DC Movie Review : డిసి మూవీ రివ్యూ.. అనిరుధ్ మ్యూజికల్ కాన్సర్ట్.. లోకేష్ మ్యాజికల్ ఎఫర్ట్..!
ఇన్నాళ్లూ దర్శకుడిగా సత్తా చూపించిన లోకేష్ కనకరాజ్.. డిసి సినిమాతో హీరో అయ్యాడు. మొన్నే కెప్టెన్ మిల్లర్ సినిమాతో నేషనల్ అవార్డు అందుకున్న అరుణ్ మాదేశ్వరన్ దీనికి దర్శకుడు. యాక్షన్ క్రైమ్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం..

మూవీ రివ్యూ: డిసి
నటీనటులు: లోకేష్ కనకరాజ్, సంజన కృష్ణమూర్తి, వామికా గబ్బి, అవినాష్ రఘుదేవన్, కస్తూరి రాజా తదితరులు
సినిమాటోగ్రఫీ: ముఖేష్ జి
ఎడిటింగ్: ప్రసన్న జికే
సంగీతం: అనిరుధ్ రవిచందర్
నిర్మాత: కళానిధి మారన్
కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: అరుణ్ మాదేశ్వరన్
కథ:
సర్కార్ ముఠాలో దేవదాస్ (లోకేష్ కనగరాజ్) కీలక సభ్యుడు. పోలీసుల ఆయుధాలను దొంగిలించడం వీళ్ల ప్రధాన పని. అయితే, ఓ సామాన్యుడు తన కొడుకు చదువు కోసం దాచుకున్న ఏడు లక్షల రూపాయల కోసం పోలీసులు అతడిని దారుణంగా చంపి ఆ డబ్బును కాజేస్తారు. ఈ అన్యాయానికి ప్రతీకారంగా దేవదాస్ బృందం పోలీసులపై ఎదురుదాడి చేస్తుంది. దీంతో బోగరాజు నేతృత్వంలోని ఓ ప్రత్యేక పోలీసు దళం వీళ్ల వేట మొదలుపెడుతుంది. ఈ క్రమంలో గాయని పార్వతి (సంజన కృష్ణమూర్తి)తో దేవదాస్ ప్రేమలో పడటం, దురదృష్టవశాత్తూ ఆమె పోలీసుల దాడిలో ప్రాణాలు కోల్పోవడం జరుగుతాయి. ఆ దారుణం తర్వాత వేశ్యగా ఉన్న చంద్ర (వామికా గబ్బి)కు సాయం చేసి ఆమెను సురక్షితంగా బయటకు తీసుకొస్తాడు. పేదల కోసం, ముఖ్యంగా చదువుకునే హక్కు కోసం ఆ నాయకుడు సాగించిన పోరాటమే ఈ చిత్రం. అక్కడ్నుంచి ఏం జరిగింది అనేది అసలు కథ..
కథనం:
దర్శకుడు ఎంచుకున్న మార్గం చాలా షార్ట్ అండ్ షార్ప్‌గా ఉంది. మొదటి సీన్ నుంచే ప్రేక్షకుల దృష్టిని పూర్తిగా ఆకర్షించేలా చిత్రాన్ని మలిచారు. పైకి కేవలం క్రైమ్ డ్రామాలాగా కనిపించినా, లోపల బలమైన సామాజిక అంశాన్ని, పేదల విద్యా హక్కును చర్చించారు. హీరో పాత్రను తీర్చిదిద్దిన విధానం చాలా కొత్తగా అనిపిస్తుంది. హీరో పెద్దగా డైలాగులు చెప్పడు.. కేవలం తన కళ్ళతో, హావభావాలతోనే ప్రేక్షకులకు తన ఉద్దేశాలను వివరిస్తాడు. పార్వతితో నడిచే ప్రేమ ప్రహసనం హృదయాలను హత్తుకునేలా సాగుతుంది. విశ్రాంతి సమయానికి ముందు వచ్చే పోరాట సన్నివేశాలు అద్భుతంగా పండాయి. ఎన్నాళ్ళయిందో ఒక అదిరిపోయే ఇంటెన్స్ యాక్షన్ డ్రామా చూసి.. DCతో ఆ లోటు తీరిపోయిందని కచ్చితంగా అనుకుంటారు ఆడియన్స్. పీక్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అంటారు కదా అలాంటిదే ఈ సినిమా.. వెరీ ఫస్ట్ సీన్ నుంచి క్లైమాక్స్ వరకు ఎడ్జ్ ఆఫ్ ది సీట్ అన్నట్టు తీశాడు దర్శకుడు అరుణ్ మాదేశ్వరన్. ఇదేమీ తెలియని కథ కాదు.. ఎన్నో సినిమాల్లో చూసిన కథే.. సమాజానికి ఎదురెళ్లే ఒక గ్యాంగ్ స్టర్.. సమాజం చేతిలో మోసపోయిన ఒక అమ్మాయి.. కలిసి చేసే ప్రయాణమే డిసి సినిమా. స్టోరీలోకి వెళ్లడానికి అరగంట తీసుకున్నాడు.. ప్రీ ఇంటర్వెల్ నుంచి రేసుగుర్రంలా పరుగులు పెట్టింది స్క్రీన్ ప్లే.. ముఖ్యంగా అమ్మాయిలని సేవ్ చేసే సీన్ అయితే నెక్స్ట్ లెవెల్. అక్కడ అనిరుద్ గాడ్ మోడ్ లోకి వెళ్లిపోయాడు.. ఆ BGMకు థియేటర్ అంతా ఊగిపోయింది. సెకండ్ హాఫ్ కూడా ఎక్కడ తగ్గలేదు.. ఇంత రా అండ్ రస్టిక్ కథలో కూడా ఎమోషన్ ఎక్కడ మిస్ చేయలేదు అరుణ్ మాదేశ్వరన్. అదే సినిమాకు ప్రాణం. ఇక సెకండాఫ్‌లో చంద్ర పాత్ర ప్రవేశించినప్పటి నుంచి వేగం అమాంతం పుంజుకుంటుంది. ఎక్కడా బోర్ కొట్టించకుండా యాక్షన్ సీక్వెన్సులను చాలా వినూత్నంగా రూపొందించారు. కొన్ని చోట్ల కాస్త స్లో అనిపించినా వెంటనే వచ్చే భారీ ఫైటింగ్ సీన్స్‌తో ఆ లోపాన్ని కప్పిపుచ్చారు. తెరకెక్కించిన దర్శకుడు వేరైనా సరే.. అడుగడుగునా లోకేష్ మార్క్ సస్పెన్స్, మేకింగ్ స్టైల్ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఎమోషనల్ సీన్స్, గన్స్ పట్టుకుని చేసే ఫైట్స్ బాగా కుదిరాయి. పేదల పక్షాన నిలబడే ఓ వ్యక్తి ప్రయాణాన్ని చాలా లోతుగా, అర్థవంతంగా తెరమీద ఆవిష్కరించారు.
నటీనటులు:
దేవదాస్ పాత్రలో లోకేష్ కనగరాజ్ అద్భుతమైన ప్రతిభ కనబరిచాడు. కేవలం కెమెరా వెనక మాత్రమే కాదు, ముందు కూడా తాను ఎంతటి సమర్థుడో నిరూపించాడు. చాలా కంట్రోల్డ్‌గా నటిస్తూ తన కళ్ళతోనే భావాలను పలికించాడు. పార్వతిగా సంజన కృష్ణమూర్తి చాలా అందంగా కనిపించడమే కాకుండా, తన నటనతో భావోద్వేగాలకు గురిచేస్తుంది. ఇక చంద్ర పాత్రలో నటించిన వామికా గబ్బి మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఓ నిస్సహాయురాలిగా మొదలై, ఏకంగా తిరుగుబాటు చేసే స్థాయికి ఆమె మారే తీరు ప్రేక్షకులతో కచ్చితంగా చప్పట్లు కొట్టిస్తుంది. మిగిలిన సహాయక పాత్రలన్నీ తమ పరిధి మేరకు చక్కగా మెప్పించాయి.
టెక్నికల్ టీం:
డిసి సినిమాకు ప్రాణం, ఆరోప్రాణం అన్నీ అనిరుధ్ రవిచందర్. ఆయన అందించిన నేపథ్య సంగీతం ఈ చిత్రానికి వెన్నెముకగా నిలిచింది. ప్రతి సన్నివేశాన్ని, ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్సులలో తన సంగీతంతో మరో స్థాయికి తీసుకెళ్లాడు. కెమెరా పనితనం చాలా బాగుంది. తెరపై సరికొత్త కలర్ టోన్ వాడటం వల్ల విజువల్స్ చాలా తాజాగా అనిపిస్తాయి. ఎడిటింగ్ విభాగం కాస్త శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది. అక్కడక్కడా కొన్ని సీన్స్ ల్యాగ్ అనిపిస్తాయి. సన్ పిక్చర్స్ నిర్మాణ విలువలు అత్యున్నత ప్రమాణాల్లో ఉన్నాయి. దర్శకుడు అరుణ్ మాదేశ్వరన్ తన మేకింగ్ స్టైల్ చూపించాడు.. మరోసారి పోలీసుల చేతిలో అణిచివేయబడుతున్న సామాన్యుల కథనే తీసుకున్నాడు.
పంచ్ లైన్:
ఓవరాల్‌గా డిసి.. గన్స్ అండ్ రోజెస్.. మంచి సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్..!
