మూవీ రివ్యూ: అవతార్ 2
నటీనటులు: సామ్ వర్థింగ్టన్, జో సల్దాన, సిగొర్నీ వీవర్, స్టీఫెన్ లాంగ్, కేట్ విన్స్ లెట్, క్లిఫ్ కర్టిస్, జోల్ డేవిడ్ మూర్ తదితరులు
కెమెరా: రసెల్ కార్పెంటర్
ఎడిటింగ్: స్టీఫెన్ రివ్కిన్, డేవిడ్ బ్రెన్నెర్, జాన్ రెఫు, జేమ్స్ కేమరూన్
సంగీతం: సైమన్ ఫ్రాంగ్లెన్
నిర్మాత: జేమ్స్ కేమరూన్, జాన్ లండౌ
దర్శకత్వం: జేమ్స్ కేమరూన్
విడుదల: 16 డిసెంబర్ 2022
13 ఏళ్ళ కింద వచ్చిన అవతార్ అప్పట్లో పపంచాన్ని మాయ చేసింది. ఇలాంటి సినిమా ఒకటి తీయొచ్చా.. అసలు సినిమాను ఇలా కూడా తీయొచ్చా అని అంతా మాయలో పడిపోయేలా అవతార్ ఉంటుంది. మరి దానికి సీక్వెల్ అంటే అంచనాలు ఎలా ఉంటాయి..? ఇప్పుడు దానికి కొనసాగింపు వచ్చింది. మరి అవతార్ 2తో ఆ అంచనాలు జేమ్స్ కామెరూన్ అందుకున్నాడా లేదా..?
కథ:
అవతార్ మొదటి భాగంలో పండోరా గ్రహంపై దాడి చేసిన కల్నల్ టీంను అక్కడి గ్రహం వాళ్లు మట్టు పెడతారు. దాంతో పార్ట్ 1 ముగిసిపోతుంది. అయితే ఆ తర్వాత కల్నల్ మళ్లీ తన టీంతో వచ్చి హీరో, అతడి కుటుంబంపై ఎలా దాడి చేసారు.. అక్కడి గ్రహంపై ఎలా పగ తీర్చుకున్నారు అనేది కథ. వాళ్లు దాడి చేస్తుంటే.. హీరో, ఆయన కుటుంబ సభ్యులు తప్పించుకుని ఒక సముద్రంలో బతికే తెగకు చెందిన జలవాసుల వద్ద తలదాచుకుంటారు. వాళ్ల సాయంతో కౄరులైన భూలోకవాసుల్ని ఎదిరించి ఓడిస్తారు.. అదెలా జరిగింది అనేది అవతార్ 2 కథ..
కథనం:
కథగా చెప్పాలంటే అవతార్ 2 చాలా అంటే చాలా చిన్నది. మొదటి భాగంలో పండోరపై నివసించే వాళ్లపై భూలోకవాసులు దాడి చేస్తారు. ఆ తర్వాత ఇప్పుడు అదే మనుషులు వచ్చి.. సముద్రంలో బతికే అవతార్స్‌పై దాడి చేస్తుంటారు. అవతార్ రెండో భాగంలోకి వెళ్లే ముందు.. ముందు ఓసారి తొలి భాగం కథ రివైండ్ చేసుకోవాలి. పార్ట్ 1లో పండోర అనే గ్రహంలో విలువైన ఖనిజం ఉందనే విషయం తెలుసుకుని.. అక్కడి భూలోక వాసులు వస్తారు. ఆ సమయంలో జెక్ సల్లీ అనే మనిషిని క్రయోజెనిక్ స్లీప్‌లో అంటే గాఢ నిద్రలోనే ఉంచి.. పండోరా గ్రహంపై బతకి.. అక్కడి వాళ్లతో కలిసిపోయేలా ఓ క్లోన్‌ను తయారు చేస్తారు. హీరోను అక్కడికి పంపిస్తారు. ఆయన పని వాళ్ళతో కలిసిపోయి.. నమ్మించి ఆ ఖనిజం ఎక్కడుందో తెలుసుకోవడమే కాకుండా.. వాళ్లను ఆ గ్రహం నుంచి ఖాళీ చేయించాలి. కానీ హీరో మాత్రం మనుషులకు రివర్స్ అయిపోయి.. అక్కడి అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని.. తనకంటూ ఓ కుటుంబాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. అప్పుడు జరిగిన యుద్ధంలో పండోర విజయం సాధిస్తుంది. ఇది పార్ట్ 1..
పార్ట్ 1 విషయానికి వస్తే.. అప్పుడు ఓడిపోయిన కల్నల్ అండ్ టీం మళ్లీ పండోరను నాశనం చేయాలనుకుంటారు. కానీ ఈ సారి మాత్రం మొత్తం పండోరాను కాదు.. కేవలం తనను మోసం చేసిన హీరో అండ్ ఫ్యామిలీపైనే. పూర్తిగా రివేంజ్ ఫార్మాట్‌లోనే కథ సాగుతుంది. తొలి గంట సేపు పాత్రల పరిచయంతో పాటు.. విలన్లు వాళ్ళపై దాడి చేయడానికి ఎలా సిద్ధం అవుతున్నారు అని చెప్పడానికే తీసుకున్నాడు దర్శకుడు. మొదట్లో నెమ్మదిగానే ఉన్నా.. ఆ తర్వాత విజువల్స్ మాయ చేస్తాయి. అవతార్ 2 అనేది ఓ మాయా ప్రపంచం. ఆ వరల్డ్‌లోకి వెళ్లి జస్ట్ ఆ విజువల్స్ ఎంజాయ్ చేసి రావాలంతే. కథ ఏంటి.. స్క్రీన్ ప్లే ఎలా ఉంది.. జేమ్స్ కామెరూన్ మళ్లీ మాయ చేసాడా..? ఇవన్నీ పక్కనబెడితే.. మరోసారి మ్యాజిక్ చేసాడా లేదా అనేది కావాలి. అది జరిగింది.. తొలి గంట సినిమా పక్కనబెడితే.. తర్వాత రెండు గంటలు మాయ చేసాడు జేమ్స్ కేమరూన్. ఫస్టాఫ్ చాలా వరకు నెమ్మదిగా సాగుతుంది.. అదొక్కటే సినిమాకు మైనస్. పైగా తొలిసారి అవతార్‌ను చూసినప్పటి ఎగ్జైట్‌మెంట్ ఇప్పుడు కలగలేదు. ఆల్రెడీ ఓసారి చూసాంగా.. మళ్లీ అదేనా అనిపిస్తుంది అక్కడక్కడా. కుటుంబాన్ని కాపాడుకోవాలి అనే చిన్న పాయింట్ తీసుకుని.. మరోసారి తనకే సాధ్యమైన అద్భుతమైన అవతార్‌ను సృష్టించాడు జేమ్స్ కేమరూన్. ఇలాంటి కథలోనూ కమర్షియాలిటీ మిస్ అవ్వలేదు జేమ్స్. మన సినిమాల్లో చూసినట్లే ఓ ఫ్యామిలీ.. రివేంజ్ డ్రామా క్రియేట్ చేసాడు. కొన్ని సీన్స్ అయితే మన తెలుగు సినిమాలు చూస్తున్నట్లే అనిపిస్తుంది. క్లైమాక్స్ మరోసారి కూర్చోబెట్టాడు. ఆ విజువల్స్‌కు సలాం చెప్పాల్సిందే. చివర్లో చనిపోయే విలన్‌ను బతికించి అవతార్ 3కి హింట్ ఇచ్చి వదిలేసాడు. రామాయణం, మహాభారతం కూడా అవతార్ 2లో కనిపిస్తాయి. రాముడు వానరుల సాయంతో లంకపై గెలిచినట్లు.. జలవాసుల సాయంతో హీరో ఇక్కడ విలన్లపై గెలుస్తాడు. అలాగే భారతంలో విరాట పర్వం మాదిరి.. హీరో, అతడి కుటుంబం సముద్రంలో బతికే అవతార్స్ దగ్గరికి వచ్చి తల దాచుకుంటారు. రామాయణ భారతాల నుంచి స్పూర్తి పొందాడా లేదంటే అలా కుదిరిందా అనేది పక్కనబెడితే.. కథ మాత్రం అలాగే ఉంటుంది. ఓవరాల్‌గా అవతార్ 2.. ఫస్ట్ పార్ట్ రేంజ్ కాదు కానీ.. విజువల్స్ కోసం ఓసారి చూడొచ్చు.
నటీనటులు:
సామ్ వర్థింగ్టన్ మరోసారి అదరగొట్టారు. ఫస్ట్ పార్ట్‌లో ఎంత జోష్‌గా కనిపించారో.. సెకండ్ పార్ట్‌లో అలాగే ఉన్నారు. కాకపోతే అవతార్ 2లో ఫ్యామిలీకి ఇచ్చిన ఇంపార్టెన్స్ హీరోకు కనిపించలేదు. జో సల్దాన, సిగొర్నీ వీవర్, స్టీఫెన్ లాంగ్, కేట్ విన్స్ లెట్ ఇలా ప్రతీ ఒక్కరు తమ పాత్రలకు ప్రాణం పోసారు.
టెక్నికల్ టీం:
అవతార్ 2 సినిమాకు ప్రధాన బలం టెక్నికల్ టీం. ఎందుకంటే ఇందులో గొప్ప కథేం లేదు.. రొటీన్ రెగ్యులర్ కమర్షియల్ రివేంజ్ డ్రామా ఉందంతే. దాన్ని విజువల్స్‌తో మాయ చేసారు దర్శకుడు జేమ్స్ కేమరూన్. రసెల్ కార్పెంటర్ సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రాణం. ఆయన విజువల్స్ అవతార్ 2 రేంజ్ 100 రెట్లు పెంచేసాయి. దర్శకుడి ఊహకు తన కెమెరా కంటితో ప్రాణం పోసాడు కార్పెంటర్. స్టీఫెన్ రివ్కిన్, డేవిడ్ బ్రెన్నెర్, జాన్ రెఫు, జేమ్స్ కేమరూన్ నలుగురు ఈ సినిమా ఎడిటింగ్ డిపార్ట్‌మెంట్‌లో ఉన్నారు. తన విజువల్స్ మిస్ అవ్వకూడదని అన్నీ చూపించారేమో కానీ.. అదే సినిమా ఫ్లోను దెబ్బ తీసాయి. సైమన్ ఫ్రాంగ్లెన్ సంగీతం చాలా అద్భుతంగా ఉంది. బ్యాగ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటుంది. 20 సెంచరీ, జేమ్స్ కేమరూన్ ఈ సినిమా కోసం ఖర్చు విపరీతంగా పెట్టారని స్క్రీన్ మీద విజువల్స్ చూస్తుంటేనే అర్థమవుతుంది. జేమ్స్ కేమరూన్ మరోసారి మాయ చేసాడు కానీ ముందులా మాత్రం కాదు. ఈ సారి రొటీన్ కథతో వచ్చాడు.. కేవలం విజువల్స్‌తో కూర్చోబెట్టాడు.
పంచ్ లైన్: అవతార్ 2.. విజువల్ ఫీస్ట్ కానీ అవతార్ రేంజ్ అయితే కాదు..