‘నాకు పిల్లలు వద్దు..’ నటి వరలక్ష్మి శరత్‌కుమార్ షాకింగ్ నిర్ణయం
నటి వరలక్ష్మి శరత్‌కుమార్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కీలక విషయాన్ని వెల్లడించారు. తనకు, తన భర్త నికోలాయ్ సచ్‌దేవ్‌కు పిల్లలు వద్దని స్పష్టం చేశారు. పిల్లలను కనాలంటే తల్లిదండ్రులు మానసికంగా, భావోద్వేగంగా సిద్ధంగా ఉండాలని, సిద్ధంగా లేకపోతే పిల్లలను కనకపోవడమే బాధ్యతాయుతమైన నిర్ణయమని ఆమె అన్నారు..

నటి వరలక్ష్మి శరత్‌కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పవల్సిన అవసరం లేదు. తనదైన నటనతో సినీరంగంలో ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. ఓ వైపు నెగెటివ్ షేడ్ క్యారెక్టర్లు చేస్తూనే.. మరోవైపు లేడీ ఓరియంటేడ్ సినిమానాల్లోనూ అలరిస్తున్నారు. పలు చిత్రాల్లోని పవర్‌ఫుల్ పాత్రలతో తెలుగు ప్రేక్షకులకు ఆకట్టుకున్న కోలీవుడ్ నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ తన వ్యక్తిగత జీవితంపై తాజాగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ ఏమన్నారంటే..
పిల్లలు కనడం, కనకపోవడం అనేది ప్రతి దంపతులు తమ వ్యక్తిగత పరిస్థితులు, అభిప్రాయాల ఆధారంగా తీసుకునే నిర్ణయమని నటి వరలక్ష్మి శరత్‌కుమార్ అన్నారు. తనకు పిల్లలు వద్దని, తన భర్త నికోలాయ్ సచ్‌దేవ్ కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారని ఆమె తెలిపారు. తాము తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఆమె మంచి పేరెంటింగ్ నిర్ణయంగా అభివర్ణించారు. 2024లో ముంబైకి చెందిన వ్యాపారవేత్త నికోలాయ్ సచ్‌దేవ్‌ను వివాహం చేసుకున్న నటి వరలక్ష్మి.. ఇటీవల వీజే భరణి సురేష్‌తో ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత నిర్ణయం గురించి మాట్లాడారు.
వ్యక్తిగతంగా నాకు పిల్లలు కనడం ఇష్టం లేదు. నేను కనలేనని కాదు.. నాకు పిల్లలు వద్దు. ఇది చాలా స్పష్టమైన ఎంపిక. నా భర్తకు కూడా పిల్లలు వద్దు అని ఆమె తెలిపారు. తన భర్తకు గత వివాహం నుంచి ఇప్పటికే ఒక కుమార్తె ఉందని వరలక్ష్మి చెప్పారు. ఆమెను తాను ఎప్పుడూ తన కూతురిగానే భావిస్తానని తెలిపారు. తమ వద్ద ఉన్న రెండు కుక్కపిల్లలను కూడా పిల్లల మాదిరిగానే చూసుకుంటామని పేర్కొన్నారు. పిల్లలు వద్దనుకోవడం పూర్తిగా తమ వ్యక్తిగత నిర్ణయమని, ఈ విషయంలో ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉన్నాయని ఆమె స్పష్టం చేశారు. పేరెంటింగ్ అనేది ఎంతో బాధ్యతతో కూడుకున్న విషయమని వరలక్ష్మి అభిప్రాయపడ్డారు. మీరు సిద్ధంగా లేకపోతే పిల్లలను కనకండి. అది మంచి పేరెంటింగ్ నిర్ణయం అని నేను అనుకుంటున్నాను అని ఆమె పేర్కొన్నారు.
పిల్లలు వద్దని ఎంచుకోవడంపై సైకోథెరపిస్ట్, రిలేషన్‌షిప్ బ్రేక్‌త్రూ కోచ్ డెల్నా రాజేష్ కూడా స్పందించారు. తల్లిదండ్రులు కావాలా వద్దా అనేది ప్రతి వ్యక్తి స్వయంగా ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయమని ఆమె అన్నారు. తరతరాలుగా ముఖ్యంగా మహిళలకు విద్య, ఉద్యోగం, వివాహం తర్వాత పిల్లలు కనడం జీవితంలో సహజమైన తదుపరి దశగా సమాజం భావిస్తోందని డెల్నా చెప్పారు. అయితే తల్లిదండ్రులు కావాలా వద్దా అనే ప్రశ్నకు కూడా వ్యక్తిగత ఎంపికగా స్థానం ఉండాలని ఆమె వివరించారు. ఒక బిడ్డను పెంచడం కేవలం ఆర్థికంగా అవసరాలను తీర్చడం మాత్రమే కాదని డెల్నా అన్నారు. పేరెంటింగ్‌కు సమయం, సహనం, భావోద్వేగ లభ్యత, స్థిరత్వం, జీవనశైలిలో మార్పులు అవసరమవుతాయని చెప్పారు. పిల్లలు వద్దని కోరుకోవడం అంటే తాము చెడ్డ తల్లిదండ్రులు అవుతామని భావించడం కాదని, కొందరు వ్యక్తులు తాము కోరుకునే జీవితం గురించి స్పష్టంగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకుంటారని ఆమె వివరించారు.
View this post on Instagram
అందరూ పిల్లలను కంటున్నారు, తల్లిదండ్రులకు మనుమలు కావాలి, పెళ్లయి కొన్ని సంవత్సరాలు అయింది.. వంటి కారణాలతో పిల్లలను కనడం సరైన విధానం కాదని డెల్నా అభిప్రాయపడ్డారు. సామాజిక ఒత్తిడిని పరిష్కరించడానికి ఒక బిడ్డను ఈ ప్రపంచంలోకి తీసుకురాకూడదు అని ఆమె పేర్కొన్నారు. పిల్లలను కోరుకోవడం, తల్లిదండ్రులు కావాలని కోరుకోవడం రెండూ ఒకటే కాదని డెల్నా వివరించారు. పిల్లలు పెరుగుతున్న కొద్దీ వారి అవసరాలు, భావోద్వేగాలు, స్వయంప్రతిపత్తి మారుతాయని, అందుకు తల్లిదండ్రులు సిద్ధంగా ఉండాలని చెప్పారు. కొందరు తల్లిదండ్రులు కావాలని బలంగా కోరుకుంటారని, మరికొందరు కోరుకోరని, ఇంకొందరు కొంతకాలం అనిశ్చితిలో ఉండవచ్చని డెల్నా అన్నారు. అందువల్ల ప్రతి వ్యక్తి నిర్ణయాన్ని సామాజిక అంచనాలతో కాకుండా సున్నితంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. ముఖ్యంగా మహిళలను మీరు ఎప్పుడు పిల్లలను కంటున్నారు? అని ప్రశ్నించడం మానుకోవాలని, పిల్లలను కనాలా వద్దా అనేది ఎవరికీ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేని వ్యక్తిగత నిర్ణయంగా సమాజం గుర్తించాలని ఆమె సూచించారు.
