మంటలు ఎగిసిపడుతున్నపుడు.. దాన్ని ఆర్పే ప్రయత్నం చేయాలి కానీ ముందు వెనక ఆలోచించకుండా ఆజ్యం మాత్రం పోయకూడదు. కానీ బాలీవుడ్‌లో కొందరు ఇదే చేస్తున్నారు. సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ లాంటి సీనియర్లు కూడా దీనిపై స్పందించకుండా ఉండిపోతే.. కొందరు జూనియర్లు మాత్రం తెలిసీ తెలియని కామెంట్స్‌తో మరింత రచ్చకు తెర లేపుతున్నారు. తాజాగా అలియా(Alia Bhatt) సైతం ఇలాంటి వ్యాఖ్యలే చేసారు. బాలీవుడ్‌లో బాయ్ కాట్ ట్రెండ్ ఎలా నడుస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కరణ్ జోహార్ నిర్మించారని లైగర్‌ను కూడా వదల్లేదు. అయితే విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ దీన్ని ఎలాగోలా సద్దుమనిగేలా చేసారు. ఈ బాయ్ కాట్ ట్రెండ్‌పై బాలీవుడ్ సీనియర్స్ కూడా ఏం స్పందించట్లేదు. ఏం మాట్లాడితే అదెక్కడికి దారి తీస్తుందో అని అంతా కామ్‌గానే ఉన్నారు. కానీ అలియా భట్, కరీనా కపూర్, అర్జున్ కపూర్ లాంటి వాళ్ళు మాత్రం ఈ రచ్చను మరింత పెద్దగా మార్చేస్తున్నారు.
బ్రహ్మస్త్ర ప్రమోషన్స్‌లో భాగంగా అలియా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈమె వ్యాఖ్యలతో సినిమాను బ్యాన్ చేయాలంటూ ట్వీట్స్ మొదలయ్యాయి. నెపోటిజం, బాయ్ కాట్ గురించి అలియాను అడిగినపుడు.. సహనం కోల్పోయారు. ఫలానా కుటుంబంలో పుట్టాలని నేను కోరుకుని పుట్టానా? సినిమా నేపథ్యం ఉన్న కుటుంబాల్లో పుడితే.. తొలి సినిమా వరకే అది యూజ్ అవుతుంది.. ఆ కుటుంబంలోనే పుట్టడం తప్పంటే ఎలా.. నేను మీకు నచ్చకపోతే నన్ను చూడొద్దు.. దానికి నేనేమీ చేయలేనంటూ ఫైర్ అయ్యారు. మొన్న కరీనా కపూర్, అర్జున్ కపూర్ సైతం మీకు నచ్చకపోతే ఎవరు చూడమన్నారంటూ మండిపడ్డారు. అసలే సుశాంత్ మరణం తర్వాత స్టార్ కిడ్స్‌పై కోపంగా ఉన్న వాళ్ళకు.. ఈ కామెంట్స్ ఇంకా మంట పుట్టిస్తున్నాయి. మరీ ముఖ్యంగా తాజాగా అలియా చేసిన కామెంట్స్‌తో బ్రహ్మాస్త్రను పూర్తిగా బాయ్ కాట్ చేయాలంటూ ట్వీట్ల వర్షం కురుస్తుంది. సెప్టెంబర్ 9న విడుదల కానున్న ఈ చిత్రంపై అలియా కామెంట్స్ ఎలాంటి ప్రభావం చూపిస్తాయో చూడాలిక.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.