Katrina Kaif: కరోనా మహమ్మారి మానవ సమాజాన్ని అతలాకుతలం చేసింది. ఆరోగ్యాలను తీవ్రంగా ప్రభావితం చేసింది. గతంలో ఎన్నడూ చూడని ఈ మాయదారి రోగంతో రకరకాల వ్యాధులు వేధిస్తున్నాయి. బ్లాక్ ఫంగస్, యెల్లో వైరస్ అంటూ రోగాలు అంతు చిక్కడం లేదు. ఇక కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా పలు ఇబ్బందులు ఎదురవుతున్నట్లు పరిశోధకులు గుర్తిస్తున్నారు. కరోనా నుంచి కోలుకున్నాం కదా అని.. ఇష్టమొచ్చినట్లు ఉంటామంటే మాత్రం కుదరని చెబుతున్నారు వైద్య నిపుణులు కొంత కాలం పాటు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా బాలీవుడ్ బ్యూటీ, అందాల తార కత్రీనా కైఫ్ తన స్వీయ అనుభవాన్నిపంచుకున్నారు.
ఏప్రిల్‌లో కత్రీనా కైఫ్ కరోనాబారిన పడిన విషయం తెలిసిందే. అయితే త్వరలోనే సరైన చికిత్స తీసుకోవడంతో కత్రీనా సకాలంలో కరోనా నుంచి కోలుకున్నారు. ఈ నేపథ్యంలోనే వర్కవుట్ల విషయంలో నెలకొన్న అనుమానాల నేపథ్యంలో కత్రీనా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత తిరిగి వర్కవుట్లు ఎప్పడు మొదలు పెట్టాలన్నదానిపై ఈ బ్యూటీ స్పందిస్తూ.. `కరోనా నుంచి కోలుకున్న తర్వాత తిరిగి వర్కవుట్లు చేయడానికి ఓపిక పట్టాను. మీరు కూడా మీ శరీరం మాటను వినండి. శరీరం పూర్తిగా కరోనా నుంచి కోలుకోవడానికి కాస్త సమయం ఇవ్వండి. అనంతరం నెమ్మదిగా వర్కవుట్లలో వేగాన్ని పెంచండి` అంటూ రాసుకొచ్చిందీ బ్యూటీ. ఇక కత్రీనా కెరీర్ విషయానికొస్తే ఈ బ్యూటీ ప్రస్తుతం.. ఫోన్‌బూత్‌తో పాటు, టైగర్ 3 చిత్రాల్లో నటిస్తోంది.