Hyderabad: హైదరాబాద్‌లో హై అలర్ట్.. కాచిగూడ రైల్వేస్టేషన్‌కు ఉగ్రవాదుల బెదిరింపు!
హైదరాబాద్‌లో బాంబు పేలుళ్లు జరుపుతామంటూ లష్కరే తోయిబా పేరుతో వచ్చిన బెదిరింపు మెయిల్ తీవ్ర కలకలం రేపింది. కాచిగూడ రైల్వే స్టేషన్, హోటల్ టూరిస్ట్ ప్లాజాను లక్ష్యంగా చేసుకుని 26/11 ముంబై ఉగ్రదాడుల తరహాలో దాడులు చేస్తామని ఈ లేఖలో బెదిరించారు ఉగ్రవాదలు. దీంతో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమై భద్రతను కట్టుదిట్టం చేశారు.

హైదరాబాద్‌లో భద్రతాపరమైన ఆందోళనలు కలిగించే పరిణామం వెలుగులోకి వచ్చింది. నగరంలోని కీలక రవాణా కేంద్రాలు, వాణిజ్య ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడతామంటూ వచ్చిన ఓ బెదిరింపు సందేశం పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. కాచిగూడ రైల్వే స్టేషన్‌తో పాటు సమీపంలోని హోటల్ టూరిస్ట్ ప్లాజాలో పేలుళ్లు జరుపుతామంటూ ఈ-మెయిల్ రావడంతో అధికారులు భద్రతా చర్యలను విస్తృతం చేశారు. నవంబర్ 21న హైదరాబాద్ పోలీస్ స్పెషల్ బ్రాంచ్‌కు ఈ సమాచారం అందినట్లు తెలుస్తోంది. పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ పేరుతో ఈ సందేశం వచ్చినట్లు పోలీసు వర్గాలు గుర్తించాయి. 2008లో ముంబైలో జరిగిన 26/11 తరహా దాడులను హైదరాబాద్‌లోనూ పునరావృతం చేస్తామని, ఈ దాడుల్లో 300 మందికి పైగా ప్రాణాలు తీస్తామని అందులో హెచ్చరించినట్లు సమాచారం. అయితే, ఈ మెయిల్ నిజంగానే ఆ సంస్థ నుంచి వచ్చిందా? అనే అంశంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. కశ్మీర్‌లో ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్ ఈ బెదిరింపులకు కారణంగా పేర్కొన్నట్లు తెలుస్తోంది. కుల్గాం జిల్లా జంగల్‌పోరా ప్రాంతంలో నవంబర్ 18న భద్రతా బలగాలు నిర్వహించిన ఆపరేషన్‌లో లష్కరే తోయిబాకు చెందిన లతీఫ్ భట్, అతడి అనుచరులు హతమయ్యారు. ఈ ఘటనకు ప్రతీకారం తీర్చుకుంటామనే హెచ్చరికను మెయిల్‌లో ప్రస్తావించినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.
ఈ పరిణామంతో నగర పోలీసు ఉన్నతాధికారులు అన్ని విభాగాలను అప్రమత్తం చేశారు. జోన్లవారీగా పోలీసు అధికారులకు భద్రతా ఏర్పాట్లపై ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా కాచిగూడ రైల్వే స్టేషన్, టూరిస్ట్ ప్లాజా పరిసరాల్లో నిఘా పెంచాలని సూచించారు. నగరంలోని ఇతర రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, హోటళ్లు, ప్రార్థనా స్థలాలు, జనసమ్మర్థం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోనూ తనిఖీలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. పెట్రోలింగ్ బృందాలు క్షేత్రస్థాయిలో మరింత అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు, వాహనాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పోలీసు యంత్రాంగం సూచించింది. అవసరమైన ప్రాంతాల్లో యాంటీ సబోటేజ్ తనిఖీలు చేపట్టడంతోపాటు ఇతర భద్రతా విభాగాలతో సమన్వయం చేసుకోవాలని స్పష్టం చేసింది.
మరోవైపు ఈ బెదిరింపు సందేశం వెనుక ఉన్న వ్యక్తులు లేదా నెట్‌వర్క్‌ను గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మెయిల్ పంపిన మూలాలను పరిశీలిస్తూ, దాని ప్రామాణికతను నిర్ధారించే పనిలో ఉన్నారు. ఇప్పటివరకు బెదిరింపులో పేర్కొన్న ప్రాంతాల్లో పేలుడు పదార్థాలు గుర్తించినట్లు ఎలాంటి సమాచారం లేదు. ప్రస్తుతానికి ఇది ఈ-మెయిల్ ఆధారంగా తీసుకున్న ముందస్తు భద్రతా చర్యేనని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
