
సినీ తారలపై అభిమానులకు ఉండే ఇష్టం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొందరి అభిమానం మొదటి రోజు మొదటి షో సినిమా చూడడంతో ఆగిపోతే, మరికొందరి అభిమానం మాత్రం దైవంలా పూజించే స్థాయి వరకు చేరుకుంటుంది. అందులో భాగంగానే తమ అభిమాన తారలకు దేవాలయాలు కట్టించే స్థాయికి ఎదిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ జాబితాలో హీరోలకంటే హీరోయిన్లే ఎక్కువగా ఉంటారు. మరీ ముఖ్యంగా తమిళనాడులో ఈ సంస్కృతి ఎక్కువగా ఉంటుంది. అప్పట్లో ఖుష్బూ, నిధి అగర్వాల్‌లకు ఆలయాలు నిర్మించినట్లు వార్తల్లో చూశాం. అయితే ఇప్పుడు అందాల తార సమంతకు కూడా గుడిని కడుతున్నాడు ఓ అభిమాని.
వివరాల్లోకి వెళితే.. బాపట్ల జిల్లా ఆలపాడుకు చెందిన సందీప్ అనే వ్యక్తి సమంతకు వీరాభిమాని. సామ్ అంటే పడి చచ్చేంత ఇష్టం. తన అభిమాన తార మయోసైటిట్ బారిన పడిందని తెలియగానే సందీప్ తల్లడిల్లిపోయాడు. సామ్ ఆ వ్యాధి నుంచి కోలుకోవాలని ఏకంగా మొక్కుబడి యాత్రం చేశాడు. తిరుపతి, చెన్నై, నాగపట్నంలో యాత్ర చేశాడు. ఇలా సామ్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకున్న సందీప్ ఇప్పుడు మరో అడుగు ముందుకేశాడు.
ఏకంగా సమంతకు ఆలయాన్నే కట్టాలని నిర్ణయించుకున్నాడు. తన ఇంటలోనే సమంతకు గుడిని నిర్మిస్తున్నాడు. సమంత పుట్టిన రోజు సందర్భంగా ఏప్రిల్ 28వ తేదీన ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు. ఇదిలా ఉంటే గతంలోనూ పలువురు హీరోయిన్లకు గుడి కట్టిన ఘటనలు అందరినీ ఆకర్షించిన విషయం తెలిసిందే. తాజాగా ఓ తెలుగు వ్యక్తి ఇలా సినీ తారకు గుడి కడుతున్నాడన్న అంశం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..