AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: పెనుగంచిప్రోలు వద్ద మునేరులో బంగారం దొరుకుతుందా..?

పెనుగంచిప్రోలు మునేరు పరిసరాల్లో బంగారం కోసం కొందరు గాలిస్తున్నారు. బంగారం, రంగు రాళ్లు దొరుకుతాయనే ప్రచారంతో చిత్తూరు సహా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు మునేరు ఇసుకలో తవ్వకాలు చేస్తున్నారు. రెండు, మూడు నెలల పాటు అక్కడే ఉంటూ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

Andhra: పెనుగంచిప్రోలు వద్ద మునేరులో బంగారం దొరుకుతుందా..?
Penuganchiprolu Muneru River
Ram Naramaneni
|

Updated on: Oct 02, 2026 | 3:55 PM

Share

ఆంధ్రప్రదేశ్‌లోని పెనుగంచిప్రోలు మునేరు పరిసరాల్లో కొందరు బంగారం కోసం వేట కొనసాగిస్తున్నారు. మునేరులో బంగారం, రంగు రాళ్లు లభిస్తాయనే ప్రచారంతో చిత్తూరుతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి కొందరు ఇక్కడికి వస్తున్నారు. రోజంతా మునేరు ఇసుకలో గాలిస్తూ.. ఏదైనా విలువైన వస్తువు దొరుకుతుందేమోనని వెతుకుతున్నారు. ముఖ్యంగా మునేరు కాజ్‌వే, స్థానిక శివాలయం సమీపంలోని ఇసుక ప్రాంతాల్లో తవ్వకాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. గత రెండు, మూడేళ్లుగా కొందరు ఇలా బంగారం కోసం పెనుగంచిప్రోలు వస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. రెండు, మూడు నెలల పాటు మునేరు పరిసరాల్లోనే ఉంటూ వెతుకులాట కొనసాగించి.. అనంతరం తిరిగి తమ స్వగ్రామాలకు వెళ్తున్నట్లు సమాచారం.

పురాతన ప్రాంతంగా పెనుగంచిప్రోలు

పెనుగంచిప్రోలుకు పురాతన చరిత్ర ఉందని స్థానికులు చెబుతున్నారు. గతంలో ఈ ప్రాంతాన్ని పెద్ద కాంచీపురంగా పిలిచేవారనే ప్రచారం ఉంది. మునేరు పక్కనే ఉన్న పెనుగంచిప్రోలులో తిరుపతమ్మ తల్లి, లింగేశ్వరస్వామి, వేణుగోపాలస్వామి ఆలయాలు ఉన్నాయి. అయితే కొన్ని పురాతన ఆలయాలు పూర్తిగా కనుమరుగయ్యాయి. అయితే ఆయా ఆలయాలకు సంబంధించిన విగ్రహాలు తవ్వకాల్లో బయటపడిన సందర్భాలు ఉన్నాయి. ఓ ఇంటి నిర్మాణం కోసం పునాదులు తవ్వుతున్న సమయంలో భారీ నంది విగ్రహం బయటపడగా.. దానిని తీసుకెళ్లి శ్రీ తిరుపతమ్మ ఆలయంలో ఏర్పాటు చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. మరికొన్ని పురాతన విగ్రహాలను విజయవాడలోని విక్టోరియా మ్యూజియంలో భద్రపరిచినట్లు సమాచారం.

తవ్వకాల్లో విగ్రహాలు.. బంగారం కోసం వెతుకులాట

మునేరు పరిసర ప్రాంతాల్లో గతంలో తవ్వకాలు జరిపినప్పుడు పురాతన విగ్రహాలు బయటపడటంతో.. ఈ ప్రాంతంపై మరింత ఆసక్తి ఏర్పడింది. ఇదే సమయంలో మునేరులో బంగారం లభిస్తుందనే ప్రచారం కూడా కొనసాగుతోంది. వర్షాలు పడిన తర్వాత మునేరు పరివాహక ప్రాంతాల్లో ఇసుక, మట్టి కొట్టుకుపోవడంతో బంగారం లేదా విలువైన రాళ్లు బయటపడతాయని కొందరు నమ్ముతున్నారు. దీంతో వర్షాల అనంతరం మునేరులో బంగారం కోసం గాలించే వారి సంఖ్య పెరుగుతున్నట్లు చెబుతున్నారు.

కొద్దిపాటి బంగారం దొరికినా జీవితం మారుతుందని ఆశ

మునేరులో అప్పుడప్పుడు బంగారం దొరుకుతుందని గాలించేవారు చెబుతున్నారు. తమకు కొద్దిపాటి బంగారం దొరికినా దాన్ని విక్రయించి జీవనోపాధికి ఉపయోగించుకోవచ్చని ఆశిస్తున్నారు. అందుకే నెలల తరబడి ఇక్కడే ఉంటూ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పెనుగంచిప్రోలు మాత్రమే కాకుండా మరికొన్ని నదీ పరివాహక ప్రాంతాలు, తీర ప్రాంతాల్లోనూ బంగారం కోసం గాలించే వారు ఉన్నట్లు తెలుస్తోంది. నల్లమల ప్రాంతాల్లోనూ కొందరు ఈ తరహా వేట కొనసాగిస్తుండగా.. కాకినాడ జిల్లా ఉప్పాడ సముద్ర తీరంలోనూ బంగారం కోసం వెతికే వారు కనిపిస్తుంటారు. బంగారం దొరుకుతుందన్న ఆశతో ఇసుకను జల్లెడ పడుతున్న వీరి ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.

Follow Us