Tamanna: మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం తెలుగు, తమిళ్ బాషలతోపాటు బాలీవుడ్ లోను ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇక ఈ అమ్మడు గతంలో బాలీవుడ్ లో నటించినప్పటికి సాలిడ్ హిట్ మాత్రం అందుకోలేకపోయింది. ఇప్పుడు మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ప్రముఖ దర్శకుడు మధుర్ భండార్కర్ తన తదుపరి చిత్రాన్ని ప్రకటించారు. తమన్నాతో బబ్లీ బౌన్సర్ అనే బాక్సింగ్ నేపథ్యం ఉన్న చిత్రాన్ని ముధర్ భండార్కర్ తెరకెక్కిస్తున్నారు. ఫాక్స్ స్టార్ స్టూడియోస్, జంగ్లీ పిక్చర్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ తాజాగా పూజా కార్యక్రమాలతో మొదలైంది.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మధుర్ భండార్కర్ మాట్లాడుతూ.. గతంలో తాను తెరకెక్కించిన సినిమాలకు భిన్నంగా బబ్లీ బౌన్సర్ ఉండనుందని, బాక్సర్స్ టౌన్ గా పేరుగాంచిన అసోలా ఫతైపూర్ బ్యాక్ డ్రాప్ లో బాక్సింగ్ నేపథ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లుగా తెలిపారు. మిల్కీబ్యూటీ తమన్నా ఈ సినిమాలో ఓ మహిళ బౌన్సర్ గా నటిస్తున్నారని, భారతదేశంలో తొలిసారిగా ఓ మహిళ బౌన్సర్ కథ ఆధారంగా వస్తున్న తొలిసినిమా ఇదే అన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని మధుర్ తెలిపారు. అలాగే హీరోయిన్ తమన్నా మట్లాడుతూ.. తన కెరీర్ లో తొలిసారిగా ఓ బౌన్సర్ పాత్రలో కనిపించడం చాలా ఆనందంగా అనిపిస్తోంది అన్నారు. ఓ ఛాలెంజ్ గా తీసుకొని ఈ సినిమాలో నటించడానికి అంగీకరించాను. మధుర్ దర్శకత్వంలో తొలిసారిగా నటించడం చాలా ఉత్కంఠగా ఉంది. ఈ సినిమాతో నన్ను ప్రేక్షకులు మరింతగా ఆదరిస్తారని అశిస్తున్నట్లుగా చెప్పుకొచ్చింది తమన్నా.
మరిన్ని ఇక్కడ చదవండి :