ప్రపంచ అందాల సుందరి ఎవరా అని ప్రపంచం అంతా ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. 71వ ప్రపంచ సుందరి పేరు వెల్లడైంది. ఈ ఏడాది అందాల పోటీలో చెక్ రిపబ్లిక్‌కు చెందిన క్రిస్టినా పిజ్కోవా గెలుపొందగా, లెబనాన్‌కు చెందిన యాస్మినా ఫస్ట్ రన్నరప్‌గా నిలిచింది. మిస్ వరల్డ్ వేడుకలో చివరి అంకం.. ముగింపు వేడుక మార్చి 9వ తేదీ (శనివారం) దేశ ఆర్ధిక రాజధాని ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేదిక మీద క్రిస్టినాను విజేతగా ప్రకటించారు. మిస్ వరల్డ్ కిరీటాన్ని అందుకుంది.
ఈ ఏడాది మిస్ వరల్డ్ టైటిల్ కోసం 120 మంది అందాల యువతులు పోటీ పడ్డారు. అందరినీ దాటుకుంటూ క్రిస్టినా పిజ్కోవా ప్రపంచ సుందరి టైటిల్‌ను గెలుచుకుంది. గత ఏడాది మిస్ వరల్డ్ పోటీలో విజేతగా నిలిచిన పోలాండ్ నివాసి కరోలినా బిలావ్స్కా .. తన కిరీటాన్ని ఈ ఏడాదిలో విజేతగా నిలిచిన క్రిస్టినా పిజ్కోవాకు అందించింది. మిస్ వరల్డ్ గా పట్టాభిషేకం చేసింది.
ఈ మిస్ వరల్డ్ అందాల పోటీలో భారతదేశం తరపున సినీ శెట్టి పాల్గొన్నారు. ఆమె ఈ టైటిల్‌ను గెలవలేకపోయింది. వాస్తవానికి.. టాప్-8కి చేరుకోవడంలో విజయం సాధించింది. అయితే టాప్ 4 కంటెస్టెంట్స్ లో సినీ శెట్టికి చోటు దక్కలేదు. దీంతో మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకునే రేసు నుండి నిష్క్రమించింది. సినీ శెట్టి కర్ణాటకలో పుట్టినా విద్యాభ్యాసం ముంబైలో సాగింది. 2022లో ఫెమినా మిస్ ఇండియా టైటిల్‌ను గెలుచుకుంది సినీ శెట్టి.
ప్రముఖ బాలీవుడ్ చిత్రనిర్మాత కరణ్ జోహార్ ఈ ఈవెంట్‌ను నిర్వహించగా, 2013లో మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్న మేగన్ యంగ్ అతనికి మద్దతుగా నిలిచారు. నేహా కక్కర్, ఆమె సోదరుడు టోనీ కక్కర్ , షాన్ వంటి ప్రముఖ గాయ నీమణులు తమ గాత్రం, అభినయంతో అందాల ప్రదర్శనకు మరింత అందాన్ని అందించారు. 28 ఏళ్ల తర్వాత భారత్‌లో మిస్ వరల్డ్ పోటీలను నిర్వహించారు. అంతకుముందు 1996 సంవత్సరంలో 46వ ఎడిషన్ భారతదేశంలో నిర్వహించారు. ఈసారి ముంబయి నగరంలో ఈ కార్యక్రమం జరగ్గా.. 28 ఏళ్ల క్రితం బెంగళూరులో జరిగింది.
మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..