OM Movie Review: ఓం సినిమా రివ్యూ.. ధనుష్, మమ్ముట్టి కలిసి మ్యాజిక్ చేసారా..?
‘అమరన్’ వంటి భారీ విజయం తర్వాత దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి రూపొందించిన తాజా చిత్రం ‘ఓం: ఆపరేషన్ మోల్’. ధనుష్, సాయి పల్లవి, మమ్ముట్టి లాంటి స్టార్స్ అంతా ఒకే స్క్రీన్ మీద కనిపించడంతో ఈ సినిమాపై మొదటి నుంచీ ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. తిరువణ్ణామలై, తిరుపతి అటవీ ప్రాంతాల్లో జరిగే ఎర్రచందనం అక్రమ రవాణా, దానికి ముడిపడిన వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ఎలా ఉంది.. పూర్తిగా మెప్పించిందో లేదో చూద్దాం..

మూవీ రివ్యూ: ఓం
నటీనటులు: ధనుష్, మమ్ముట్టి, సాయి పల్లవి, శ్రీలీల, శివాజీ రాజా, నసీరుద్దీన్ షా, చైతూ జొన్నలగడ్డ, ఇంద్రన్స్ తదితరులు
సంగీతం: సాయి అభ్యంకర్
సినిమాటోగ్రఫీ: K ఎళిల్ అరసు
ఎడిటింగ్: కళైవనన్
నిర్మాతలు: శ్రద్ధా అగర్వాల్, ధనుష్, అజ్మత్ జగ్మగ్
కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: రాజ్ కుమార్ పెరియసామి
కథ:
తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో సాగే ఎర్రచందనం అక్రమ వ్యాపారాన్ని అడ్డుకుని, దాని వెనుకున్న సూత్రధారులను పట్టుకునే బాధ్యతను పోలీస్ అధికారిణి నిత్యారెడ్డి (సాయి పల్లవి) చేపడుతుంది. ఈ మాఫియా చేతిలోనే తన తండ్రిని, భర్తను పోగొట్టుకున్న ఆమె, దోషులను శిక్షించడమే లక్ష్యంగా పనిచేస్తుంటుంది. మరోవైపు ఈ అక్రమ రవాణా సామ్రాజ్యాన్ని నడిపే కార్తికేయన్ (మమ్ముట్టి) ముఠాలోకి రహస్య పోలీస్ అధికారి తిరుకుమరన్ (ధనుష్)ను ప్రత్యేక దళం పంపిస్తుంది. ఓ ఫోటోగ్రాఫర్‌గా అడుగుపెట్టిన తిరుకుమరన్, క్రమంగా కార్తికేయన్ నమ్మకాన్ని గెలుచుకుని అతనికి అత్యంత సన్నిహితుడిగా మారతాడు. తన దగ్గరున్న 1000 టన్నుల సరుకును అమ్మివేసి ఈ వ్యాపారం నుంచి తప్పుకోవాలనుకున్న కార్తికేయన్‌కు సహాయం చేస్తున్నట్లు తిరుకుమరన్ నటిస్తాడు. మొదట 300 టన్నుల కలప దుబాయ్‌కు చేరగా, మిగిలిన 700 టన్నులను తరలించే సమయంలో నిత్యారెడ్డి బృందం దాడి చేసి వాటిని స్వాధీనం చేసుకుంటుంది. ఆ సందర్భంగా జరిగిన కాల్పుల్లో తిరుకుమరన్ ప్రాణాలను కార్తికేయన్ కాపాడతాడు. ఇదే క్రమంలో ఆంధ్ర సరిహద్దుకు వచ్చిన తిరుకుమరన్ తండ్రి (ఇంద్రన్స్), కూలీల మధ్య చిక్కుకుంటాడు. ఆ తర్వాత తిరుకుమరన్ తీసుకున్న నిర్ణయం ఏంటి? అతడు రహస్య పోలీస్ అన్న నిజం కార్తికేయన్‌కు తెలిసిందా? చివరకు ఈ అక్రమ రవాణా వెనుకున్న పెద్ద తలకాయలను నిత్యారెడ్డి పట్టుకోగలిగిందా లేదా అన్నదే మిగతా కథ.
కథనం:
ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యం అంటేనే ప్రేక్షకుల మదిలో వెంటనే ‘పుష్ప’ చిత్రం మెదలడం సహజం. ఆ స్థాయి ప్రభావం చూపిన అంశాన్ని మళ్లీ ఎంచుకోవడంతో పోలికలు తప్పవు. ఇది తమిళ చిత్రమే అయినప్పటికీ, శేషాచలం అడవులు, ఆంధ్ర సరిహద్దుల చుట్టూ కథ నడవడంతో దాదాపు సగం సినిమా తెలుగులోనే సాగుతుంది. 2015లో తిరుపతి సమీపంలో జరిగిన కాల్పుల్లో 20 మంది తమిళ కూలీలు ప్రాణాలు కోల్పోయిన వాస్తవ ఘటనను ఆధారంగా చేసుకుని, డబ్బు కోసం పేద కార్మికుల జీవితాలు ఎలా బలవుతున్నాయో చూపించే ప్రయత్నం దర్శకుడు చేశారు. అయితే ఇంతటి బలమైన వాస్తవ నేపథ్యాన్ని తీసుకున్నప్పటికీ, తెరపై సహజమైన భావోద్వేగాలను పండించడంలో మాత్రం తడబడ్డారు. గతంలో ‘అమరన్’ చిత్రం అందరినీ కదిలించడానికి అందులోని స్వచ్ఛమైన ఉద్వేగాలే ప్రధాన కారణం. కానీ ఇందులో ఆ లోతు కనిపించదు. పాత్రల మధ్య బంధాలు సహజంగా కాకుండా, ఏదో బలవంతంగా జోడించినట్లుగా అనిపిస్తాయి. తెరపై మరణాలు చోటుచేసుకుంటున్నా ప్రేక్షకుడి హృదయాన్ని తాకే స్థాయిలో ఆ సన్నివేశాలు పండకపోవడం పెద్ద మైనస్. ‘పుష్ప’ తరహాలో పోలీసులకు, స్మగ్లర్లకు మధ్య ఉత్కంఠభరితమైన పోరును చూపించడానికి బదులు, ఇందులో ఆంధ్ర ప్రాంతం వారిని చెడ్డవారిగా, తమిళులను మంచివారిగా చూపించే ఏకపక్ష ధోరణి ఎక్కువగా కనిపించడం అసహజంగా తోస్తుంది. ఇంటర్వెల్ సీన్లో ఎమోషన్ పండించే ప్రయత్నం జరిగినా, ఫస్టాఫ్ నుంచి చివరి వరకు కథనం మందకొడిగా సాగడం దీనికి మైనస్. కథలోని మలుపులు కూడా ముందుగానే ఊహించే విధంగా ఉండటంతో కొత్తదనం లోపించింది. ముఖ్యంగా సెకండాఫ్‌లో వేగం పెంచి, ఉత్కంఠను నిలపాల్సిన చోట నిడివి ఎక్కువైంది. యాక్షన్ సన్నివేశాల విషయంలోనూ బ్యాలెన్సింగ్ లోపించింది. సాయి పల్లవికి డిజైన్ చేసిన ఫైట్స్ చక్కగా కుదిరినా, ధనుష్‌పై చిత్రీకరించిన పోరాటాలు, ముఖ్యంగా అడవిలో సాగే ఫైట్ అంచనాలను అందుకోలేకపోయాయి. అన్నింటికంటే నిరాశపరిచే అంశం మమ్ముట్టి పాత్ర రూపకల్పన. అంతటి సీనియర్ నటుడిని పెట్టుకుని, ఆయన పాత్రకు తగిన బరువు ఇవ్వకుండా సాధారణ సహాయ నటుడి స్థాయికి పరిమితం చేయడం నిరాశ కలిగిస్తుంది.
నటీనటులు:
నటన పరంగా ధనుష్ ఎప్పటిలాగే తన బాధ్యతను సమర్థంగా నిర్వర్తించాడు. ముఖ్యంగా ఇంటర్వెల్ ముందు వచ్చే సన్నివేశంలోనూ, తండ్రి మృతదేహాన్ని పట్టుకుని విలపించే ఘట్టంలోనూ తన అనుభవాన్ని చాటుకున్నాడు. ఈ చిత్రానికి అసలైన వెన్నెముక సాయి పల్లవి అనే చెప్పాలి. నిజాయితీ, గంభీరత్వం నిండిన పోలీస్ అధికారిణిగా ఆరంభం నుంచి ముగింపు వరకు పాత్రలో జీవించింది. యాక్షన్ సీన్స్‌లో ఆమె చూపిన వేగం, పట్టు ఆకట్టుకుంటాయి; కొన్ని చోట్ల ధనుష్ కంటే ఆమె పోరాటాలే మెరుగ్గా అనిపిస్తాయి. మమ్ముట్టి తన అపార అనుభవంతో కార్తికేయన్ పాత్రకు న్యాయం చేసే ప్రయత్నం చేశారు. కేవలం ప్రతినాయక ఛాయలే కాకుండా, అందులోని సున్నితత్వాన్ని కూడా చక్కగా పలికించారు. కానీ రచనలో బలం లేకపోవడంతో ఆయన పాత్ర ఆశించిన స్థాయిలో నిలబడలేదు. శ్రీలీల తన పరిధి మేరకు ఫర్వాలేదనిపించింది. ధనుష్ తండ్రిగా ఇంద్రన్స్ తన సహజ అభినయంతో ఆకట్టుకోగా, నసీరుద్దీన్ షా పాత్ర మాత్రం పెద్దగా ప్రభావం చూపలేకపోయింది.
టెక్నికల్ టీం:
టెక్నికల్ టీంలో సినిమాటోగ్రఫీ టాప్ నాచ్‌లో ఉంది. అడవి వాతావరణాన్ని, సహజ లొకేషన్లను కెమెరా చక్కగా బంధించింది. సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ నేపథ్య సంగీతంతో సన్నివేశాలను ఎలివేట్ చేయాలని చూసినా, చాలా చోట్ల శబ్దం మితిమీరి చెవులకు ఇబ్బంది కలిగించేలా మారింది. ఎడిటింగ్ విభాగం ఇంకాస్త పదునుగా పనిచేయాల్సింది. అనవసర సన్నివేశాలను తొలగించి నిడివిని తగ్గించి ఉంటే సినిమా వేగం పెరిగేది. ఇక దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి విషయానికి వస్తే, ‘అమరన్’తో అద్భుతమైన నమ్మకాన్ని కలిగించిన ఆయన ఈసారి ఆ స్థాయి మ్యాజిక్‌ను రిపీట్ చేయలేకపోయారు. బలమైన కథాంశం, భారీ నటీనటులు అందుబాటులో ఉన్నా, సరైన కథనం లేక నిరాశపరిచారు.
పంచ్ లైన్:
ఓవరాల్‌గా ‘ఓం: ఆపరేషన్ మోల్’.. లక్ష్యాన్ని చేరుకోవడంలో నెమ్మదించిన ప్రయాణం..!
