Drishyam 3 : ‘దృశ్యం 3’ మూవీ రివ్యూ.. మోహన్ లాల్, జీతూ జోసెఫ్ మరోసారి ఆకట్టుకున్నారా..?

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, సంచలన దర్శకుడు జీతు జోసెఫ్ కాంబినేషన్‌లో వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ ఫ్రాంచైజీ దృశ్యం. ఈ సిరీస్‌లో వచ్చిన మొదటి రెండు భాగాలు సంచలనం సృష్టించాయి. తాజాగా ఇదే ఫ్రాంచైజీ నుంచి చివరి భాగం వచ్చేసింది. మరి దృశ్యం 3 ఎలా ఉంది..? అంచనాలు అందుకుందా లేదా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం..

Drishyam 3 : ‘దృశ్యం 3’ మూవీ రివ్యూ.. మోహన్ లాల్, జీతూ జోసెఫ్ మరోసారి ఆకట్టుకున్నారా..?
Drishyam Movie

Edited By:

Updated on: May 21, 2026 | 2:50 PM

మూవీ రివ్యూ: దృశ్యం 3

నటీనటులు: మోహన్ లాల్, మీనా, సిద్ధిక్, ఆశా శరత్, మురళీ గోపీ, అన్సిబా హాసన్, ఎస్తర్ అనిల్, బిజు మీనన్ తదితరులు..

సంగీతం: అనిల్ జాన్సన్

సినిమాటోగ్రఫీ: సతీష్ కురుప్

ఎడిటింగ్: వినాయక్ వి.ఎస్

నిర్మాత: ఆంటోనీ పెరుంబవూర్

దర్శకత్వం: జీతు జోసెఫ్

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, సంచలన దర్శకుడు జీతు జోసెఫ్ కాంబినేషన్‌లో వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ ఫ్రాంచైజీ దృశ్యం. ఈ సిరీస్‌లో వచ్చిన మొదటి రెండు భాగాలు సంచలనం సృష్టించాయి. తాజాగా ఇదే ఫ్రాంచైజీ నుంచి చివరి భాగం వచ్చేసింది. మరి దృశ్యం 3 ఎలా ఉంది..? అంచనాలు అందుకుందా లేదా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం..

కథ:

జార్జ్ కుట్టి (మోహన్ లాల్) ఎప్పటినుంచో తాను నిర్మించాలనుకున్న డ్రీమ్ ప్రాజెక్ట్ దృశ్యం సినిమాను ఎట్టకేలకు పూర్తి చేస్తాడు. సూపర్ స్టార్ అరుణ్ కుమార్ (బిజు మీనన్) హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది. ఈ సినిమా సాధించిన విజయంతో మీడియా దృష్టి జార్జ్ కుట్టి, అతని కుటుంబంపై పడుతుంది. ఇద్దరు రిపోర్టర్లు జార్జ్ కుట్టి కదలికలను నిశితంగా గమనిస్తూ, వరుణ్ డెడ్ బాడీకి సంబంధించిన ఆధారాలు సంపాదించి ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తుంటారు. సరిగ్గా అదే సమయంలో తన పెద్ద కూతురు అంజు (అన్సిబా హాసన్)కు మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని జార్జ్ కుట్టి ప్లాన్ చేస్తాడు. ఆ తర్వాత ఎదురైన పరిణామాలు ఏంటి, తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి జార్జ్ కుట్టి మరోసారి ఎలాంటి ఎత్తుగడలు వేశాడు అనేది మిగతా కథ.

కథనం:

ఇండియన్ సినిమాలో స్క్రీన్ ప్లే బేస్డ్ థ్రిల్లర్స్ లిస్ట్ రాస్తే అందులో టాప్‌లో ఉండే సినిమా దృశ్యం. 12 ఏళ్ల కింద వచ్చిన ఈ చిత్రం అప్పట్లో ఓ సంచలనం.. పార్ట్ 2 కూడా అదే రేంజ్‌లో మాయ చేసింది. అయితే తాజాగా మూడో భాగంలో మాత్రం అదే మిస్ అయింది. టాప్ ఫ్రాంచైజీ ఒక స్థాయికి చేరుకున్న తర్వాత కొత్తదనం లోపిస్తే ప్రేక్షకులకు కొంత విసుగు రావడం సహజం. దృశ్యం 3 విషయంలో సరిగ్గా ఇదే జరిగింది. కొత్త కోణంలో కథను చెబితే బాగుండేది కానీ.. మళ్లీ పాత సమస్యనే తిప్పి తిప్పి చూపించడం వల్ల కథనం కాస్త రొటీన్‌గా అనిపిస్తుంది. ఈ సినిమా స్క్రీన్ ప్లే ప్యాట్రన్ దాదాపుగా రెండవ భాగం స్ట్రక్చర్‌నే పోలి ఉంటుంది. ఫస్టాఫ్ అంతా సాదాసీదాగా అక్కడక్కడే సాగుతున్నట్లు అనిపిస్తుంది. సెకండాఫ్‌లో హీరో ఎదుర్కోబోయే సమస్యలకు ఒక పునాది వేయడానికి మాత్రమే దర్శకుడు వాడుకున్నాడు. కాబట్టి ఫస్ట్ హాఫ్‌లో చెప్పుకోడానికి ఏం లేదు. ఇక సెకండ్ హాఫ్‌లో కథ వేగం పుంజుకుని కాస్త ఆసక్తికరంగా మారుతుంది. పాత కేసు తాలూకు ఆధారాలు పోలీసులకు దొరకడం, జార్జ్ కుట్టి ఇరుక్కున్నాడు అనిపించేలా సాగే సన్నివేశాలు కొంత ఉత్కంఠను రేకెత్తిస్తాయి.

కానీ జార్జ్ కుట్టి తన తెలివితేటలతో ఎలాగోలా బయటపడతాడు అనే విషయం ప్రేక్షకులకు ముందే తెలిసిపోవడం వల్ల గత సినిమాల్లో లాగా థ్రిల్ ఫీల్ అవ్వలేము. ఇందులో వచ్చే ట్విస్టులు ఫస్ట్ రెండు పార్ట్స్ మాదిరి పెద్దగా ఆశ్చర్యపరచవు. భావోద్వేగాలు కూడా మునుపటి స్థాయిలో పండలేదు. ఇందులో ట్విస్టులు ఉండవని ముందుగానే దర్శకుడు చెప్పినా కూడా ఇంత ఫ్లాట్ నెరేషన్ జీతూ జోసెఫ్ నుంచి ఊహించలేదు. నిజానికి ఈ ట్విస్టులు వేరే ఏదైనా సినిమాలో ఉంటే అద్భుతంగా ఉండేవేమో కానీ.. జీతు జోసెఫ్ గత రెండు సినిమాలతో ఒక బెంచ్ మార్క్ సెట్ చేయడం వల్ల మూడో భాగం ఆ స్థాయిని అందుకోలేకపోయింది. క్లైమాక్స్ కూడా మునుపటి మ్యాజిక్ రిపీట్ చేయలేకపోయింది. అంతేకాకుండా క్లైమాక్స్ కూడా ఏదో గందరగోళంగా చిత్రీకరించారు. మొత్తానికి ఒక బలమైన ఎమోషనల్ కనెక్ట్ మిస్ అవ్వడం ఈ చిత్రానికి పెద్ద మైనస్. దృశ్యం ఫ్రాంచైజీకి వీరాభిమానులు అయితే ఓకే కానీ నార్మల్ ఆడియన్స్‌కు ఈ సినిమా ఎక్కడం కష్టమే.

నటీనటులు:

కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ తన కెరీర్లో ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించారు. జార్జ్ కుట్టి పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయడం ఆయనకు చాలా తేలికైన విషయం. తన కుటుంబం కోసం ఎంతటి రిస్క్ అయినా చేసే వ్యక్తిగా, ఒత్తిడిలో ఉన్నప్పుడు ఆయన పలికించిన సూక్ష్మమైన హావభావాలు అద్భుతంగా ఉంటాయి. ఎస్తర్ అనిల్ కొన్ని సరదా సన్నివేశాలతో మెప్పించింది. మీనా, సిద్ధిక్, ఆశా శరత్, మురళీ గోపీ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు దక్కించుకున్న సన్నివేశాల్లో సంతృప్తికరమైన నటనను కనబరిచారు. మిగిలిన వాళ్లంతా తమ తమ పాత్రలకు న్యాయం చేసారు.

టెక్నికల్ టీం:

తెలుగు డబ్బింగ్ చాలా నీట్‌గా కుదిరింది. ఇదే సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్. అనిల్ జాన్సన్ అందించిన నేపథ్య సంగీతం సినిమా టోన్‌కు, ఉత్కంఠభరిత సన్నివేశాలకు బాగా సింక్ అయింది. సతీష్ కురుప్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నతంగా ఉన్నాయి. అయితే ఎడిటర్ వినాయక్ ఫస్టాఫ్ ఇంకాస్త వేగంగా కట్ చేసి ఉంటే బాగుండేది. ఫస్ట్ హాఫ్‌లో కొన్ని అనవసరమైన సాగతీత సన్నివేశాలను ట్రిమ్ చేయాల్సింది. దర్శకుడు జీతూ జోసెఫ్ ఫస్ట్ టైమ్ ఈ ఫ్రాంచైజీలో కాస్త నిరాశ పరిచారు. ముందు పార్ట్స్ దృష్టిలో పెట్టుకుని రావద్దని ఆడియన్స్‌కు ఎంత చెప్పినా ఆ పోలిక అయితే సహజం. అదే దృశ్యం 3కి మైనస్ అయింది.

పంచ్ లైన్:

ఓవరాల్‌గా దృశ్యం 3.. మిస్ ఫైర్.. ఫస్టాఫ్ డల్.. సెకండాఫ్ థ్రిల్..!

Follow Us