AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కమల్‌హాసన్‌ కొత్త సినిమాకు వివాదాల సెగ.. ‘సండియర్’ పేరుపై రచ్చ!

ఒక సినిమా టైటిల్..తమిళనాడులో మళ్లీ కులాల కుంపటిని రాజేస్తోంది. రెండు దశాబ్దాల కిందట ఇదే వివాదంతో వెనక్కి తగ్గిన హీరో కమల్‌హాసన్..ఇప్పుడదే పేరుతో మరోసారి వివాదానికి కేరాఫ్ అయ్యాడు. అప్పట్లో రాజకీయ ఒత్తిడికి తలొగ్గిన కమల్‌హాసన్..ఇప్పుడు మాత్రం వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. ఇప్పుడీ వివాదం పోలీస్ స్టేషన్‌ మెట్లెక్కింది. అసలీ టైటిల్‌లో అంత వివాదం ఏముంది? రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ అదే పేరు ఎందుకు తెరపైకి వచ్చింది? తమిళనాడులో రాజకీయంగా, సామాజికంగా ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తోంది?

కమల్‌హాసన్‌ కొత్త సినిమాకు వివాదాల సెగ.. ‘సండియర్’ పేరుపై రచ్చ!
Kamal Haasan
Ram Naramaneni
|

Updated on: Nov 11, 2026 | 8:35 PM

Share

సండియర్… ఈఒక్క పదం చుట్టూ రాజకీయంగా, సామాజికంగా పెద్ద రాద్దాంతమే జరుగుతోంది తమిళనాట. నవంబర్‌ 7న తన పుట్టినరోజు సందర్భంగా కమల్‌హాసన్‌ కొత్త సినిమా టైటిల్‌ను ప్రకటించాడు. సండియర్ పేరు వినపడగానే కొన్ని పార్టీలు నొసలు ముడివేశాయి.. మరికొందరు రెండు దశాబ్దాలు వెనక్కి వెళ్లి అప్పట్లో జరిగిన వివాదాన్ని గుర్తు చేసుకున్నారు. మరికొందరు పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. ఇంకొందరు కమల్‌హాసన్‌పై విమర్శలబాణాలు ఎక్కుపెట్టారు. పాత గాయాలను మళ్లీ కెలికేలా టైటిల్‌ ఉందంటూ తమిళనాడులోని పుదియ తమిళగం అనే పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సినిమా పేరు మార్చకపోతే దక్షిణ తమిళనాడులో ఉద్రిక్తతలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరిస్తోంది.

అంతేకాదు సినిమా టీజర్ కూడా హింసను ప్రేరేపించేలా డిజైన్ చేశారని, ప్రతీకారం రక్తపాతంతోనే తీరుతుంది..అంటూ రెచ్చగొట్టే డైలాగ్స్‌ ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది కచ్చితంగా సామాజికంగా విధ్వేషాలను రెచ్చగొట్టే సినిమానే అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..

సండియర్ టైటిల్ వివాదం..ఇప్పుడే కొత్తగా పుట్టింది కాదు. చాలా ఓల్డ్‌ది. 2003లోనే కమల్‌హాసన్‌ ‘సండియర్’ పేరుతో సినిమా చేయాలనుకున్నాడు. అప్పట్లోనే పుదియ తమిళగం పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ పదం ఆధిపత్య సామాజికవర్గాలను గొప్పగా చూపించడమే కాకుండా, దక్షిణ తమిళనాడులో కత్తుల సంస్కృతిని పెంచే ప్రమాదం ఉందని ఆరోపించింది. ఈవివాదంతో అప్పట్లో సండియర్ షూటింగ్‌ ఆగిపోయింది. కమల్‌హాసన్ అప్పటి ముఖ్యమంత్రి జయలలితను కలిసి సమస్యను పరిష్కరించుకోవాలని ప్రయత్నించినా కుదరలేదు. టైటిల్ మార్చాలని ప్రభుత్వంవైపు నుంచి కూడా ఒత్తిడి వచ్చింది. చివరకు వెనక్కి తగ్గి సినిమా పేరును విరుమాండి’గా మార్చి రిలీజ్ చేశారు కమల్‌హాసన్. అలా అప్పట్లో ముగిసిన వివాదం.. మళ్లీ ఇప్పుడు అదే టైటిల్‌తో కొత్త సినిమా ప్రకటన రావడంతో మళ్లీ తిరిగి మొదలైంది.

‘సండియర్’ అంటే మొండితనం, దూకుడు, ఆధిపత్య ధోరణి కలిగిన వ్యక్తి, రౌడీ అనే అర్థాలు వస్తాయి. అయితే దక్షిణ తమిళనాడులో ఈ పదానికి ప్రత్యేకమైన సామాజిక, రాజకీయ నేపథ్యం ఉందని పుదియ తమిళగం పార్టీ చెబుతోంది. ఒక సామాజికవర్గం ఆధిపత్యాన్ని, రౌడీయిజాన్ని సూచించేలా సండియర్‌ పదాన్ని ప్రయోగిస్తారన్నది ఆ పార్టీ వాదన. దేవర్ వర్గానికి, దళిత సామాజికవర్గాలకు మధ్య గతంలో చోటుచేసుకున్న ఘర్షణలు, వైషమ్యాల నేపథ్యంలో ఇలాంటి పేర్లు మళ్లీ ఉద్రిక్తతలకు కారణమవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తోంది. రెండు దశాబ్దాలుగా సామాజిక సామరస్యం కోసం ప్రయత్నాలు జరుగుతున్న సమయంలో.. మళ్లీ అదే పేరుతో సినిమా తీసుకురావడం పాత గాయాలను రెచ్చగొట్టడమేనని విమర్శిస్తోంది. సినిమా పోస్టర్లు, ప్రచార చిత్రాల్లో కత్తులు, రక్తపాతం, ప్రతీకారం లాంటి సన్నివేశాలు ఉండేలా కనిపిస్తున్నాయని పుదియ తమిళగం పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.

“2003లో సండియర్ పేరుతోనే కమల్‌హాసన్ సినిమా తీసేందుకు ప్రయత్నించి వెనక్కి తగ్గారు. ఇప్పుడు అదే పేరుతో, చేతిలో కత్తి.. రక్తం కారుతున్న దృశ్యాలతో పాటు.. ప్రతీకారానికి ప్రతీకారమే సమాధానం అంటూ ప్రచార చిత్రాలను విడుదలే చేశారు. ఇది దక్షిణ తమిళనాడులో రెండు సామాజిక వర్గాల మధ్య ఘర్షణలు చోటు చేసుకునే అవకాశం ఉంది. మామూలుగా నటుడిగా సినిమా తీస్తే సరే. ఆయన ఇప్పుడు ఒక ప్రజాప్రతినిధి, ఒక రాజ్యసభ ఎంపీ. అలాంటి వ్యక్తి ఇలాంటి సినిమాలు తీయకూడదు” అని పుదియ తమిళగం పార్టీ బాబు

ఇప్పుడీ వివాదానికి రాజకీయం కూడా తోడైంది. డీఎంకే ఎంపీ అయిన కమల్‌హాసన్, ఆపార్టీ రాజకీయ ప్రయోజనాల కోసమే ఇలాంటి సినిమా చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే సినిమా కథ ఎలా ఉన్నా.. కుల వైషమ్యాలను రెచ్చగొట్టేలా ఉండే టైటిల్‌ను తొలగించాల్సిందాలని రాజకీయంగానూ డిమాండ్లు ఊపందుకున్నాయి. సేలం ఎస్పీ కార్యాలయంలో కమల్‌హాసన్‌, దర్శకుడు ఎస్‌.యు. అరుణ్‌కుమార్‌పై ఫిర్యాదు చేశారు. మరి రెండు దశాబ్దాల కిందట విరుమాండిగా పేరు మార్చుకున్న కమల్‌.. ఈసారి ‘సండియర్’ టైటిల్‌తోనే ముందుకెళ్తారా? లేక తగ్గుతారా అన్నది చూడాలి.

Follow Us
20 ఏళ్ల తర్వాత మళ్లీ ‘సండియర్’ వివాదం..
20 ఏళ్ల తర్వాత మళ్లీ ‘సండియర్’ వివాదం..
పొడుపు కథ: ఎక్కలేని చెట్టుకు కోట్లు కాయలు.. ఇదేంటో చెప్పగలరా?
పొడుపు కథ: ఎక్కలేని చెట్టుకు కోట్లు కాయలు.. ఇదేంటో చెప్పగలరా?
పెళ్లి చేసుకున్న అనిరుధ్- కావ్యా మారన్.. ఫొటోస్ ఇదిగో
పెళ్లి చేసుకున్న అనిరుధ్- కావ్యా మారన్.. ఫొటోస్ ఇదిగో
రాత్రి నానబెట్టిన మెంతులనీరు పరగడుపున తాగితే శరీరంలో జరిగేది ఇదే!
రాత్రి నానబెట్టిన మెంతులనీరు పరగడుపున తాగితే శరీరంలో జరిగేది ఇదే!
పండుగల స్పెషల్ పప్పు బొబ్బట్లు.. ఈ చిన్న చిట్కాలతో అదిరే రుచి
పండుగల స్పెషల్ పప్పు బొబ్బట్లు.. ఈ చిన్న చిట్కాలతో అదిరే రుచి
తిరుమలలో ముందుగా ఈ స్వామిని దర్శించుకున్నాకే శ్రీవారి దర్శనం..
తిరుమలలో ముందుగా ఈ స్వామిని దర్శించుకున్నాకే శ్రీవారి దర్శనం..
ఉచితంగా ల్యాప్‌టాప్, ట్యాబ్.. వీరికి కేంద్రం అదిరిపోయే గుడ్ న్యూస
ఉచితంగా ల్యాప్‌టాప్, ట్యాబ్.. వీరికి కేంద్రం అదిరిపోయే గుడ్ న్యూస
 చలికాలంలో ముఖం కళ తప్పుతోందా? ఈ చిట్కాలు పాటించండి!
 చలికాలంలో ముఖం కళ తప్పుతోందా? ఈ చిట్కాలు పాటించండి!
సమ్రీన్ కౌర్‌తో స్టార్ బౌలర్ అర్షదీప్ సింగ్ నిశ్చితార్థం
సమ్రీన్ కౌర్‌తో స్టార్ బౌలర్ అర్షదీప్ సింగ్ నిశ్చితార్థం
చలికాలంలో తప్పక ట్రై చేయాల్సిన నాన్ వెజ్ డిషెస్ ఇవి..
చలికాలంలో తప్పక ట్రై చేయాల్సిన నాన్ వెజ్ డిషెస్ ఇవి..