CM Chandrababu: పిల్లలు లేకపోతే ఎన్నికల్లో పోటీకి అర్హతే లేదు.. జనాభా పెంపుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

CM Chandrababu: ఏపీ వృద్ధి రేటు అంచనాలపై ప్రజెంటేషన్ ఇచ్చిన సీఎం.. జనాభా వృద్ధి అంచనాలు ఎలా ఉండబోతున్నాయనే అంశాలను వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి కనీసం ఇద్దరు పిల్లలు ఉండడం తప్పనిసరి చేయాలనే ఆలోచనలో ఉన్నాం.. గతంలో ఇద్దరికంటే ఎక్కువ..

CM Chandrababu: పిల్లలు లేకపోతే ఎన్నికల్లో పోటీకి అర్హతే లేదు.. జనాభా పెంపుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Follow us
Eswar Chennupalli

| Edited By: Subhash Goud

Updated on: Jan 16, 2025 | 8:40 PM

ఒకప్పుడు జనాభా నియంత్రించాల్సిన అవసరం ఉందని చెప్పిన సీఎం చంద్రబాబు.. కొన్నేళ్ల నుంచి జనాభా పెరగాల్సిన అవసరం ఉందని పదే పదే చెబుతున్నారు. కార్యక్రమం ఏదైనా.. ఈ విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. జనాభా పెరగాల్సిన అవసరం ఉందని.. ప్రజలంతా ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలన్నారు. తాజాగా ఏపీ వృద్ధి రేటు అంచనాలపై ప్రజెంటేషన్ ఇచ్చిన సీఎం.. జనాభా వృద్ధి అంచనాలు ఎలా ఉండబోతున్నాయనే అంశాలను వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి కనీసం ఇద్దరు పిల్లలు ఉండడం తప్పనిసరి చేయాలనే ఆలోచనలో ఉన్నాం.. గతంలో ఇద్దరికంటే ఎక్కువ పిల్లలు ఉన్నవారు అనర్హులని చట్టం తీసుకువచ్చాం.. ఇప్పుడు కనీసం ఇద్దరు పిల్లలు ఉండాలని కొత్త నిబంధన తీసుకురావాలని పరిశీలిస్తున్నామని అన్నారు.

స్వర్ణాంధ్ర విజన్ 2047 ప్రణాళికతో ముందుకు సాగుతామన్న చంద్రబాబు.. అప్పటి జనాభా అంచనాలు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయని అన్నారు. 2051 నాటికి ఏపీ జనాభా 5 కోట్ల 42 లక్షల మాత్రమే ఉంటుందన్న అంచనాలను ప్రస్తావించారు. ఇది ఒక రకంగా ప్రమాదకరమైన అంశమన్నారు. 2011లో 4.95 కోట్లుగా ఉన్న ఏపీ జనాభా.. 2016లో 5.16 కోట్లు, 2021లో 5.29 కోట్లు, 2026లో 5.38 కోట్లు, 2031లో 5.42 కోట్లు, 2036లో 5.44 కోట్లు, 2041లో 5.42 కోట్లు, 2046లో 5.42 కోట్లు, 2051లో 5.41 కోట్లుగా ఉండొచ్చన్న అంచనాలను వివరించారు. 2031 నుంచే జనాభా తగ్గుదల మొదలుకావొచ్చన్నారు. దేశ జనాభా సైతం 2051 నుంచి తగ్గుముఖం పడుతుందనే అంచనాలు ఉన్నాయన్నారు.

జనాభా అనేది కూడా ఒక ఆస్తి అని.. దానిని కూడా పెంచాల్సిన అవసరం ఉందన్నారు చంద్రబాబు. సంపదను సృష్టించే క్రమంలో జనాభాను నిర్లక్ష్యం చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆందోళన వ్యక్తం చేశారు. పెద్ద పెద్ద రోడ్లు, ఎయిర్‌పోర్టులు ఉన్నా.. వాటిలో జనం ఉండరన్నారు.

జనాభా పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెట్టామన్న చంద్రబాబు.. సర్పంచ్, మేయర్, మున్సిపల్ కౌన్సిలర్ లాంటి స్థానిక సంస్థల పదవులకి ఇద్దరి కంటే తక్కువ పిల్లలున్న వారిని అనర్హులుగా ప్రకటించే నిర్ణయం తీసుకోబోతున్నామన్నారు. దీనిపై కసరత్తు జరుగుతోందన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి