ఎన్ని సినిమాలు చేసామనేది కాదు.. ఈ రోజుల్లో ప్రతీదీ మొదటి సినిమా మాదిరే. ఒక్క ఫ్లాప్ వచ్చిందంటే.. తర్వాతి సినిమాకు టెస్ట్ మొదలవుతుంది. మెగాస్టార్ చిరంజీవి సైతం దీనికి మినహాయింపు కాదు.. 153 సినిమాలు చేసిన మెగాస్టార్‌కు 154వ సినిమా వాల్తేరు వీరయ్య లిట్మస్ టెస్ట్ పెడుతుంది. ఇండస్ట్రీలో చిరంజీవి మార్కెట్‌కు.. ఆయన కెరీర్‌కు అత్యంత కీలకంగా మారబోతుంది బాబీ సినిమా. దానికి కారణమేంటి..? ఒకప్పుడు చిరంజీవి సినిమా వచ్చిందంటే బాక్సాఫీస్ దగ్గర ఉండే వైబ్రేషన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతెందుకు.. ఐదేళ్ళ కింద ఖైదీ నెం 150కి సైతం మెగా పవర్ చూపించారు చిరంజీవి. 9 ఏళ్ళ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చినా.. వచ్చీ రావడంతోనే రూ.100 కోట్ల షేర్ వసూలు చేసి తన సత్తా తగ్గలేదని మెగాస్టార్ చూపించారు.
నాన్ బాహుబలి కేటగిరీలో రూ.100 కోట్ల షేర్ సాధించిన మొదటి హీరో చిరంజీవి మాత్రమే. ఖైదీ నెం 150 తర్వాత ఆ రేంజ్ మాస్ మ్యాజిక్ మళ్లీ మెగాస్టార్ చేయలేదనే చెప్పాలి. పీరియాడికల్ డ్రామాగా వచ్చిన సైరా జస్ట్ ఓకే అనిపించగా.. భారీ అంచనాలతో వచ్చిన ఆచార్య దారుణంగా నిరాశ పరిచింది. ఆచార్య మూవీలో చిరంజీవి, రాంచరణ్ కలిసి నటించినా.. కథలో లోపాలతో ఆ మూవీ మెగా ఫ్యాన్స్‌ను తీవ్రంగానే నిరాశపరిచింది. ఇక మొన్నొచ్చిన గాడ్ ఫాదర్‌కు పాజిటివ్ టాక్ వచ్చినా.. వసూళ్లు మాత్రం ఊహించినంత రాలేదు.
సాధారణంగా చిరంజీవి సినిమాకు పాటిజివ్ టాక్ వస్తే కలెక్షన్లు సునామీలా వస్తాయి. కానీ గాడ్ ఫాదర్‌కు అది జరగలేదు. ఖైదీ నెం 150, సైరా, ఆచార్యతో పోలిస్తే గాడ్ ఫాదర్ ఓపెనింగ్స్ చాలా తక్కువగా ఉన్నాయి. అంటే చిరు మేనియా తగ్గిందా లేదంటే రీమేక్ సినిమా కాబట్టి ఆడియన్స్ పట్టించుకోలేదా అనేది సస్పెన్స్. దీనికి సమాధానం వాల్తేరు వీరయ్య చెప్తుందంటున్నారు విశ్లేషకులు. వాల్తేరు వీరయ్య చిరంజీవి స్టైల్‌లో సాగే రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు లాంటి పక్కా కమర్షియల్ సినిమా. సంక్రాంతికి విడుదల కానున్న ఈ సినిమాకు కలెక్షన్స్ అదిరిపోయాయంటే.. చిరు మేనియా ఇంకా నడుస్తుందని అర్థం. అలా కాకుండా గాడ్ ఫాదర్‌లా మంచి టాక్ వచ్చినా.. వసూళ్లు రాకపోతే మాత్రం మెగాస్టార్ మార్కెట్‌పైనే అనుమానాలు వచ్చేస్తాయి. అందుకే సంక్రాంతి రేసులో నిలవబోతున్న వాల్తేరు వీరయ్య చిరంజీవికి అత్యంత కీలకంగా మారింది.
(ప్రవీణ్ కుమార్, టీవీ9 తెలుగు)
మరిన్ని సినిమా వార్తలు చదవండి