Ghantasala :A vocalist of infinite variety: సంగీత దర్శకుడిగా మరెవ్వరూ చేయలేని ప్రయోగాలు, వైవిధ్యభరితమైన పాటలను స్వరపరచిన ఘంటసాల

ఘంటసాల తీయని గాంధర్వ హేల. కలికి ముత్యాలశాల. ఆయన స్వర ధారలో తడవని తెలుగువారుంటారా అసలు! ఆయన తెలుగుతల్లికి కంఠాభరణం.

Ghantasala :A vocalist of infinite variety: సంగీత దర్శకుడిగా మరెవ్వరూ చేయలేని ప్రయోగాలు, వైవిధ్యభరితమైన పాటలను స్వరపరచిన ఘంటసాల
Follow us
Balu

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Feb 11, 2021 | 3:15 PM

ఘంటసాల : ఘంటసాల తీయని గాంధర్వ హేల. కలికి ముత్యాలశాల. ఆయన స్వర ధారలో తడవని తెలుగువారుంటారా అసలు! ఆయన తెలుగుతల్లికి కంఠాభరణం. గాయకుడిగా ఆ వెంకటే”‘స్వరం” చేయని ప్రయోగం లేదు. పలకని భావం లేదు. సంగీత దర్శకుడిగా కూడా ఆయన మరెవ్వరూ చేయలేని ప్రయోగాలు చేశారు. ఘంటసాల సంగీత దర్శకుడుగా కనబరిచిన ప్రతిభ ఆయన గాయకుడుగా సాధించిన విజయం వల్ల కొంత మరుగున పడితే పడివుండవచ్చుగాక. కానీ స్వరకర్తగా ఆయన ఎల్లలు లేని ప్రతిభను కనబరిచారు. ఘంటసాలను తల్చుకోడానికి సందర్భం అవసరం లేదు. ఆయన నిత్య స్మరణీయుడు. ఆయన పాట వినందే పొద్దెక్కదు. ఆ స్వరంలో మైమరచిపోకుండా పొద్దు పోదు. ఆ గళామృతాన్ని చవి చూడకుండా రాత్రి గడవదు. అయినప్పటికీ ఇవాళ ఆయన మహనీయుడి వర్ధంతి కాబట్టి స్మరించుకోవడం తెలుగువారిగా మన ధర్మం. నేపథ్యగాయకుడిగా ఘంటసాల సినీ రంగంలో అడుగు పెట్టిన తొలినాళ్లలో ఆయనకు పెద్దగా పోటీ లేదు. కొద్ది మంది గాయకులే వున్నారప్పుడు. పైగా అప్పుడప్పుడే ప్లే బ్యాక్‌ మొదలైంది కాబట్టి పెద్ద సమస్యలేవీ ఆయనకు ఎదురుకాలేదు. కానీ సంగీత దర్శకుడిగా మాత్రం గట్టి పోటీనే ఎదుర్కోవాల్సి వచ్చింది. సాలూరి రాజేశ్వరరావు, సి.ఆర్‌.సుబ్బరామన్‌, పెండ్యాల నాగేశ్వరరావు, గాలి పెంచలనరసింహారావు, ఓగిరాల రామచంద్రరావు, సుసర్ల దక్షిణామూర్తి. ఒకరిని మించిన వారొకరు. స్వర సామ్రాట్టులు. వీరితో నెగ్గుకు రావడం అంత సులభమైన విషయం కాదు. అయితే సంగీత దర్శకుడిగా ఘంటసాల తట్టుకుని నిలబడగలిగారు. వందకు పైగా చిత్రాలకు ఘంటసాల సంగీతాన్ని సమకూర్చారు. జనరంజకమైన పాటలను స్వరపరిచారు. శ్రోతలను మైమరపించారు. శాస్త్రీయ సంగీతంలో ఆయనకు అపారమైన ప్రతిభ వున్నా ఆ పాండిత్యాన్ని తన పాటల్లో ఎప్పుడూ జొప్పించలేదు. ప్రజలకు కావాల్సిన సంగీతాన్నే అందించారు. గాయకుడు సంగీత దర్శకుడు అయితే పాట సరికొత్త అందాలను సంతరించుకుంటుందనేది వాస్తవం. ఓ షావుకారు, ఓ పాతాళభైరవి, ఓ చిరంజీవులు, ఓ లవకుశ, ఓ రహస్యం, ఓ పాండవ వనవాసం. ఎన్నన్ని చెప్పగలం. శతాధిక చిత్రాల్లో ఏ ఆణిముత్యాన్ని ఏరగలం? అది దుస్సాహసమే అవుతుంది.

షావుకారు సినిమాలో నూరు అణాల తెలుగు సంగీతం

సంగీత దర్శకుడిగా ఘంటసాలకు లక్ష్మమ్మే మొట్టమొదటి సినిమానే అయినా, కీలుగుర్రం తొలుత విడుదలైంది. ఇందులో కాదు సుమా కలకాదు సుమా పాట అప్పట్లో ప్రేక్షకులను ఉర్రూతలూపింది. సింధుభైరవిలో స్వరపరిచారీ పాటని! ప్రజలు విని సంతోషించడంతో పాటు తిరిగి పాడుకొని పరవశించేలా వుండటం సినిమా పాటకు కావాల్సిన ప్రధానమైన యోగ్యత. ప్రజాదరణ పొంది పది కాలాల పాటు నిలబడగలగడమే మంచి సినిమా పాటకు ప్రమాణమని ఘంటసాల అంటుండేవారు. కీలుగుర్రంలోనే ఎంత కృపామతివే అన్న పాట వుంది. ఎంతొ చక్కని కంపోజింగ్‌. బృందావన్‌ సారంగ్‌, మిశ్రయమన్‌ రాగాలతో స్వరపరిచిన ఈ పాటలో ఘంటసాల మార్క్‌ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ముఖ్యంగా నూతనముగా ఈ లేత మారుతము అన్న వాక్యం దగ్గర ఆర్కెష్ర్టయిజేషన్‌ గమనిస్తే అక్కడ క్లారినెట్‌ వినిపిస్తుంది. ఇదే ఘంటసాల సంతకం. తర్వాత వచ్చిన షావుకారులో నూరు అణాల తెలుగు సంగీతాన్ని అందించారు. పాటలన్నీ చక్కటి మెలోడితో ఎంతో హాయిగా వుంటాయి. ఇంకో ముఖ్య విశేషమేమిటంటే, సినిమాలో హరికథ వుంటుంది. ఇది జరుగుతున్నప్పుడు వచ్చే సంభాషణలు ఎంతో స్పష్టంగా వినిపిస్తాయి. అంతటి అద్భుతమైన ప్రక్రియను ఆ రోజుల్లోనే ఘంటసాల సాధించారు. ఇక పాతాళభైరవిలో అయితే వన్నె తరగని సంగీతాన్ని అందించారు. ఈ సినిమాతోనే హేమండ్‌ ఆర్గాన్‌ వాయిద్యాన్ని ఘంటసాల ప్రవేశపెట్టారు.

బడే గులాం అలీఖాన్‌ దగ్గర హిందుస్తానీ నేర్చుకున్న ఘంటసాల

1948లో ప్రముఖ హిందుస్తానీ సంగీత విద్వాంసుడు ఉస్తాద్‌ బడే గులాం అలీఖాన్‌ మద్రాస్‌కు వచ్చి అనేక కచేరీలు చేశారు. ఆయన గాత్ర విన్యాసానికి ముగ్ధుడైన ఘంటసాల ఆయన్ను తన ఇంటికి పిలిపించుకుని ఓ రెండు రోజులు ఆతిథ్యమిచ్చి హిందుస్తానీ రాగాల ఆకలింపు చేసుకున్నారు. పాతాళభైరవి పాటల్లో ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఎంతఘాటు ప్రేమయో పాటను హిందుస్తానీ సంప్రదాయంలోని రాగేశ్రీ రాగంలో స్వరపరిచారు ఘంటసాల మాస్టారు. పెళ్లి చేసి చూడు సినిమా టైటిల్స్‌లో ఘంటసాల పేరుకు బదులుగా ఇంట ఇంటనూ గంట గంటకూ ఎవ్వరి కంఠం వింటారో ఆ ఘంటసాలవారే చిత్రానికి నాదబ్రహ్మలండి అని రాసారు పింగళి నాగేంద్రరావు. అప్పుడాయన ఏ ఉద్దేశంతో రాసారో కానీ అది సత్యమైంది. ఇందులో ఏడు కొండల వాడా వెంకటారమణ అనే పాట వుంది. తెలుగులో చక్రవాకం ఆధారంగా చాలా పాటలే వచ్చాయి. అయితే ఏ పాట కూడా ఈ స్థాయిని చేరుకోలేదంటే అది ఘంటసాల ప్రతిభే. కన్యాశుల్కము సినిమానే తీసుకుంటే, గాయకుడిగా ఘంటసాల పాత్రలో పరకాయ ప్రవేశం చేస్తారు. గిరీశం పాత్ర స్వభావాన్ని పూర్తగా ఆకళింపు చేసుకున్నారు కాబట్టే చిటారు కొమ్మను మిఠాయి పొట్లం పాటను అంత భావస్ఫోరకంగా పాడగలిగారు. ఈ పాటను యదుకుల కాంభోజీ రాగంలో స్వరపరిచారు.

సంగీతదర్శకుడిగా శిఖరాగ్రాన నిలబెట్టిన మాయాబజార్‌

మాయాబజార్‌ సినిమా ఘంటసాలను సంగీతదర్శకుడిగా శిఖరాగ్రాన నిలబెట్టింది. ఈ సినిమాకు ముందు రాజేశ్వరరావుగారిని అనుకున్నా కారణాంతరాల వల్ల ఆ అవకాశం ఘంటసాలకు దక్కింది. ఇందులో పాటలన్నీ ఒక ఎత్తు. అహనా పెళ్లియంట పాట ఒక ఎత్తు. సుశీల పాడిన ఈ పాటలో ఘంటసాల గొంతు కూడా కంగున మోగుతుంది. శంకరాభరణం, హరికాంభోజి రాగాల మిశ్రమంతో స్వరపరిచిన ఈ పాట గాయకురాలిగా సుశీలకు ఓ మైలురాయిగా నిల్చిపోయింది. ఇందులోనే చారుకేశిలో మాధవపెద్ది సత్యంచేత భళిభళిదేవా పాటను పాడించిన ఘంటసాల ఘటోత్కచుడికి వివాహ భోజనంబు కూడా పాడించారు. ఇది 1920లో వచ్చిన లాఫింగ్‌ పోలిస్‌మన్‌ అనే ఇంగ్లీషు పాటకు అనుకరణగా వినిపిస్తుంది… అయితే ఇంగ్లీషు పాట చతురశ్రంలో సాగితే తెలుగు పాట స్వింగ్‌ రిధంలో వినబడుతుంది. అయితే ఏ మాటకామాటే చెప్పుకోవాలి. వివాహ భోజనంబులో ఘంటసాల ఆర్కెస్ట్రైజేషన్ చాలా చాలా గొప్పగా వుంటుంది. కళ్యాణి, భీంప్లాస్‌, రాగేశ్వరి, భాగేశ్వరి, మాండ్‌, సింధుభైరవి, హంసానంది, హంసధ్వని, హిందోళం ఇవన్నీ ఘంటసాలకు ఎక్కువ ఇష్టమైన రాగాలు. హిందోళం ఎప్పుడు ఉపయోగించినా అందులో పంచమం పలికించడం ఆయనకో సరదా! ఘంటసాల స్వరపరచిన పాటల్లో చాలా మట్టుకు ఈ రాగాలే వినిపిస్తాయి. శాంతినివాసం సినిమాలో కలనైనా నీ తలపే పాట విని చూడండి. హిందోళంలోని గొప్పదనం అర్థమవుతుంది. ఏ రాగంలో పాడామన్నది ప్రధానం కాదు.. భావాన్ని పలికించడానికి రాగాన్ని, స్థాయిని, మూర్చనను ఎలా వాడుకున్నారన్నదే ప్రధానం. ఈ విద్య ఘంటసాలకు మాబాగా తెలుసు. ఇందుకు మంచి ఉదాహరణ గుండమ్మకథ సినిమాలోని మౌనముగా నీ మనసు పాడిన పాట!

రహస్యం సినిమాకు అద్భుతమైన సంగీతాన్ని అందించిన ఘంటసాల

జనరంజకం కోసం రాగాలను మిశ్రమం చేయడంలో తప్పులేదనుకునేవారు మాస్టారు. చెవులకు ఇంపుగా, వినసొంపుగా వుండాలన్నదే ఆయన అభిమతం. హిందుస్తానీ సంప్రదాయంలో ఈ సౌలభ్యం ఎక్కువ. అందుకే హిందుస్తానీ రాగాలను వాడుకున్నప్పుడు ఆయన పాటలను లలితంగా, మధురంగా కంపోజ్‌ చేశారు. సంగీత దర్శకుడిగా ఘంటసాలకు ఎనలేని పేరు ప్రఖ్యాతులను తెచ్చి పెట్టిన సినిమా లవకుశ. కానీ ఆయనకు మాత్రం రహస్యం సినిమాకు అందించిన సంగీతమంటే మహా ఇష్టం. ఘంటసాల మాస్టారు కర్ణాటక సంప్రదాయ సంగీతాన్ని అభ్యసించినా, ఆయనకు హిందూస్తానీ సంగీతంపై మోజు ఎక్కువగా వుండేది. ఆయన సంగీత దర్శకత్వం వహించిన సినిమా పాటలు వింటే ఈ విషయం బోధపడుతుంది. రాగ్‌ దేశ్‌లో గుండమ్మకథలోనే రాగ్‌ దేశ్‌లో ఆయన స్వరపరచిన అలిగిన వేళనే చూడాలి అన్న పాటే ఇందుకు పెద్ద ఉదాహరణ. రాగేశ్వరి రాగంలో మాస్టారు చూపించినంత వైవిధ్యాన్ని మరో సంగీత దర్శకుడు చూపించలేదంటే అతిశయోక్తి కాదు. సారంగధరలోని అన్నానా భామిని అన్న పాట విన్నాక మీకే అర్థమవుతుంది. అన్నానా ఎపుడైనా అన్నానా వాక్యాల దగ్గర లయని పూర్తిగా ఆపేసి మాట్లాడుతున్నట్టుగా రాగయుక్తంగా పలికించడంలో రసోత్పత్తి ఎంతగా పండిందో వింటే తప్ప చెప్పలేము. గాయకుడే సంగీత దర్శకుడైతే సమకూరే అందాలివి! ఒక సినీ నిర్మాత ఇళయరాజాను తను తీసే సినిమాలో ప్రతి పాట సూపర్‌ హిట్‌ కావాలని కోరాడట! దానికి ఇళయరాజా ఓ నవ్వు నవ్వి- ఆ ప్రతిభ ఒక్క ఘంటసాల గారికే వుందండి.. మేమెంత వారి ముందు అన్నాడట విన్రమంగా. ఘంటసాల ప్రతిభావ్యుత్పల్తులేపాటివో చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు.

తెలుగు పాటకు గౌరవం తెచ్చింది నిస్సందేహంగా ఘంటసాలే!

తెలుగు ప్రేక్షకుడికి పాట మీద అపారమైన అభిమానం, గౌరవం కలిగించింది నిస్సందేహంగా ఘంటసాలే! గాయకుడిగా ఆయన ప్రతిభకు కొలమానాలు లేవు కానీ.. సంగీత దర్శకుడిగా ఆయన స్వర స్మరణీయుడే! మోహనరాగాన్ని ఆయనంత చక్కగా మరెవరూ పలికించలేదంటే అతిశయోక్తి కాదు. చిరంజీవులు సినిమాలోని తెల్లవారగ వచ్చే పాట విని చూడండి. నిజమే కదా అని అంటారు! భీంప్లాస్‌ రాగంలోని వైవిధ్యాన్ని ఒడిసిపట్టుకోవడం ఘంటసాలకి మాబాగా తెలుసు. కావాలంటే బ్రతుకుతెరువు సినిమాలోని అందమే ఆనందం పాట వినండి ఓసారి. ఘంటసాల చేసిన సంగీతానికి ముఖ్యగుణం సౌలభ్యం. సాహిత్యంలోనూ ప్రవేశం వుండటం వల్ల రచనకు తగ్గ వరస ఏర్పడటం వారి పాటల్లో సర్వసాధారణం. పహాడిలో వచ్చిన గొప్ప తెలుగు పాట ఏదంటే టక్కున మర్మయోగి సినిమాలోని నవ్వుల నదిలో పాట గుర్తుకువస్తుంది.. మధుకోన్స్‌ రాగాన్ని ఏ సంగీత దర్శకుడు స్పృశించలేదు. అయితే ఘంటసాల బందిపోటు సినిమాలో ఊహలు గుసగుసలాడే పాటను ఈ రాగంలోనే స్వరపరచి హిందుస్తానీలో తనకున్న సాధికారికతను నిరూపించుకున్నారు. కుంతీకుమారి పద్యాల్లో ఆయన కర్ణాటక రాగాలైన హేమావతి, బిలహరి, మాయామాళవగౌళ, అమృతవర్షిణిలతో పాటు హిందూస్తానీ రాగాలైన లలిత్‌ను కూడా వినసొంపుగా వాడారు. లలితసంగీతానికి పనికిరావనుకునే రంజని, భైరవి వంటి రాగాలను కరుణశ్రీ పద్యాల్లో చక్కగా ఉపయోగించారు. ఏ రాగం ఎక్కడ వాడినా రాగభావాన్ని చెడనివ్వలేదాయన! రహస్యం సినిమాలో సందర్భాన్ని బట్టి సరస్వతి, లలిత వంటి దేవతల పేర్లున్న రాగాలతో పాటలను స్వరపరిచారు.. వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలంటే సప్తగిరులను అధిరోహించాలి. ఘంటసాల సంగీతాన్ని విని తరించాలంటే సప్తస్వరాలను ఆకళింపు చేసుకోవాలి. రాజేశ్వర రావు, పెండ్యాల వంటి సంగీత దర్శకులు అతి ప్రతిభావంతులే అయినా రాగాల మీద ఘంటసాలకు ఉండిన అధికారం వారికన్నా ఎక్కువేమో. ఇన్ని అద్భుతమైన రాగరంజితాలు చూశాక నిజమేననిపిస్తుంది కదూ! ఆత్రేయ అన్నారు. ఘంటసాలా! నువ్వు వుంటావు. నిన్ను మేము అనుదినం వింటూనే వుంటాము. నిజమే ఆ తీయని పలుకు నిత్యం వినడమే కాదు. ఆయన స్వరపరచిన పాటలను కూడా వింటూనే వుంటాము…

Read More : డొనాల్డ్ ట్రంప్ కి శాశ్వతంగా ‘తలుపులు’ మూసేసిన ట్విటర్, ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేసినా అదే అదే సీన్