న్యూఢిల్లీ, అక్టోబర్ 6: బాలీవుడ్‌లో మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసు సంచలనంగా మారింది. ఈ కేసులో మరో నటికి తాజాగా ఈడీ సమన్లు జారీ చేసింది. శుక్రవారం (అక్టోబర్ 6) విచారణకు హాజరుకావాలని హీరో రణ్‌బీర్ కపూర్‌తోపాటు శ్రద్ధాకపూర్‌ను ఈడీ కోరినట్లు తెలుస్తోంది. ఇల్లీగల్ గేమింగ్ యాప్ కేసులో వీరి ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తోన్న ఈడీ ఈ మేరకు సమన్లు చేసినట్లు తెలుస్తోంది. మహదేవ్ యాప్‌పై ఇప్పటికే పలువురు తారలను ప్రశ్నించిన ఈడీ తాజాగా శ్రద్ధా కపూర్, రణ్బీర్ కపూర్‌లను ప్రశ్నించనుంది. ఈ కేసులో జరిగిన ఆర్థిక మోసాలపై విచారించనున్న కేంద్ర ఏజెన్సీ ముందు హాజరుకావడానికి రణ్‌బీర్ కపూర్ తనకు రెండు వారాలు గడువు కావాలంటూ ఈడీని కోరారు. ఇక శ్రద్ధా కపూర్ ఈడీ ముందుకు వస్తుందో? రాదో? అనే విషయం మాత్రం స్పష్టంగా తెలియరాలేదు.
కాగా మహాదేశ్ యాప్ కేసులో ఇప్పటికే ప్రముఖ నటుడు రణ్‌బీర్ కపూర్, హాస్యనటుడు కపిల్ శర్మ, నటీమణులు హ్యూమా ఖురేషి, హీనా ఖాన్‌కు ఈడీ నుంచి సమన్లు జారీ అయ్యాయి. రణ్‌బీర్ కపూర్ ఈ రోజు రాయ్‌పుర్‌లోని ఈడీ ముందు హాజరు కావాల్సి ఉండగా, ఆయన రెండు వారాల సమయం కోరారు. ఇక కపిల్ శర్మ, హ్యూమా ఖురేషి, హీనా ఖాన్‌ను మాత్రం వేర్వేరు తేదీల్లో ఈడీ ప్రశ్నించనున్నట్లు అధికారులు తెలిపారు. బాలీవుడ్ సెలబ్రెటీలను ఈ కేసులో నిందితులుగా పేర్కొనలేదు. కానీ యాప్ ప్రమోటర్లు వారికి చేసిన చెల్లింపులు ఏ విధంగా జరిగాయి అన్నది తెలుసుకునేందుకు ప్రశ్నించనున్నారు. రణ్‌బీర్ కపూర్ మహదేవ్ యాప్‌ను ప్రమోట్ చేస్తూ అనేక ప్రకటనల్లో నటించారు. ఈ ప్రకటనల ద్వారా ఆయనకు పెద్ద మొత్తంలో డబ్బు ముట్టినట్లు సమాచారం.
మహాదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ ప్రమోటర్లు సౌరభ్ చంద్రకర్, రవి ఉప్పల్ ఉప్పల్ ఛత్తీస్‌గఢ్‌లోని భిలాయ్‌కు చెందిన వారు. వీరు సుమారు 4 వేల మంది ఆపరేటర్లను నియమించారు. ఒక్కో ఆపరేటర్‌కు 200 మంది వరకు కస్టమర్లు ఉన్నారు. అలా రోజుకు సుమారు రూ.200 కోట్ల వరకు డబ్బు చేతులు మారుతోంది. దుబాయ్ ప్రధాన కేంద్రంగా ఈ యాప్ కార్యకలాపాలు సాగుతున్నట్లు ఈడీ దర్యాప్తులో బయటపడింది. వీరు ఇలాంటి యాప్ లు 4 నుంచి 5 వరకు నిర్వహిస్తున్నారు. ఈ కేసులో ప్రధాన సూత్రదారులైన సౌరభ్, రవి పరారీలో ఉన్నారు. గత నెలలో మహాదేవ్ బెట్టింగ్ యాప్‌కు సంబంధించి ముంబై, కోల్‌కతా, భోపాల్‌లోని 39 ప్రదేశాలలో జరిగిన ఆకస్మిక దాడుల్లో రూ.417 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో 14 నుంచి 15 మంది సెలబ్రిటీలు, నటుల పాత్ర ఉన్నట్లు ఈడీ అనుమానిస్తోంది. మిగిలిన వారికి కూడా ఈడీ త్వరలో సమన్లు జారీ చేయనుంది.
మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్ చేయండి.