Assembly Elections 2021: పాంచ్ పటాకాలో తొలి విడతకు రంగం సిద్ధం.. రెండు రాష్ట్రాల్లో హోరాహోరీ..!
యావత్ దేశ ప్రజలంతా ఉత్కంఠగా చూస్తున్న పాంచ్ పటాకా ఎన్నికల తొలి విడతకు రంగం సిద్దమైంది. అత్యంత ఉత్కంఠ రేపుతున్న బెంగాల్‌తోపాటు ఈశాన్య రాష్ట్రం అస్సాంలో తొలి విడత..
Assembly Elections 2021 First Phase Poling: యావత్ దేశ ప్రజలంతా ఉత్కంఠగా చూస్తున్న పాంచ్ పటాకా ఎన్నికల తొలి విడతకు రంగం సిద్దమైంది. అత్యంత ఉత్కంఠ రేపుతున్న బెంగాల్తో (Bengal) పాటు ఈశాన్య రాష్ట్రం అస్సాం (Assam) లో తొలి విడత పోలింగ్ మార్చి 27న జరగబోతోంది. బీజేపీ (BJP), టీఎంసీ (TMC) హోరాహోరీ తలపడుతుండడంతో బెంగాల్ పోరు ఆసక్తి రేపుతోంది. మరోవైపు అస్సాంలో పట్టు కాపాడుకునేందుకు బీజేపీ అన్ని యత్నాలు చేస్తుండడంతో అక్కడ కాంగ్రెస్, కమలం పార్టీల మధ్య పోరు రక్తికట్టింది. ఈ నేపథ్యంలో రెండు చోట్ల తొలి విడత పోలింగ్ (First Phase Polling) కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
బెంగాల్‌లో 30 అసెంబ్లీ (Bengal Assembly) స్దానాలు, అసోంలో 47 అసెంబ్లీ (Assam Assembly) స్థానాలకు తొలి విడత పోలింగ్ మార్చి 27న జరగబోతోంది. బెంగాల్ అసెంబ్లీలోని మొత్తం 294 సీట్లకుగాను సుదీర్ఘంగా ఎనిమిది విడతల్లో ఎన్నికలు జరగుతున్నాయి. సుదీర్ఘ ప్రక్రియ వైపు మొగ్గు చూపిన కేంద్ర ఎన్నికల సంఘం (Central Election Commission)పై బెంగాల్ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ మండిపడింది. గత ఎన్నికల్లో ఏడు విడతల్లో ఎన్నికలు జరగగా.. ఈసారి ఎనిమిది విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. పండుగలు, కోవిడ్-19 (COVID-19) ప్రొటోకాల్ దృష్టిలో పెట్టుకుని 8 దశల్లో పోలింగ్ నిర్వహించాలని నిర్ణయించినట్లు కేంద్ర ఎన్నికల కమిషనర్ ఇదివరకే ప్రకటించారు. కాగా బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, పదేళ్ల నుంచి రాష్ట్రాన్ని పాలిస్తున్న తృణమూల్ కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. బీజేపీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi), అమిత్ షా (Amit Shah) సహా పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. ముచ్చటగా మూడోసారి అధికారం దక్కించుకోవాలని పోటీ పడుతున్నారు సిట్టింగ్ సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee). కాంగ్రెస్ పార్టీ (Congress Party)తో కలిసి వామపక్షాలు బరిలోకి దిగినా ఈసారి వారి ప్రభావం పెద్దగా కనిపించడం లేదు.
బెంగాల్లో మొత్తం 7 కోట్ల 32 లక్షల 94 వేల 980 మంది ఓటర్లున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఒక పార్టీకి లేదా కూటమికి మేజిక్ మార్క్ 148 సీట్లు రావాల్సి వుంది. కాగా బెంగాల్‌లో పలు అసెంబ్లీ సీట్లు అందరిని ఆకర్షిస్తున్నాయి. వీటిలో ముఖ్యమైనది నందిగ్రామ్. గత రెండు ఎన్నికల్లో టీఎంసీ కైవసం చేసుకున్న నందిగ్రామ్‌లో ఈసారి పరిస్థితి భిన్నంగా వుంది. గతంలో ఇక్కడ్నించి గెలిచి.. మమత సర్కార్‌లో కీలకంగా వ్యవహరించిన సువేందు అధికారి (Subendu Adhikari).. తాజాగా బీజేపీలో చేరి అక్కడ్నించే బరిలోకి దిగారు. దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మమతాబెనర్జీ తాను గతంలో పోటీ చేసిన భవానీపూర్ (Bhavanipur) సీటును వదిలేసి.. నందిగ్రామ్ (Nandigram) బరిలో నిలిచి బీజేపీకి సవాల్ విసిరారు. నిజానికి ఇక్కడ భూ ఆందోళనలు నడిపి సువేందు అధికారికి, ఆయన కుటుంబానికి నందిగ్రామ్‌లో మంచి పట్టుంది. అయితే.. అది వ్యక్తిగతం కాదని, పార్టీ బలమేనని చాటేందుకు మమతా బెనర్జీ స్వయంగా బరిలోకి దిగి సాహసం చేస్తున్నారు. దాంతో ఇక్కడ సువేందు, మమతల మధ్య గట్టిపోటీ వుంటుందని భావిస్తున్నారు.
ఐదుగురు బీజేపీ ఎంపీలు పోటీ చేస్తున్న అసెంబ్లీ నియోజకవర్గాలపై కూడా అందరి దృష్టి వుంది. ఈ ఎన్నికల్లో అభివృద్ధి అంశంతోనే ప్రచారంలోకి దిగింది అధికార తృణమూల్ కాంగ్రెస్. జాతీయ స్థాయిలో వున్న చరిస్మాతో బెంగాల్‌ను గెలుచుకోవాలని చూస్తోంది బీజేపీ. తమ ప్రచారంలో బెంగాల్ కోసం ప్రగతిశీల బంగ్లా, ‘షోనార్ బాంగ్లా’ లాంటి మాటలు ఉపయోగించారు బీజేపీ అగ్ర నేతలు. తమను గెలిపిస్తే పేదలు కూడా మరింత ముందుకెళ్లేలా అవకాశాలు కల్పిస్తామన్నారు. ఆసోల్ పొరిబార్తోన్ (అసలు మార్పు) మాటతో ప్రచారంలో హోరెత్తించారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. మమత పాలనలో అవినీతి పెరిగిపోయిందని, అంఫాన్ రిలీఫ్ ఫండ్ వినియోగంలో అవకతవకలు జరగాయని బీజేపీ నేతలు ఆరోపణలు గుప్పించారు. అత్తా-అల్లుళ్ల జంటను టార్గెట్‌గా చేస్తూ విమర్శలు చేశాయి బీజేపీ సహా అన్ని విపక్షాలు. దేశంలో ధరల పెరుగుదల అంశాన్ని ప్రచారాస్త్రంగా మార్చుకుంది తృణమూల్ కాంగ్రెస్. మోదీ పాలనలో గ్యాస్ ధర, పెట్రోల్ (Petrol), డీజిల్(Diesel) ధరలు పెరగడంపై తీవ్ర స్థాయిలో ప్రచారం నిర్వహిచారు దీదీ సహా టీఎంసీ నేతలు.
అస్సాంలోను మొదటి విడత..
అస్సాంలో మొత్తం మూడు విడతల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో తొలి విడత పోలింగ్ మార్చి 27న నిర్వహిస్తున్నారు. అస్సాం అసెంబ్లీలో మొత్తం 126 అసెంబ్లీ సీట్లుండగా.. మూడు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మార్చి 27న తొలి విడత పోలింగ్ జరుగుతుంది. మొదటి విడత 47 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ జరగనున్నది. ఈ 47 సీట్లకు గాను 264 మంది పోటీ పడుతున్నారు. అస్సాంలో మొత్తం రెండు కోట్ల 33 లక్షల 74 వేల 87 మంది ఓటర్లున్నారు. కాగా.. ఇక్కడ అధికారంలో వున్న బీజేపీతో కాంగ్రెస్ పార్టీ పోటీ పడుతోంది. తిరిగి అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ నేతలు యధాశక్తి ప్రయత్నాలు చేస్తున్నారు. చిన్న రాష్ట్రమైనా బీజేపీ నేతలు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ఎన్నికల ర్యాలీలలో పాల్గొన్నారు. అస్సాంలో జరుగుతున్న తొలి విడత పోలింగ్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న వారిలో ముఖ్యమంత్రి సర్భానంద సోనోవాల్, స్పీకర్ హితేంద్ర నాథ్ గోస్వామి, మంత్రులు రంజిత్ దుత్తా, నబా కుమార్ దోలే, సంజయ్ కిషన్, అస్సాం కాంగ్రెస్ అధ్యక్షుడు రిపున్ బోరా, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి భరత్ నాథ్ తదితరులున్నారు.
ALSO READ: కరోనా ఆసుపత్రుల్లో అగ్ని ప్రమాదాలు.. కారణాలను విశ్లేషిస్తే షాకే..!