దీదీని గద్దె దించండి.. ఒక్క పిట్టను కూడా బెంగాల్‌లో అడుగుపెట్టనీయం.. అలిపుర్దూరు ప్రచారసభలో కేంద్రమంత్రి అమిత్ షా
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బెంగాల్ అధికారమే లక్ష్యంగా భారతీయ జనతాపార్టీ సీఎం మమతా బెనర్జీని టార్గెట్ చేసింది.
Amit Shah in Bengal election campaign: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బెంగాల్ అధికారమే లక్ష్యంగా భారతీయ జనతాపార్టీ సీఎం మమతా బెనర్జీని టార్గెట్ చేసింది. బీజేపీ అగ్రనేతలు మోదీ, అమిత్ షా, జేపీ నడ్డాలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. 8 దశల్లో ఎన్నికలు జరుగుతున్న బెంగాల్‌లో ఇప్పటికే రెండు విడతల్లో పోలింగ్ పూర్తైంది. మూడో దశలో జరగనున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా… బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
నందిగ్రామ్‌లో మమతా దీదీ ఓడిపోతారని అమిత్‌షా జోస్యం చెప్పారు. నందిగ్రామ్‌లో గురువారం చోటుచేసుకున్న ఘటనలే ఆ నియోజకవర్గం ఆమె చేతులు జారిపోతోందనే విషయం స్పష్టం చేస్తున్నాయని అన్నారు. మే 2వ తేదీన జరిగే కౌంటింగ్ రోజు మధ్యాహ్నం 11 గంటల కల్లా బీజేపీ ఆధిక్యంలోకి వస్తుందని, 2 గంటల కల్లా దీదీ బెంగాల్‌లో ఆధికారం కోల్పోతుందని అమిత్ షా స్పష్టం చేశారు.
శుక్రవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా అలిపుర్దూరులో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ… మోదీ నాయకత్వంలో నార్త్ బెంగాల్ ప్రజల సమస్యలన్నింటినీ తాము పరిష్కరిస్తామని చెప్పారు. 60 నియోజకవర్గాల్లో ఇంతవరకూ జరిగిన ఎన్నికల్లో బీజేపీ 50 సీట్లు గెలుచుకుంటుందని, నార్త్ బెంగాల్ ప్రాంతంలోని మొత్తం 50 సీట్లూ బీజేపీ సొంతం చేసుకుంటుందని అమిత్‌షా ధీమా వ్యక్తం చేశారు.
అలాగే చొరబాటుదారుల సమస్యను అమిత్‌షా ప్రస్తావిస్తూ, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ఒక్క పిట్టను కూడా పశ్చిమబెంగాల్‌లోకి అడుగుపెట్టనీయమని అన్నారు. అక్రమ వలసలను అడ్డుకుని.. యువతకు ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. అలాగే, శరణార్ధులందరికీ గౌరవప్రదంగా భారత పౌరసత్వం ఇస్తామని ఆయన చెప్పారు. మమత ఆడే గేమ్స్‌కు బీజేపీ భయపడేది లేదని, దీదీ విసిరే సవాళ్లన్నింటినీ ఎదుర్కొనేందుకు ప్రతి బీజేపీ కార్యకర్త సిద్ధంగా ఉన్నాడలని పిలుపునిచ్చారు. అవినీతి పరులు, బీజేపీ కార్యకర్తలను అమానుషంగా చంపిన వాళ్లు మే 2వ తేదీ తర్వాత జైలుకు వెళ్తారని అన్నారు. కోల్ మాఫియా, ఇసుక మాఫియా, వాటర్ ట్యాంకర్ మాఫియా, పశువధతో ప్రమేయం ఉన్నవారందరిపైన ‘సిట్’తో దర్యాప్తు జరిపిస్తామని అమిత్‌షా స్పష్టం చేశారు.