ప్రపంచంలో అరుదైన బ్రడ్ గ్రూప్‌లో బి- నెగెటివ్ (B-Negative) కూడా ఒకటి. కొద్దిమందికి మాత్రమే ఈ బ్లడ్ గ్రూప్ ఉంటుంది. అందుకే దాదాపు అన్ని ఆస్పత్రుల్లోనూ ఈ బ్లడ్ గ్రూప్ కొరత ఉంటుంది. అలా బి- నెగెటివ్ బ్లడ్ గ్రూప్ కలిగిన అరుదైన వ్యక్తుల్లో బాలీవుడ్ గ్రీక్ హీరో హృతిక్ రోషన్ (Hrithik Roshan) కూడా ఒకరు. ఈక్రమంలో ‘వరల్డ్ ర్యాండమ్ యాక్ట్ ఆఫ్ కైండ్‌నెస్ డే’ ను పురస్కరించుకుని రక్తదానం చేశాడీ హ్యాండ్సమ్ హీరో. అనంతరం తన బ్లడ్ డొనేషన్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. తన అభిమానులు కూడా రక్తదానం (Blood Donation) చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చాడు. ‘నా బ్లడ్ గ్రూప్ బి-నెగెటివ్. ఇది చాలా అరుదైనది. ఆస్పత్రుల్లో దీని కొరత బాగా ఉంటుందని విన్నాను. నేను రక్తదానం చేయడానికి అనుమతించినందుకు కోకిలాబెన్ ఆస్పత్రికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. నా మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నందుకు ఇక్కడి వైద్యులకు ధన్యవాదాలు. రక్తదానం చేయడం మన ఆరోగ్యానికి మంచిదని మీకు తెలుసా’ అని తన పోస్టులో రాసుకొచ్చాడు హృతిక్.
అతడు క్రిష్‌గా మారిపోతాడు!
కాగా హృతిక్ బ్లడ్ డొనేషన్ ఫొటోలు ప్రస్తుత నెట్టింట్లో వైరల్‌గా మారాయి. చాలా మంచి పనిచేశావంటూ సెలబ్రిటీలు, అభిమానులు, నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సందర్భంగా హృతిక్ తండ్రి రాకేశ్ రోషన్ ‘ నిన్ను చూసి చాలా గర్వపడుతున్నాను’ అని స్పందించగా ‘మీ రక్తాన్ని పొందిన వారు క్రిష్‌గా మారిపోతాడు’ అంటూ ఓ నెటిజన్ ఇంట్రెస్టింగ్ కామెంట్ పెట్టాడు. ఇక సినిమాల విషయానికొస్తే.. చివరిగా ‘వార్’ సినిమాలో కనిపించాడు హృతిక్. ప్రస్తుతం అతను ‘విక్రమ్ వేద’ చిత్రంలో నటిస్తున్నాడు. మాధవన్, విజయ్ సేతుపతిలు హీరోలుగా నటించిన తమిళ హిట్ చిత్రం ‘విక్రమ్ వేద’కు రీమేక్‌గా ఇది తెరకెక్కుతోంది. ఒరిజినల్ వెర్షన్‌కు దర్శకత్వం వహించిన పుష్కర్- గాయత్రే దీనికి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. సైఫ్ అలీఖాన్, రాధికా ఆప్టే కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల హృతిక్ పుట్టిన రోజు సందర్భంగా సినిమాలో అతని ఫస్ట్ లుక్ కూడా విడుదలైంది. దీనికి అపూర్వ స్పందనం వచ్చింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో విక్రమ్ వేదను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు దర్శక నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు.
Andhra Pradesh: అక్రమ లేఔట్లపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారిపై ఉక్కుపాదం మోపేలా ఉత్తర్వులు..
Prabhas: డార్లింగ్ కల నెరవేరిన వేళ.. సోషల్ మీడియా వేదికగా ప్రభాస్ ఎమోషనల్ పోస్ట్..