Shah Rukh Khan: షారుక్ ఖాన్ సతీమణి గౌరీ ఖాన్ ఇస్లాం మతంలోకి మారారా?
ఇండియాలోనే అత్యంత సంపన్న నటులలో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఒకరు. తిరుగులేని హీరోగా రాణిస్తున్నాడు షారుక్. ఆయన ఆస్తులు 7,300 కోట్ల రూపాయలకు పైగా ఉన్నాయి. షారుఖ్ ఖాన్ ఇంత రిచ్ కావడానికి కేవలం సినిమాలే కాదు యాడ్స్ ద్వారా కూడా బాగా సంపాదిస్తున్నాడు కింగ్ ఖాన్.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే టెక్నాలజీ వచ్చాక ఏది నిజమో.. ఏది కాదో చెప్పలేకపోతున్నాం. సృష్టికి ప్రతిసృష్టి చేసినట్లుగా ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు చేయడం ఒక రకంగా గొప్పే అయినా.. దాన్ని మంచి పద్దతిలో ఉపయోగించుకుంటే చాలా బాగుంటుందనేది అందరూ ఇప్పుడు అంటున్న మాట. ముఖ్యంగా మనందరి చూపు సినిమా సెలబ్రిటీల మీదే ఉంటుందనేది నిజం. ఇక ఈ AI వచ్చాక సెలబ్రిటీలను తమకు నచ్చిన విధంగా చూసుకోవాలని ఎడిటింగ్‌లు చేసుకుని సంబరపడుతున్నారు సినీ ప్రియులు. ఇది కొంతవరకు బాగానే ఉన్నా.. కొందరు హీరోయిన్లను అసభ్యకర రీతిలో క్రియేట్ చేసి ఇబ్బంది పెడుతున్న సందర్భాలు కూడా లేకపోలేదు. ఇది ఇలా ఎంతవరకు దారి తీస్తుందో చెప్పలేం కానీ.. ఇప్పుడు ఇదే AI క్రియేటివిటీ బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ వరకూ వెళ్లిపోయింది.
షారుఖ్ ఖాన్ స్వతహాగా ముస్లిం మతస్తుడు అనే విషయం మనకు తెలిసిందే. అయితే అతని భార్య హిందూ. కానీ తాజాగా షారుఖ్ భార్య గౌరీ ఖాన్ ఇస్లాం మతంలోకి మారినట్లుగా వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. ముస్లిం పద్దతిలో కనిపిస్తున్న గౌరీ ఖాన్.. భర్త షారుఖ్ మరియు కొడుకుతో హజ్ చేస్తున్నట్టు ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఇది నిజమా? లేక AI క్రియేటివిటీ ఉపయోగించి ఇలా చేశారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గౌరీ ఖాన్, షారూఖ్ ఖాన్ మరియు కుమారుడు ఇయాన్ ఖాన్ హజ్ చేస్తున్నట్లుగా ఉన్న ఫోటో చూడముచ్చటగా ఉన్నా.. గౌరీ ఖాన్ ఇస్లాం మతంలోకి మారిందా అనే చర్చ ఇప్పుడు పెద్ద వివాదానికి దారి తీసేలా ఉంది. అంతే కాదు.. ఈ ఫోటో గురించి గౌరీ ఖాన్ స్పందించారని.. తాను ఇస్లాంను స్వీకరించినట్లు స్వయంగా అంగీకరించారని కూడా పుకార్లు ఊపందుకున్నాయి. అయితే.. కొన్ని మీడియా నివేదికల ప్రకారం.. ఈ ఫోటో నిజం కాదు.. నకిలీదని తెలుస్తోంది. షారుఖ్ ఖాన్ ఫ్యామిలీ ఇలా హజ్ చేస్తున్నట్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సృష్టించారని చెబుతున్నారు.
వాస్తవానికి గౌరీ ఖాన్.. పంజాబీ హిందూ కుటుంబానికి చెందిన మహిళ. షారుక్ ఖాన్ ఆమెను 1991లో వివాహం చేసుకున్నారు. ఆమె మొదటి నుంచి కూడా తన మతానికే కట్టుబడి ఉంది. ఈ దంపతులకు సహానా ఖాన్, ఆర్యన్ ఖాన్ మరియు అబ్రమ్ ఖాన్ అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. జోయా అక్తర్ చిత్రం ‘ది ఆర్చీస్’తో సహానా ఖాన్ బాలీవుడ్ అరంగేట్రం చేశారు. ఆర్యన్ ఖాన్ త్వరలో దర్శకుడిగా సినీ ప్రపంచంలో తనదైన ముద్ర వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే.. గౌరీ ఖాన్ ఇస్లాం స్వీకరిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అలాంటి ఆలోచన కూడా లేనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫోటో మాత్రం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సృష్టించబడినదే చాలా మంది కొట్టిపారేస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.