హ్యాపీ రాజ్ సినిమా రివ్యూ.. జీవీ ప్రకాశ్ కుమార్ రీ లోడింగ్ వర్కవుట్ అవుతుందా..?
మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్ నటుడిగానూ రాణిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన హీరోగా సినిమాలు చేస్తూ అలరిస్తున్నాడు. తాజాగా హ్యాపీ రాజ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో జీవీ ప్రకాశ్ కుమార్ తో పాటు శ్రీ గౌరీ ప్రియ ('మ్యాడ్' ఫేమ్), జార్జ్ మేరియన్, అబ్బాస్, అదిరిచి అరుణ్ నటించారు.

మూవీ రివ్యూ: హ్యాపీ రాజ్
నటీనటులు: జీవీ ప్రకాశ్ కుమార్, శ్రీ గౌరీ ప్రియ (‘మ్యాడ్’ ఫేమ్), జార్జ్ మేరియన్, అబ్బాస్, అదిరిచి అరుణ్ తదితరులు..
సంగీతం: జస్టిన్ ప్రభాకరన్
సినిమాటోగ్రఫర్: మదన్ క్రిస్టోఫర్
ఎడిటర్: సెల్వ ఆర్కే
దర్శకత్వం: మరియా రాజా ఎలాంచెజియన్
నిర్మాత: జై వర్ద
కథ:
హ్యాపీ (జీవీ ప్రకాశ్ కుమార్) ఒక చదువుకున్న పల్లెటూరి యువకుడు. అతనికి పెళ్లి సంబంధాలు వస్తున్నా.. అమ్మాయిలు ప్రేమిస్తున్నా కానీ అతని తండ్రి (జార్జ్ మేరియన్) ప్రవర్తన, రూపం చూసి అమ్మాయిలు హ్యాపీని రిజెక్ట్ చేస్తుంటారు. ఊళ్లో వాళ్ళు తండ్రిని ఎగతాళి చేయడం, అదే కారణంతో తనకు పెళ్లి కాకపోవడంతో విసుగుచెందిన హ్యాపీ.. ఊరు వదిలి బెంగళూరుకి వెళ్లి సాఫ్ట్‌వేర్ జాబ్ సంపాదిస్తాడు. అక్కడ కావ్య (శ్రీ గౌరీ ప్రియ)తో పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారుతుంది. కావ్య తండ్రి రాజీవ్ (అబ్బాస్) చాలా హుందాగా, క్రమశిక్షణతో ఉండే వ్యక్తి. ఈ రెండు భిన్నమైన నేపథ్యాలు ఉన్న కుటుంబాలు కలిసినప్పుడు ఎలాంటి కన్ఫ్యూజన్ ఏర్పడింది? కావ్య కుటుంబం హ్యాపీ తండ్రిని అంగీకరించిందా? అసలు తండ్రి విలువను హ్యాపీ ఎలా తెలుసుకున్నాడు? అనేది మిగతా కథ.
కథనం:
హ్యాపీ రాజ్ సినిమా చాలా టిపికల్ లైన్‌తో వచ్చింది. మామూలుగా హీరో అంద వికారంగా ఉండటం.. అతడి చుట్టూ స్టోరీ నడిచే కథలు చూసాం కానీ ఇందులో దర్శకుడు తీసుకున్న లైన్ కొత్తగా అనిపించింది. కథ అంతా హీరో తండ్రి పాత్ర చుట్టూనే తిరుగుతుంది. తండ్రీకొడుకుల బంధం నేపథ్యంలో సాగే ఒక రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా అయినా కూడా లోపల చాలా విషయాలు టచ్ చేసాడు దర్శకుడు మరియా రాజా. తండ్రి రూపం, స్థాయి ఎలా ఉన్నా.. పిల్లలకి ఆయనే మొదటి హీరో అనే మంచి సందేశాన్ని దర్శకుడు ఇందులో చూపించే ప్రయత్నం చేశారు. తండ్రీకొడుకుల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ సినిమాకు ప్రధాన బలం. సినిమా చివరి 20 నిమిషాల్లో వచ్చే సున్నితమైన భావోద్వేగాలు, నటీనటుల పెర్ఫార్మెన్స్ సినిమాకు అదనంగా కలిసొచ్చే విషయాలు. ఫస్టాఫ్ అంతా కాస్త గందరగోళంగా సాగుతుంది. పైగా కామెడీ పెద్దగా వర్కవుట్ అవ్వలేదు. కొన్ని చోట్ల రైటింగ్ చాలా అవుట్ డేటెడ్‌గా అనిపిస్తుంది. తండ్రిని ఉద్దేశించి చేసే బాడీ షేమింగ్ జోక్స్ శృతి మించి, కాస్త ఇబ్బందిగా అనిపిస్తాయి. కథలో చాలా సన్నివేశాలు ముందే ఊహించేలా ఉండటం, స్క్రీన్‌ప్లే నెమ్మదిగా సాగడం కూడా కాస్త మైనస్. కానీ సెకండాఫ్‌లో ఆ లోపాలు కనిపించకుండా రైటింగ్‌తో కవర్ చేసాడు దర్శకుడు మరియా రాజా. ముఖ్యంగా క్లైమాక్స్ బాగా రాసుకున్నాడు. అబ్బాస్, జార్జ్ మధ్య వచ్చే సన్నివేశాలు బాగా వర్కవుట్ అయ్యాయి. చివర్లో హీరో తండ్రి పాత్ర గురించి రివీల్ చేసే సన్నివేశం కూడా బాగుంది. ఎమోషనల్‌గా సినిమాను ముగించేసారు. ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేకుండా సింపుల్ కథలు చూడాలనుకునే వాళ్లకు ఈ సినిమా మంచి ఛాయిస్.
నటీనటులు:
జివి ప్రకాశ్ కుమార్ చాలా బాగా నటించాడు. అమాయకత్వం, ఫ్రస్ట్రేషన్ కలగలిసిన పల్లెటూరి యువకుడి పాత్రలో జివి ప్రకాశ్ ఒదిగిపోయాడు. ముఖ్యంగా సెకండాఫ్‌లో వచ్చే ఎమోషనల్ సీన్స్‌లో అతని నటన చాలా బాగుంది. ఈ సినిమాకి అతిపెద్ద బలం జార్జ్ మేరియన్. తండ్రి పాత్రలో ఆయన జీవించారు. సినిమా భారం మొత్తం దాదాపు తన భుజాలపైనే వేసుకుని అద్భుతంగా నటించారు. ‘ప్రేమ దేశం’ ఫేమ్ అబ్బాస్ దాదాపు 11 ఏళ్ల తర్వాత ఈ సినిమాతో వెండితెరపై రీ-ఎంట్రీ ఇచ్చారు. హీరోయిన్ తండ్రి పాత్రలో చాలా డీసెంట్ అండ్ స్టైలిష్‌గా మెప్పించారు. శ్రీ గౌరీ ప్రియ తన పాత్ర పరిధి మేర చక్కగా నటించి, జివి ప్రకాశ్‌కి జోడీగా ఆకట్టుకుంది. మిగిలిన పాత్రలన్నీ ఓకే..
టెక్నికల్ టీం:
జస్టిన్ ప్రభాకరన్ సంగీతం కాస్త లౌడ్‌గా అనిపించింది.. పాటలు పర్లేదు. మదన్ క్రిస్టోఫర్ అందించిన సినిమాటోగ్రఫీ అదిరిపోయింది.. సెకండాఫ్‌లో పల్లెటూరి అందాలను చాలా బాగా చూపించారు. ఎడిటింగ్ కూడా ఓకే. ఇక నిర్మాణ విలువలు కథకు తగ్గట్లుగా ఉన్నాయి. దర్శకుడిగా మరియా రాజా మంచి కథ తీసుకున్నాడు.. దాన్ని పూర్తిస్థాయిలో చెప్పడంలో కాస్త కన్ఫ్యూజ్ అయినా ఓవరాల్‌గా ఎమోషనల్ డ్రామా చూపించారు.
పంచ్ లైన్:
ఓవరాల్‌గా హ్యాపీ రాజ్.. ఓ నాన్న కథ..!




