FIR against Suriya: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన చిత్రం జై భీమ్ (Jai Bhim). సమాజంలోని సామాజిక అస్పృశ్యతల ఆధారంగా టీజే జ్ఞానవేల్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సూర్య (Suriya), జ్యోతిక (Jyothika) దంపతులే స్వయంగా నిర్మించారు. గతేడాది నవంబర్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు ప్రశంసలతో పాటు పురస్కారాలు పొందింది. ఒకానొక దశలో ఆస్కార్ రేసులోనూ నిలిచింది. కాగా అవార్డులతో పాటే వివాదాలు కూడా జై భీమ్ సినిమాను వెంటాడాయి. ముఖ్యంగా సినిమాలోని కొన్ని సన్ని వేశాలు ఓ సామాజిక వర్గాన్ని కించపరిచేలా ఉన్నాయంటూ పలువురు కోర్టు మెట్లెక్కారు. తాజాగా ఇదే విషయానికి సంబంధించి సూర్యపై చెన్నైలోని వేళచ్చేరి పోలీస్ స్టేషనేలో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఆయనతో పాటు నిర్మాత జ్యోతిక, దర్శకుడు టీజే ఙ్ఞానవేల్‌లపై కేసు నమోదు చేశారు. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు వన్నియర్ సామాజిక వర్గాన్ని కించపరిచేలా ఉన్నాయని, అందువల్ల హీరో, దర్శక నిర్మాతలపై కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలంటూ రుద్ర వన్నియర్ సేన వ్యవస్థాపకుడు సంతోష్ గతంలో ఇదే పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేశారు. అయితే దీనిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
దీంతో సంతోష్ సైదాపేట మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ వేయగా, దీనిపై విచారణ జరిపిన కోర్టు జైభీమ్ చిత్రబృందంపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, దాన్ని కోర్టుకు సమర్పించాలంటూ ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు వేళచ్చేరి పోలీసులు సూర్య, జ్యోతిక, జ్ఞానవేల్‌లపై కేసు నమోదు చేశారు. కాగా పలుమార్లు ఈ పిటిషన్‌పై విచారణ జరిగినా సూర్య, జ్యోతిక, జ్ఞానవేల్ ఎవరూ కోర్టుకు హాజరు కాలేదన్న విషయాన్ని కోర్టు ప్రస్తావించింది. అంతేకాకుండా ఈ కేసుపై వివరణ ఇవ్వాల్సిందిగా ఆ ముగ్గురిని కోరింది.
ఇక ఇదే వ్యవహారంలో వన్నియర్ సంఘం కూడా రూ.5 కోట్ల పరువు నష్టం లేదా బేషరతు క్షమాపణ కోరుతూ హీరో సూర్యకు నోటీసులు కూడా పంపించిన సంగతి తెల్సిందే.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..
Also Read: