AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆడవాళ్లు vs మగవాళ్లు.. ఎవరు ఎక్కువ అబద్ధాలు చెప్తారు..? అధ్యయనంలో అవాక్కయ్యే నిజాలు..

అబద్ధం చెప్పడం అనేది చాలామందిలో కనిపించే అలవాటే. అయితే.. సమస్యల నుంచి తప్పించుకోవడానికో, తప్పులను దాచుకోవడానికో చేసే ఈ అబద్ధాల్లో పురుషులు ముందుంటారా? లేక మహిళలు ఎక్కువగా చెబుతారా? పోర్ట్స్‌మౌత్ విశ్వవిద్యాలయ అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. ఎవరు ఎక్కువ అబద్ధాలు చెప్తారు..? అనే విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

ఆడవాళ్లు vs మగవాళ్లు.. ఎవరు ఎక్కువ అబద్ధాలు చెప్తారు..? అధ్యయనంలో అవాక్కయ్యే నిజాలు..
Men Vs Women Lying
Krishna S
|

Updated on: Nov 22, 2026 | 9:42 PM

Share

అబద్ధం చెప్పడం అనేది చాలామందిలో కనిపించే సాధారణ అలవాటు. కొందరు సమస్యల నుంచి తప్పించుకోవడానికి అబద్ధాలు చెబితే, మరికొందరు తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి అబద్ధం ఆడతారు. ఎదుటివారిని బాధపెట్టకుండా ఉండటానికో, లేదా ఇబ్బందికర పరిస్థితుల నుంచి బయటపడటానికో అబద్ధం చెప్పేవాళ్లూ ఉంటారు. చిన్న చిన్న విషయాలకు కూడా అబద్ధాలు చెబుతూ, జరిగిన విషయాన్ని అతిశయోక్తిగా చెప్పే అలవాటు కొందరిలో ఉంటుంది. తొలుత ఇది చిన్నదిగా అనిపించినా.. కాలక్రమేణా ఇది సంబంధాలు, స్నేహాలు, సామాజిక జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. పదేపదే అబద్ధాలు చెప్పడం వల్ల నమ్మకం సన్నగిల్లి, బంధాల్లో చీలికలు ఏర్పడే ప్రమాదం ఉంది. ఈ క్రమంలో తరచుగా వినిపించే ప్రశ్న.. స్త్రీలు ఎక్కువగా అబద్ధాలు చెబుతారా? లేక పురుషులు ఎక్కువగా చెబుతారా?.. దీనికి సంబంధించి ఓ అధ్యయనం ఆసక్తికర విషయాలను వెల్లడించింది. కొందరు మహిళలు చిన్న విషయాలను దాచడానికి అబద్ధం చెబుతారని భావిస్తే, పురుషులు తమ తప్పులను లేదా ఇతర విషయాలను కప్పిపుచ్చుకోవడానికి అబద్ధం చెబుతారని మరికొందరు అంటారు. దీనిపై పోర్ట్స్‌మౌత్ విశ్వవిద్యాలయ పరిశోధకురాలు డాక్టర్ బ్రియాన్నా వెరిగిన్ నేతృత్వంలో జరిగిన అధ్యయనంలో ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. తాము మరింత బాగా అబద్ధాలు చెప్పగలమని, తమ అబద్ధాలను సులభంగా దాచగలమని మహిళలతో పోలిస్తే పురుషులు రెండింతలు ఎక్కువగా నమ్ముతున్నట్లు ఈ అధ్యయనం పేర్కొంది.

పురుషులు అబద్ధాలు చెప్పడానికి ప్రధాన కారణాలివే..

తప్పులను దాచుకోవడం: ఇంట్లో అయినా, ఆఫీసులో అయినా తాము చేసిన పొరపాట్లను ఒప్పుకోవడానికి కొందరు పురుషులు సంకోచిస్తారు. నింద పడుతుందనే భయంతో నిజాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేస్తారు.

ప్రతిష్టను కాపాడుకోవడం: సమాజంలో తమ పరువు, గౌరవం నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో కొందరు అబద్ధాలు చెబుతారు. ఆర్థిక స్థితి, కెరీర్ విజయాలు లేదా వ్యక్తిగత విషయాలను గొప్పగా, అతిశయోక్తిగా చెప్పే ధోరణి కనిపిస్తుంది.

బాధ్యతల నుంచి తప్పించుకోవడం: కుటుంబ బాధ్యతలు, ఆర్థిక నిర్ణయాలు లేదా సంబంధాల్లో అంచనాలు అందుకోలేనప్పుడు కొందరు సాకులు చెబుతూ విషయాన్ని దాటవేయడానికి ప్రయత్నిస్తారు.

ఘర్షణలు నివారించడం: ప్రతి విషయానికీ వివరణ ఇవ్వడం, వాదనలు పడటం ఇష్టం లేక కొందరు పురుషులు చిన్న విషయాలను దాచిపెడతారు. అయితే ఇవి భవిష్యత్తులో అపనమ్మకానికి దారితీయవచ్చు.

మహిళలు ఎందుకు అబద్ధాలు చెబుతారు?

మనోభావాలు నొప్పించకుండా ఉండేందుకు: ఎదుటివారి మనసు బాధపెట్టకూడదనే ఉద్దేశంతో కొందరు మహిళలు తమ నిజమైన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పరు. ఉదాహరణకు నచ్చని బహుమతి ఇచ్చినా.. బాగుందని చెప్పడం వంటివి చేస్తుంటారు.

సంబంధాలను నిలబెట్టుకోవడానికి: కుటుంబం, స్నేహం లేదా వైవాహిక బంధాల్లో అపార్థాలు తలెత్తకుండా ఉండేందుకు కొన్ని విషయాలను దాచిపెట్టడం లేదా పరిస్థితిని తేలికపరచడం చేస్తారు.

భావోద్వేగ భద్రత కోసం: తమ ఆలోచనలు, వ్యక్తిగత నిర్ణయాలను బయటకు చెబితే ఎదుటివారు ఎలా స్పందిస్తారో, ఎక్కడ తప్పుపడతారోనన్న ఆందోళనతో కొందరు విషయాలను దాచుకుంటారు.

భావాలను వ్యక్తపరచలేకపోవడం: లోలోపల బాధ, కోపం లేదా కలత ఉన్నప్పటికీ.. బయటకు మాత్రం “నేను బాగానే ఉన్నాను” అని చెబుతుంటారు. భావోద్వేగాలను పంచుకోవడానికి సౌకర్యంగా లేకపోవడం లేదా ఎదుటివారిని ఇబ్బంది పెట్టకూడదనే కారణంతో ఇలా చేస్తుంటారు.

అనవసర ప్రశ్నలు, విమర్శల నుంచి తప్పించుకోవడానికి: వ్యక్తిగత జీవితం, ఖర్చులు, స్నేహాలు లేదా నిర్ణయాలపై పదేపదే ప్రశ్నలు ఎదురైనప్పుడు, తమను ఎవరూ అర్థం చేసుకోరని భావించినప్పుడు కొందరు నిజాన్ని దాచిపెడతారు.

అబద్ధం చెప్పడం అనేది ఒక మానవ సహజ ప్రవృత్తి. స్త్రీ అయినా, పురుషులైనా ఏదో ఒక సందర్భంలో అబద్ధం ఆడుతూనే ఉంటారు. అయితే దాని వెనుక ఉండే కారణాలు వేర్వేరుగా ఉంటాయి. పురుషులు తప్పులు కప్పిపుచ్చుకోవడానికి లేదా పేరు నిలబెట్టుకోవడానికి మొగ్గు చూపితే, మహిళలు బంధాలను కాపాడుకోవడానికి లేదా భావోద్వేగ ఇబ్బందులను తప్పించుకోవడానికి అబద్ధం చెప్పవచ్చు. అయినప్పటికీ ఇది అందరికీ ఒకేలా వర్తించదు. వ్యక్తి స్వభావం, పరిస్థితులు, సంబంధాల ఆధారంగా కారణాలు మారుతుంటాయి.

Follow Us