Online Ponzi Scam: రూ.వెయ్యి కోట్ల కుంభకోణం కేసులో నటుడు గోవిందా పేరు తెరపైకి.. అసలేం జరిగిందంటే..?

|

Sep 14, 2023 | 2:45 PM

దాదాపు వెయ్యి కోట్ల రూపాయల ఆన్‌లైన్ పోంజీ కుంభకోణం దర్యాప్తుకు సంబంధించి బాలీవుడ్‌ స్టార్ నటుడు గోవిందాను ప్రశ్నించనున్నట్లు ఒడిశా ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ (EOW) బుధవారం (సెప్టెంబర్ 13) ఓ ప్రకటనలో తెలిపింది. పాన్-ఇండియా స్కామ్‌లో దోషిగా తేలిన కంపెనీకి సంబంధించిన ప్రకటనలో నటుడు గోవింద్‌ నటించినందుకు విచారించనున్నట్లు ప్రకటనలో పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో..

Online Ponzi Scam: రూ.వెయ్యి కోట్ల కుంభకోణం కేసులో నటుడు గోవిందా పేరు తెరపైకి.. అసలేం జరిగిందంటే..?
Actor Govinda
Follow us on

ముంబై, సెప్టెంబర్ 14: దాదాపు వెయ్యి కోట్ల రూపాయల ఆన్‌లైన్ పోంజీ కుంభకోణం దర్యాప్తుకు సంబంధించి బాలీవుడ్‌ స్టార్ నటుడు గోవిందాను ప్రశ్నించనున్నట్లు ఒడిశా ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ (EOW) బుధవారం (సెప్టెంబర్ 13) ఓ ప్రకటనలో తెలిపింది. పాన్-ఇండియా స్కామ్‌లో దోషిగా తేలిన కంపెనీకి సంబంధించిన ప్రకటనలో నటుడు గోవింద్‌ నటించినందుకు విచారించనున్నట్లు ప్రకటనలో పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో వ్యాపారం సాగిస్తోన్న సోలార్ టెక్నో అలయన్స్ అనే కంపెనీ క్రిప్టోకరెన్సీ పెట్టుబడి పేరుతో ఆన్‌లైన్ పోంజీ స్కీంను నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అనుమతి లేకుండా దేశవ్యాప్తంగా 2 లక్షల మందికి పైగా కస్టమర్ల నుంచి ఈ కంపెనీ భారీ మొత్తంలో డిపాజిట్లను సేకరించింది. ఇలా దాదాపు రూ. 1,000 కోట్లు సమీకరించినట్లు సమాచారం.

ఈ ఆన్‌లైన్ పోంజీ స్కామ్‌లో బాలీవుడ్ నటుడు గోవిందా పేరు తెరపైకి రావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆ కంపెనీకి సంబంధించి కొన్ని ప్రచార కార్యక్రమాలు నిర్వహించినందుకు గానూ గోవిందాను ఈఓడబ్ల్యూ ప్రశ్నించనుంది. ఐతే ఈ కుంభకోణంలో నటుడు గోవిందా ప్రస్తుతానికి అనుమానితుడు మాత్రమేనని, నిందితుడుకాదని స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి

గోవింద నటించిన ప్రచార ప్రకటనల ద్వారా స్కామ్‌కు సంబంధించి మరిన్ని ఆధారాలు రాబట్టేందుకు ఈఓడబ్ల్యూ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో గోవిందాను ప్రశ్నించేందుకు ఒడిశా ఈఓడబ్ల్యూ బృందం త్వరలో ముంబైకి వెళ్లనుంది. ఇక ఈ కుంభకోణంలో గోవింద పాత్రపై పూర్తి వివరాలు వెల్లడికావల్సి ఉంది.

భద్రక్, కియోంఝర్, బాలాసోర్, మయూర్‌భంజ్ మరియు భువనేశ్వర్‌లో వెయ్యి మంది నుంచి కంపెనీ రూ.30 కోట్లు వసూలు చేసింది. ఇక బీహార్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ, జార్ఖండ్ వంటి ఇతర రాష్ట్రాల్లోని పెట్టుబడిదారుల నుంచి డిపాజిట్ల రూపంలో కోట్ల డబ్బు వసూలు చేశారు. ఈ కుంభకోణంకి సంబంధించి ఈ ఏడాది ఆగస్టు 7న ఒడిశా అధినేతలు గుర్తేజ్ సింగ్ సిద్ధూ, నిరోద్ దాస్‌లను ఈఓడబ్లూ అరెస్టు చేసింది. ఆ తర్వాత భువనేశ్వర్‌కు చెందిన ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్ రత్నాకర్ పాలైనికి సిద్ధూతో సంబంధం ఉన్నట్లు రుజువుకావడంతో అదే నెల 16న అతన్ని కూడా అరెస్టు చేశారు. కంపెనీ చీఫ్ డేవిడ్ గెజ్‌పై లుకౌట్ సర్క్యులర్‌ ఇప్పటికే జారీ అయ్యింది.

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.