AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బెంగాల్‌‌పై బీజేపీ స్పెషల్ ఫోకస్ .. రేపు బ్రిగేడ్‌ మైదానంలో మోదీ ర్యాలీ.. అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించే ఛాన్స్

పశ్చిమ బెంగాల్‌లో విజయమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ దూకుడు పెంచింది. ఇప్పటికే బెంగాల్‌లో పాగా వేసిన అగ్రనాయకత్వం.

బెంగాల్‌‌పై బీజేపీ స్పెషల్ ఫోకస్ .. రేపు బ్రిగేడ్‌ మైదానంలో మోదీ ర్యాలీ.. అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించే ఛాన్స్
Representative Image
Balaraju Goud
|

Updated on: Mar 06, 2021 | 5:11 PM

Share

West Bengal election 2021 : పశ్చిమ బెంగాల్‌లో విజయమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ దూకుడు పెంచింది. ఇప్పటికే బెంగాల్‌లో పాగా వేసిన అగ్రనాయకత్వం. అధికారంలోని టీఎంసీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించేందుకు విశ్వప్రయత్నాలు మొదలు పెట్టింది. ఎలాగైనా ఈసారి విజయ బావుటా ఎగరేయాలని భావిస్తోంది. ఇందుకోసం అందుకోసం అవసరమైన అస్త్రశస్త్రాలను ఇప్పటికే సిద్ధం చేసుకుంది. ఎన్నికల్లో బరిలోకి దింపే గెలుపు గుర్రాలను గుర్తించిన అధిష్టానం ఆదివారం తొలి దశ అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. అటు, మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ అసెంబ్లీ బరిలో నిలిచిన మొత్తం అభ్యర్థుల జాబితాను శుక్రవారమే ప్రకటించారు.

ఆదివారం కోల్‌కతాలో భారీ ర్యాలీ నిర్వహించేందుకు బీజేపీ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఈ ర్యాలీ ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ముఖ్యనేతలు సైతం పాల్గొంటున్నారు. బీజేపీ కార్యకర్తలు, నాయకుల్లో ఉత్సాహం నింపేందుకు అన్ని జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలను సమీకరించి ప్రధాని మోదీ బహిరంగసభకు పశ్చిమ బెంగాల్‌ బీజేపీ నేతలు ప్లాన్‌ చేశారు. ఈ సందర్భంగా అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ విడుదల చేయనున్నట్టు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. మొత్తం 60 మంది అభ్యర్థులు, వారు పోటీ చేయనున్న స్థానాలతో కూడి జాబితాను విడుదల చేయనుంది. ఇప్పటికే ఢిల్లీలో సమావేశమైన పార్టీ ముఖ్యనేతల సమావేశంలో జాబితాపై పూర్తిస్థాయిలో కసరత్తు చేసినట్లు సమాచారం.

తొలి రెండు దశల కోసం ఒక్కో స్థానానికి సగటున నలుగురైదుగురి పేర్లను బీజేపీ షార్ట్ లిస్ట్ చేసింది. ఈ నెల 4న తుది జాబితాను రెడీ చేసింది. ఇటీవల టీఎంసీని వీడి బీజేపీలో చేరిన సువేందు అధికారికి నందిగ్రామ్ స్థానం కేటాయించినట్లు ప్రచారం సాగుతోంది. అయితే అదే స్థానం నుంచి ముఖ్యమంత్రి మమత బెనర్జీ బరిలోకి దిగుతున్నారు. సువేందుకు కూడా అదే స్థానం నుంచి పోటీకి దిగితే ఎన్నికలు రసవత్తరంగా మారుతాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

నిజానికి నందిగ్రామ్‌పై సువేందు అధికారికి మంచి పట్టుంది. బీజేపీలో చేరకముందు టీఎంసీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించారు. రాష్ట్ర రవాణా, నీటిపారుదల, వాటర్ వేస్‌ శాఖలకు ఇన్‌చార్జ్‌గా వ్యవహరించారు. అయితే, ఆ తర్వాత ఆయన పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరడంతో పశ్చిమ బెంగాల్ రాజకీయాలు వేడెక్కాయి.

రాష్ట్రంలో ఈ నెల 27 నుంచి ఏప్రిల్ 29 వరకు 8 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మే 2న ఫలితాలు వెల్లడికానున్నాయి. ప్రధాని నరేంద్రమోదీ రేపు కోల్‌కతాలో పర్యటించనుండడంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రధాని ర్యాలీకి కనీసం 10 మందికి సమీకరించాలని బీజేపీ యోచిస్తోంది.

మరోవైపు, మమతకు చెక్‌ పెట్టేందుకు బీజేపీ నేతలు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే పలువురు సినీ నటులను పార్టీలో చేర్చుకున్న బీజేపీ నేతలు.. తాజాగా స్టార్‌ హీరో మిథున్‌ చక్రవర్తికి కాషాయ కండువా కప్పేందుకు సిద్ధమయ్యారు. ఆదివారం కోల్‌కతాలోని బ్రిగేడ్‌ మైదానంలో జరుగనున్న ప్రధాని మోదీ బహిరంగ సభలో మిథున్‌ చక్రవర్తి.. బీజేపీ కండువా కప్పుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే, బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ కూడా బీజేపీలో చేరవచ్చని పార్టీలు చెబుతున్నాయి.

గత నెలలో ముంబైలో ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌తో మిథున్‌ చక్రవర్తి సమావేశమయ్యారు. అప్పటి నుంచి మిథున్‌ దాదా బీజేపీలో చేరుతున్నట్లు వార్తలు వినిపించాయి. అంతకుముందూ నాగ్‌పూర్‌లో కూడా భగవత్‌తో దాదా నాలుగైదు గంటలపాటు భేటీ అయ్యారు. ఆయన ఎక్కడి నుంచి కోరుకుంటే అక్కడి నుంచి పోటీ చేసేందుకు టికెట్‌ ఇచ్చేందుకు బీజేపీ సిద్ధంగా ఉంది.

ఇదిలావుంటే, మిథున్‌ చక్రవర్తిని గౌరవిస్తూ అధికార టీఎంసీ ప్రభుత్వం ఆయనను 2014 లో రాజ్యసభకు ఎంపికచేసింది. అయితే, వ్యక్తిగత కారణాలతో ఆయన 2016 డిసెంబర్‌ 29 న రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి మమతా బెనర్జీతో దూరంగా ఉంటున్నారు.

ఇదీ చదవండిః  ఈ నెల మూడో వారంలో బడ్జెట్‌ సమావేశాలు..? ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్‌ సమీక్ష