నటి కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఎమర్జెన్సీ చిత్రం షూటింగ్ పార్లమెంట్‌లో జరగబోతోందా? అందుకు లోక్‌సభ కార్యాలయం అనుమతి ఇస్తుందా? ఇంతకీ ఆ సినిమా కథా కమామీషేంటి.. ? ఆ వివరాల్లోకెళ్తే.. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో ఎమర్జెన్సీ చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కొన్ని సన్నివేశాలను పార్లమెంటు లోపల చిత్రీకరించేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఆమె ఇటీవల లోక్‌సభ కార్యాలయానికి దరఖాస్తు చేసుకున్నారు.
దేశంలో 1975నాటి ఎమర్జెన్సీ రోజులకు సంబంధించిన ఇతివృత్తంతో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పాత్రను కంగనా రనౌత్ పోషిస్తున్నారు. సాధారణంగా పార్లమెంట్ లోపల ప్రైవేటు వ్యక్తులు, సంస్థలు షూటింగ్ చేసుకునేందుకు వీలులేదు. కేవలం ఏదైనా అధికారిక, ప్రభుత్వ కార్యక్రమాలకు మాత్రమే అనుమతి ఉంటుంది. పార్లమెంట్ ప్రాంగణంలో చిత్రీకరణకు ప్రభుత్వ ఛానళ్లైన దూరదర్శన్, సంసద్ టీవీలకు మాత్రమే అనుమతి లభిస్తుంది.
దీంతో కంగనా సినిమా షూటింగ్‌కు అనుమతి వస్తుందా? లేదా అన్నది ఆసక్తి రేపుతోంది. ఈ చిత్రానికి కంగనా కథ అందించడంతో పాటుగా, దర్శకత్వం కూడా వహిస్తున్నారు. సహా నిర్మాతగా కూడా ఉన్నారు. ‘ఎమర్జెన్సీ’ అనేది భారత రాజకీయ చరిత్రలో అత్యంత ముఖ్యమైన కాలాలలో ఒకటి. ఇది మనం అధికారాన్ని చూసే విధానాన్ని మార్చింది. అందుకే నేను ఈ కథను చెప్పాలని నిర్ణయించుకున్నానన్నారు కంగనా రనౌత్.
మరిన్ని తాజా సినీ వార్తల కోసం క్లిక్ చేయండి.