‘ధర్మస్థల నియోజకవర్గం’ మూవీ రివ్యూ.. పొలిటికల్ ఎంటర్‌టైనర్ మెప్పిచిందా..?
‘రంగస్థలం’ తర్వాత ఆస్కార్ విజేత చంద్రబోస్.. ఆ స్థాయి సాహిత్యం ‘ధర్మస్థల నియోజకవర్గం’ సినిమాకు ఇచ్చానని చెప్పడంతో పాటు ముందు నుంచి ఈ చిత్రంపై ఆయన నమ్మకంగా ఉన్నారు.. టీమ్‌ను వెన్నంటి ఉండి ప్రోత్సహించారు. సుమన్, సాయి కుమార్, వరుణ్ సందేశ్, వితికా షేరుతో పాటు సీనియర్ నటీమణి కస్తూరి ఇందులో విలన్ పాత్రలో నటించారు.. మరి ఇంతమంది నటులతో నేటి రాజకీయాలపై తోట ప్రభ తెరకెక్కించిన సినిమా ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దామా..?

మూవీ రివ్యూ: ధర్మస్థల నియోజకవర్గం
నటీనటులు: సాయికుమార్, సుమన్, నటరాజ్, రాయంచ కొక్కుర, వరుణ్ సందేశ్, వితికా షేరు, శివ, రాజా రవీంద్ర, రాజీవ్ కనకాల, కాలకేయ ప్రభాకర్, పృథ్వి తదితరులు
ఎడిటింగ్: సాయిబాబు తలారి
సంగీతం: మహావీర్ ఎల్లంధర్
సినిమాటోగ్రఫర్: వెంకట హనుమ
లిరిక్స్: చంద్రబోస్
నిర్మాత: మేరుం భాస్కర్
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జై జ్ఞాన ప్రభ తోట
కథ:
ధర్మస్థలం నియోజకవర్గంలో ఎలాంటి ఎదురు లేకుండా వరుసగా ఏడుసార్లు గెలుపొందిన అవినీతి నేత బైరాజ్ (సాయికుమార్)కు, స్థానికంగా ఓ చిన్న ఛాయ్ బండి పెట్టుకుని బతికే ఈశ్వరయ్య (సుమన్) ఎనిమిదో ఎన్నికల్లో అనూహ్యంగా చెక్ పెడతాడు. ఒక సామాన్యుడు ఎన్నికల బరిలోకి దిగడానికి దారి తీసిన పరిస్థితులు ఏమిటి? అతని కుమారుడు బద్రి (నటరాజ్) మరణం వెనుక ఉన్న రహస్యం ఏంటి? మరోవైపు కాలేజీ అధ్యాపకురాలు అరుంధతి (వితికా షేరు) ఎవరిపై, ఎందుకు పోరాడుతోంది? విద్యావ్యవస్థలోని లోపాలు, యువతను నాశనం చేస్తున్న మత్తు పదార్థాల మాఫియా, స్వార్థ రాజకీయ నాయకుల ఆగడాలు వంటి కీలక సమస్యల చుట్టూ దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
కథనం:
సమాజంలో ఒక స్త్రీ గట్టిగా నిర్ణయించుకుంటే ఎంతటి మార్పునైనా తీసుకురాగలదు అనే బలమైన సందేశాన్ని దర్శకుడు తెరపై ఆవిష్కరించారు. వ్యవస్థ బాగుపడాలంటే ఆ మార్పు కేవలం ఒక గురువు ద్వారానే మొదలవ్వాలన్న ఆలోచన ప్రేక్షకులను తీవ్రంగా ఆలోచింపజేస్తుంది. ప్రస్తుత రాజకీయ నాయకులు ధనం కోసం ఎంతటి నీచానికైనా ఎలా దిగజారుతున్నారో చాలా సున్నితంగా, ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా చూపించిన విధానం మెచ్చుకోదగ్గది. అక్కడక్కడా సినిమాటిక్ స్వేచ్ఛను వాడుకున్నప్పటికీ, అసలు పాయింట్‌ను మాత్రం ఏమాత్రం పక్కదోవ పట్టకుండా సూటిగా చెప్పారు. రాజకీయాల్లో నిజాయితీగా సేవ చేసే నాయకులు ఉంటే ప్రజలు వారిని ఎంతలా ఆదరిస్తారనే విషయానికి వరుణ్ సందేశ్ చెప్పే మాటలు అద్దం పడతాయి. కేవలం స్థానిక సమస్యలకే పరిమితం కాకుండా, పొరుగు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్ వంటి చోట్ల జరిగిన అల్లర్ల వెనుక దాగి ఉన్న అదృశ్య శక్తుల కుట్రలను కూడా కథలో భాగం చేయడం ద్వారా దేశం పట్ల దర్శకుడికి ఉన్న బాధ్యత స్పష్టమవుతుంది. ఇది కేవలం ఒక ఊరికి సంబంధించిన కథ కాదు, నేటి యువత, ముఖ్యంగా విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు చూడాల్సిన సామాజిక అంశాలు ఈ సినిమాలో డిస్కస్ చేసాడు దర్శకుడు ప్రభ. ఎలాంటి అసభ్యత లేకుండా చాలా క్లీన్‌గా, ఒక అద్భుతమైన సామాజిక ప్రయోజనంతో ఒక మంచి ప్రయత్నమే చేసారు.
నటీనటులు:
సీనియర్ నటులు సుమన్, సాయికుమార్ తమ అద్భుత నటనతో ఒకరికొకరు గట్టి పోటీ ఇచ్చారు. పవర్ ఫుల్ డైలాగ్స్ తో పొలిటీషియన్‌గా సాయికుమార్ మెప్పిస్తే, సామాన్యుడి పాత్రలో సుమన్ తన అనుభవాన్నంతా రంగరించి జీవించేశారు. సమాజ శ్రేయస్సు కోసం పరితపించే అధ్యాపకురాలిగా వితికా షేరుకు అత్యంత కీలకమైన బాధ్యత దక్కింది.. ఆమె నటన ప్రేక్షకులకు ఇట్టే చేరువవుతుంది. సత్యప్రకాష్ వారసుడు నటరాజ్‌కు ఇది తొలి చిత్రమే అయినా చాలా పరిణితితో నటించాడు. విరామానికి ముందు అతని చుట్టూ తిరిగే మలుపు సెకండాఫ్‌పై ఉత్కంఠను పెంచుతుంది. హీరోయిన్ రాయంచ తెరపై చాలా ముద్దుగా కనిపించింది. తొలిసారిగా ప్రతినాయకి అవతారం ఎత్తిన కస్తూరి పర్వాలేదనిపించినా, ఆమెను ఇంకాస్త పవర్ ఫుల్‌గా వాడుకుంటే బాగుండేది. వరుణ్ సందేశ్ కనిపించే కాసేపు భావోద్వేగాలను పండిస్తాడు. రాజీవ్ కనకాల, శివ తమ పరిధి మేరకు ఆకట్టుకోగా, రాజా రవీంద్ర, షఫీ తక్కువ నిడివిలోనే కీలక బాధ్యతలు పోషించారు.
టెక్నికల్ టీం:
ఈ సినిమాకు చంద్రబోస్ రాసిన పాటలు ప్రధాన బలం. ఆయన సాహిత్యంలో ఉన్న లోతు కథాగమనానికి ఎంతగానో సహాయపడింది. వెంకట్ హనుమ సినిమాటోగ్రఫీ, మహావీర్ నేపథ్య సంగీతం, అస్లాం రాసిన మాటలు అన్నీ పర్లేదు.. రొటీన్‌గా డబ్బులు వచ్చే కమర్షియల్ ప్రేమకథను కాకుండా, సమాజానికి మేలు జరిగే ఒక సందేశాత్మక చిత్రాన్ని నిర్మించాలన్న నిర్మాత మేరుం భాస్కర్ అభిరుచిని మెచ్చుకోవాలి. ఇక మొదటి చిత్రంతోనే ఇంతటి బరువైన కథాంశాన్ని ఎంచుకోవడం దర్శకుడు జై చేసిన సాహసమే. తను ఎంచుకున్న రెండు ప్రధాన సమస్యలకు సరైన ముగింపు ఇచ్చే ప్రయత్నం చేసాడు. తొలి ప్రయత్నంలోనే చాలా మంది సీనియర్స్‌ను హ్యాండిల్ చేసారు.
పంచ్ లైన్:
ఓవరాల్‌గా ధర్మస్థల నియోజకవర్గం.. పొలిటికల్ ఎంటర్‌టైనర్ విత్ మెసేజ్..!
