Bollywood: ప్రమాదంలో బాలివుడ్ హీరోలు.. ముంబైలో సెలబ్రిటీలే టార్గెట్‌

ప్రమాదంలో బాలీవుడ్ సెలబ్రిటీలు. సల్మాన్‌కు హెచ్చరికలు. పెరిగిన సెక్యూరిటీ. ఇప్పటికే షారూక్ కి జెడ్ ప్లస్ సెక్యూరిటీ. టి. సిరీస్ గుల్షన్ కుమార్ మీద మాఫియా దాడి నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకూ బాలివుడ్ హీరోలపై జరిగిన దాడులు. గోవిందా కాలికి బుల్లెట్ గాయం సీక్రెట్‌. సల్మాన్ సన్నిహితుడు బాబా సిద్దిఖి హత్య సహా అనేక అంశాలు ఇప్పుడు చర్చనీయాంశం.

Bollywood: ప్రమాదంలో బాలివుడ్ హీరోలు.. ముంబైలో సెలబ్రిటీలే టార్గెట్‌
Sharuk Khan - Salman Khan - Saif Ali Khan
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 16, 2025 | 8:52 PM

సెలబ్రిటీలకు అభిమానులే కాదు శత్రువులు కూడా ఉంటారు. రీల్‌ లైఫ్‌లో ఉత్తుత్తి విలన్లని తుక్కు రేగ్గొట్టే హీరోలను.. రియల్‌ విలన్లు బెదరగొడుతున్నారు. బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారు. బాలీవుడ్‌కి ఇది కొత్తేం కాదు. వాడు పోతే వీడు.. వీడుపోతే వాడు అన్నట్లే ఎవడో ఒకడు గన్ను పడుతున్నాడు. సెలబ్రిటీలకు గురిపెడుతున్నాడు. బాలీవుడ్‌ సెలబ్రిటీలే కాదు.. రాజకీయ ప్రముఖులు, పేరొందిన పారిశ్రామికవేత్తలు కూడా క్రైమ్‌ వరల్డ్‌కు టార్గెట్‌ అవుతున్నారు.

బాబా సిద్ధిఖీ. పాపులర్‌ పొలిటీషియన్‌. మాజీ మంత్రి. ఈమధ్యే ముంబైలో గ్యాంగ్‌స్టర్ల బుల్లెట్లకు బలయ్యారు సిద్ధిఖీ. పేరుకు పొలిటీషియన్‌ మర్డరే అయినా ఫిల్మ్‌ ఇండస్ట్రీ ఉలిక్కిపడింది ఆ మర్డర్‌తో. ఎందుకంటే బాలీవుడ్‌తో సిద్ధిఖీకి బలమైన బంధముంది. మరీ ముఖ్యంగా సల్మాన్‌ఖాన్‌కి జాన్‌జిగర్‌. బాలీవుడ్‌కి స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చేందుకే లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ స్కెచ్చేసి సిద్ధిఖీని మర్డర్‌ చేసింది. అంతకుముందే సల్మాన్‌ఖాన్‌ ఇంటిపై రెక్కీ జరిగింది. ఆయన బాల్కనీపైకి గన్నులు పేలాయి. దీంతో స్వేచ్ఛా విహంగంలా తిరిగే సల్లూభాయ్‌ భయంభయంగా రక్షణ వలయంలో బతకాల్సి వస్తోంది.

దుండగుడి దాడిలో తీవ్రంగా గాయపడ్డ హీరో సైఫ్‌అలీఖాన్‌ ఐసీయూలో ఉండటంతో.. ప్రముఖులకున్న థ్రెట్‌పై ముంబైలోనే కాదు దేశమంతా చర్చ జరుగుతోంది. బాబా సిద్ధిఖీ కుటుంబం న్యాయం కోసం ఎదురు చూస్తోంది. వరుస బెదిరింపులతో సల్మాన్‌ ఖాన్‌ ఇక లాభం లేదనుకుని ఇంటినే బుల్లెట్‌ఫ్రూఫ్‌గా మార్చేసుకున్నారు. ఇప్పుడు ప్రముఖులు నివాసముండే బాంద్రాలో హీరో సైఫ్‌పై దాడి జరిగింది. ముంబైలో ఎవరు సురక్షితంగా ఉన్నారని బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంపై విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.

కృష్ణజింకలను వేటాడినందుకు సల్మాన్‌ఖాన్‌ని టార్గెట్‌ చేసుకుంది బిష్ణోయ్‌గ్యాంగ్‌. మహారాష్ట్ర పన్వెల్‌లోని ఫామ్‌హౌస్‌లో సల్మాన్‌ని హత్యచేసేందుకు కూడా కుట్ర జరిగింది. 25 లక్షల సుపారీ తీసుకున్న ఐదుగురు వ్యక్తులు జైల్లో ఉన్న లారెన్స్ బిష్ణోయ్ ముఠా నుంచి కాంట్రాక్ట్ తీసుకున్నట్లు పోలీసులు అభియోగాలు నమోదుచేశారు. బాంద్రాలో సల్మాన్ ఇంటి బయట కాల్పులు జరిగిన తర్వాత, పన్వెల్ కుట్ర బయటికొచ్చింది. సల్మాన్‌ కదలికల్ని దాదాపు అరవై డెబ్భైమంది ట్రాక్‌ చేశారని తెలియటంతో బాలీవుడ్‌ హీరోకు భద్రతపెంచింది మహారాష్ట్ర ప్రభుత్వం.

సల్మాన్‌తోనే ఆగలేదు బెదిరింపులు. బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌కు కూడా బెదిరింపులు రావటంతో ముంబై పోలీసులు అలర్ట్ అయ్యారు. గతంలో కూడా షారుఖ్ ఖాన్‌కు బెదిరింపు కాల్స్ వచ్చాయి. పఠాన్, జవాన్ సినిమాల సక్సెస్‌ తర్వాత బెదిరింపు కాల్స్ వస్తున్నాయని మహారాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు బాద్‌షా. దీంతో ప్రభుత్వం ఆయనకు వై ప్లస్‌ సెక్యూరిటీని కల్పిస్తోంది. షారుఖ్‌ఖాన్‌తో పాటు అమీర్‌ఖాన్‌, సంజయ్‌దత్‌, రణబీర్‌కపూర్‌, రేఖలాంటి పదులసంఖ్యలో సెలబ్రిటీలు ఉండేది బాంద్రాలోనే.

నాలుగుదశాబ్దాల క్రితం గ్యాంగ్‌స్టర్లు బాలీవుడ్‌ని శాసించే పరిస్థితి ఉండేది. దావూద్‌ ముఠా బెదిరింపులతో వణికిపోవాల్సి వచ్చేది. ఇప్పుడు బిష్ణోయ్‌తో పాటు కొత్త గ్యాంగులు పుట్టుకొస్తున్నాయి. టీ సిరీస్‌ అధినేత గుల్షన్ కుమార్ హత్య 1997లో బాలీవుడ్‌ని షాక్‌కి గురిచేసింది. 10కోట్లు డిమాండ్‌ చేసిన గ్యాంగ్‌స్టర్లు.. ఓ ఆలయం బయట ఆయన్ని కాల్చిచంపారు. మరుసటి సంవత్సరమే బాలీవుడ్‌ నిర్మాత ముఖేష్‌ దుగ్గల్‌ని అండర్‌వరల్డ్‌ మాఫియా హత్యచేసింది. సరిగ్గా పాతికేళ్లక్రితం.. 2000 సంవత్సరంలో హీరో హృతిక్‌రోషన్‌ తండ్రి, చిత్ర నిర్మాత రాకేష్‌రోషన్‌పైనా అండర్‌వరల్డ్‌ మాఫియా కాల్పులకు తెగబడింది.

అండర్‌వరల్డ్‌ బెదిరింపులతో 80, 90దశకాల్లో బాలీవుడ్‌ బిక్కుబిక్కుమంటూ బతకాల్సి వచ్చింది. కానీ 2000నుంచి 2010దాకా ముంబై కాస్త ప్రశాంతంగానే ఉంది. 2022లో అమితాబచ్చన్‌కి బాంబు బెదిరింపు ఉత్తిదేనని తేలేదాకా టెన్షనే. ఎప్పుడో పుష్కరకాలం క్రితమే హీరో అక్షయ్‌కుమార్‌ని బెదిరించింది ముంబై మాఫియా. అంతకుముందు వివేక్‌ ఒబెరాయ్‌ ఫ్యామిలీకి బెదిరింపులు వచ్చాయి. బెదిరింపులతో దర్శక నిర్మాణ కరణ్‌జోహార్‌కి రక్షణ కల్పించాల్సి వచ్చింది. ఇంకొందరు నిర్మాతలు కూడా అండర్‌వరల్డ్‌ థ్రెట్‌ ఎదుర్కున్నారు. చోరీ చోరీ చుప్కే చుప్కే సినిమా షూటింగ్‌లో తనకు అండర్ వరల్డ్ నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయని హీరోయిన్‌ ప్రీతిజింటా చెప్పడం అప్పట్లో ఓ సంచలనం.

అజయ్‌దేవగన్‌లాంటి హీరో బుల్లెట్‌ప్రూఫ్‌ వాహనంతోపాటు గట్టి సెక్యూరిటీతో బయటికొస్తున్నారు. మూడేళ్లక్రితమే గన్‌ లైసెన్స్‌ తీసుకున్న సల్మాన్‌ అప్పట్లోనే కారుని, ఈమధ్యే ఇంటిని బుల్లెట్‌ ప్రూఫ్‌గా మార్చుకున్నారు. షారుఖ్‌ఖాన్‌ ఇదివరకటిలా ఇంటిబయట ఫ్యాన్స్‌కి పెద్దగా కనిపించడంలేదు. బాలీవుడ్‌ నటుడు గోవిందా కాలికి కొన్నాళ్లక్రితం బుల్లెట్‌ గాయమైంది. కప్ బోర్డు నుంచి రివాల్వర్ జారిపడి మిస్‌ఫైర్‌ అయిందని హీరో స్టేట్మెంట్‌ ఇచ్చారు. ఆ సంఘటనపై కొన్ని అనుమానాలున్నా.. బాలీవుడ్‌ భయం గుప్పెట్లో బతుకుతోందనేందుకు ఈ ఇన్సిడెంట్‌ ఓ ఎగ్జాంపుల్‌. బాబా సిద్ధిఖీ హత్య తర్వాత ముంబై సేఫేనా అనే ప్రశ్న వస్తోంది.

బాలీవుడ్‌కే కాదు ముంబైలో పారిశ్రామికవేత్తలకు కూడా బెదిరింపులు వస్తున్నాయి. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్ అంబానీకి కూడా ఈ అనుభవం ఎదురైంది. 20కోట్లు ఇవ్వకపోతే అంబానీ కుటుంబాన్ని చంపేస్తానని మెయిల్‌లో బెదిరించాడో వ్యక్తి. 2022 ఆగస్టున రిలయన్స్‌ ఫౌండేషన్‌ నిర్వహిస్తున్న ఆసుపత్రిని పేల్చేస్తామని బెదిరించారు. 2021లో అంబానీ నివాసం సమీపంలో పేలుడు పదార్థాలతో ఓ స్కార్పియో కారును నిలిపి ఉంచడం సంచలనం సృష్టించింది. ఈ కేసు అనుకోని మలుపులు తిరిగి చివరికి ఓ ఇన్‌స్పెక్టర్‌ని కుట్రవెనుక సూత్రధారిగా గుర్తించారు.

ముంబై ఆర్థికరాజధాని. సెలబ్రిటీలు, పారిశ్రామికవేత్తలే కాదు అంతులేని సంపద అక్కడుంది. అందుకే నేరసామ్రాజ్యం ముంబైపై గురిపెడుతోంది. అదనుచూసి బెదిరిస్తోంది. సైఫ్‌పై దాడి దేనికైనా తెగబడ్డ ఏ దొంగోడి పనో కావచ్చుగాక. ఏమాత్రం ఆదమరిచినా ప్రమాదమేనని సెలబ్రిటీలు, ప్రముఖులను భయమైతే వెంటాడుతోంది. బాంద్రా.. సామాన్యులు కలలు కనే సంపన్నప్రాంతం. అలాంటిచోట ఇప్పుడు భయంభయం. సల్మాన్‌ఖాన్‌ ఇంటిని గ్యాంగ్‌స్టర్స్ రెక్కీ చేసి కాల్పులు జరిపిందీ, ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీని టార్గెట్‌ చేసి చంపేసిందీ, ఇప్పుడు సైఫ్‌ అలీఖాన్‌ ఇంట్లోనే కత్తితో తెగబడిందీ ఆ బ్రాందాలోనే. బుల్లెట్‌ ప్రూఫ్‌లాంటిదనుకునే బాంద్రా ఇప్పుడు భయం గుప్పెట్లో ఉంది.

మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి