West Bengal Election 2021: ప్రధాని మోదీది ఎన్నికల కోడ్ ఉల్లంఘనే…ఎన్నికల సంఘానికి TMC ఫిర్యాదు
West Bengal Assembly Election 2021: పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికలు జరుగుతున్న తరుణంలో బంగ్లాదేశ్‌లో పర్యటించిన ప్రధాని మోదీ తమ పార్టీ(బీజేపీ)కి అనుకూలంగా పరోక్ష ప్రచారం చేసుకున్నారని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(TMC) ఆరోపించింది.
బంగ్లాదేశ్‌లో రెండ్రోజుల పర్యటనతో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారంటూ మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(TMC) కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికలు జరుగుతున్న తరుణంలో పొరుగుదేశమైన బంగ్లాదేశ్‌లో పర్యటించిన ప్రధాని మోదీ తమ పార్టీ(బీజేపీ)కి అనుకూలంగా పరోక్ష ప్రచారం చేసుకున్నారని ఆరోపించింది. గతంలో ఏ ప్రధానీ ఇలా అనైతిక, అప్రజాస్వామిక చర్యలకు విదేశీ గడ్డను వాడుకోలేదని పేర్కొంది. బంగ్లాదేశ్ 50వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ అధికారిక కార్యక్రమాల నిమిత్తం పర్యటన చేపడితే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని కేంద్ర ఎన్నికల చీఫ్ కమిషనర్‌కు రాసిన ఫిర్యాదు లేఖలో టీఎంసీ రాజ్యసభ సభ్యుడు డెరెక్ ఓబ్రెయిన్ పేర్కొన్నారు. అయితే ఈ సందర్భంగా ప్రధాని మోదీ చేపట్టిన కార్యక్రమాలు అభ్యంతరకరమన్నారు. ప్రధాని మోదీ ఈ నెల 27న బంగ్లాదేశ్ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఏ మాత్రం సంబంధంలేని కార్యక్రమాల్లో పాల్గొన్నారని విమర్శించారు.
ప్రధాని మోదీ పశ్చిమ బెంగాల్ బీజేపీ ఎంపీ శంతాను ఠాగూర్‌ను కూడా తన వెంట బంగ్లాదేశ్ పర్యటనకు తీసుకెళ్లడం పట్ల టీఎంసీ తన ఫిర్యాదులో అభ్యంతరం వ్యక్తంచేసింది. బీజేపీ ఎంపీ కేంద్ర ప్రభుత్వంలో ఎలాంటి అధికారిక హోదాలో లేరని గుర్తుచేసింది. ప్రధాని మోదీ వెంట బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లేందుకు టీఎంసీ ఎంపీతో పాటు మరే పార్టీ ఎంపీనీ ఆహ్వానించలేదని తెలిపింది. పశ్చిమ బెంగాల్‌లో తమ పార్టీకి లబ్ధి చేకూర్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపించింది. గతంలో ఇలా ఏ ప్రధానీ విదేశీ గడ్డను వాడుకుని ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించలేదని పేర్కొంది. ఇలాంటి చర్యలు పునరావృతం చేయకుండా ప్రధాని మోదీపై తగిన చర్యలు తీసుకోవాలని ఈసీని కోరింది.
ప్రధాని బంగ్లా పర్యటనకు మమత అభ్యంతరం… ఈ నెల 26-27 తేదీల్లో భారత ప్రధాని మోదీ బంగ్లాదేశ్‌లో రెండ్రోజుల అధికారిక పర్యటన చేపట్టడం తెలిసిందే. పశ్చిమ బెంగాల్ ఓటర్లను ప్రభావితం చేసే దురుద్దేశంతోనే ప్రధాని మోదీ బంగ్లాదేశ్ పర్యటన చేపట్టారంటూ శనివారంనాడు టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికలు జరుగుతున్న వేళ పొరుగు దేశంలో ప్రధాని పర్యటించడం ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించడమేనన్నారు. ఇక్కడ ఎన్నికలు జరుగుతుంటే..ప్రధాని మోదీ బంగ్లాదేశ్ వెళ్లి బంగ్లాలోనే ఉపన్యాసాలు ఇస్తున్నారని అభ్యంతరం వ్యక్తంచేశారు.
కాగా పశ్చిమ బెంగాల్‌లో రెండో విడత ఎన్నికలు జరగనున్న నియోజకవర్గాల్లో ఈ సాయంత్రంతో ప్రచారపర్వం ముగియనుంది. రెండో విడతలో 30 నియోజకవర్గాల్లో ఏప్రిల్ 1న పోలింగ్ నిర్వహించనున్నారు.
ఇవి కూడా చదవండి..మహిళలను అవమానించడమే కాంగ్రెస్-డీఎంకే సంస్కృతి.. తమిళనాడు ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ