AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పశ్చిమ బెంగాల్ ఎన్నికలు 2021: రెండో దశ ఎన్నిక ప్రచారానికి నేటితో తెర.. మమతా అమిత్ షా పోటా పోటీ ర్యాలీ

ప్రస్తుతం నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. అయితే, దేశ రాజకీయాలు మాత్రం పశ్చిమ బెంగాల్ మీదే కేంద్రీకృతమయ్యాయి.

పశ్చిమ బెంగాల్ ఎన్నికలు 2021: రెండో దశ ఎన్నిక ప్రచారానికి నేటితో తెర.. మమతా అమిత్ షా పోటా పోటీ ర్యాలీ
Balaraju Goud
|

Updated on: Mar 30, 2021 | 3:12 PM

Share

West Bengal elections 2021: ప్రస్తుతం నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. అయితే, దేశ రాజకీయాలు మాత్రం పశ్చిమ బెంగాల్ మీదే కేంద్రీకృతమయ్యాయి. కాగా, బంగాల్ ప్రచారం హోరాహోరీ దశకు చేరుకుంది. నందిగ్రామ్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి చివరి రోజు కావడంతో ఓటర్లను ఆకర్షించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే ఆ స్థానంలో మమతను ఓడించి సువేందును గెలిపించుకోవాలని భారతీయ జనతా పార్టీ అగ్రనేత అమిత్‌ షా పట్టుమీదున్నారు. ఈ హాట్‌సీట్‌లో ఎన్నికల ప్రచారానికి చివరి రోజు కావడంతో మమత, అమిత్ షా తమ శక్తియుక్తులన్నీ ధారపోస్తున్నారు.

నందిగ్రామ్ నుంచి బరిలోకి దిగుతున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. ఆ నియోజకవర్గంలో విస్తృతస్థాయిలో పర్యటించారు. ఇటీవల దీదీ కాలికి గాయం కాగా.. చక్రాల కుర్చీలోనే కూర్చొని ర్యాలీ నిర్వహించారు. కార్యకర్తలు, పార్టీ నేతలు చేపట్టిన పాదయాత్రకు నేతృత్వం వహించారు. మోదీ అమిత్‌షా ఎత్తుగడలకు వెరవకుండా.. మరోసారి అధికారాన్ని చేపట్టాలని తృణమూల్ అధినేత్రి మమతాబెనర్జీ ఎన్నికల ప్రచారంలో దీటుగా పాల్గొంటున్నారు.

ఇందులో భాగంగా అమిత్‌ షా రోడ్‌ షోలో పాల్గొనే వేదికను దాటుకుంటూ మమత ముందుకెళ్లారు. ఆ సమయంలో అక్కడున్న కొందరు జై శ్రీరామ్ నినాదాలతో మమత రోడ్‌ షోను ఆటంకపరిచే ప్రయత్నం చేశారు. నినాదాలు చేస్తూ, ఆమె రోడ్‌ షోను వెంబడించారు. అయితే, ఆమెకు ఇలాంటి పరిస్థితి గతంలోనూ ఎదురైంది. సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా..మమత ప్రసంగిస్తుండగా.. జై శ్రీరామ్ నినాదం దద్దరిల్లింది. దీంతో ఆమె ప్రసంగించేందుకు నిరాకరించారు. ముఖ్యమంత్రిని అవమానపరిచేందుకే ఆ నినాదాలు చేసినట్లు అప్పట్లో టీఎంసీ ఆరోపించింది.

హిందూ ఓటర్లను ఆకర్షించేందుకు కొద్దికాలంగా పశ్చిమ బెంగాల్‌లో భారతీయ జనతా పార్టీ జై శ్రీరామ్ నినాదం హోరెత్తుతోంది. ఇదిలా ఉండగా..ఎనిమిది దశల్లో జరగనున్న బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండగా, ఇందులో భాగంగా ఇప్పటికే మొదటి దశ పోలింగ్‌ ముగిసింది. ఏప్రిల్ ఒకటిన జరిగే రెండో దశలో ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. రెండో దశలో మమతా బెనర్జీ ప్రాతినిథ్యం వహిస్తున్న నందిగ్రామ్ అసెంబ్లీ స్థానం కూడా ఉండటం విశేషం.

మరోవైపు, బీజేపీ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాపై తమదైన శైలి విమర్శ బాణం ఎక్కుపెడుతున్నారు. ‘మమతాజీ మానసికంగా స్థిమితంగా లేరు. నందిగ్రామ్‌లో ఆమెకు ప్రతికూల స్పందన వస్తుండటంపై తీవ్ర నిరాశలో ఉన్నారు. మరణించిన ఆ వృద్ధురాలి కుటుంబాన్ని ఓదార్చకుండా..ఉత్తర్‌ ప్రదేశ్‌ గురించి మాట్లాడుతున్నారు. ఆమె తన బాధ్యతలను విస్మరించారనడానికి ఇది నిదర్శనం. ఆమె ఓటమి గురించి భయపడుతున్నారు’ అంటూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మమతపై విమర్శలు గుప్పించారు. తృణమూల్ కార్యకర్తల దాడిలో ఓ బీజేపీ కార్యకర్త తల్లి మృతి చెందినట్లు భారతీయ జనతా పార్టీ ఆరోపిస్తోంది. దీంతో రెండు పార్టీల మధ్య వివాదానికి దారి తీసింది.

Read Also…  CM YS Jagan : సీఎం జగన్మోహన్‌ రెడ్డి ‘స్పందన’ కార్యక్రమ వీడియో కాన్ఫరెన్స్, ఈ అంశాలపైనే మెయిన్ ఫోకస్‌..