్యచ్చు… మీరు లెక్కలు చూశారా… అంటూ ఏవేవో మాట్లాడుకుంటామంటే.. ఇక మీ ఇష్టం.

మరిన్ని సినిమా వార్తలు చదవండి..