Tamil Nadu Elections: తమిళనాడు ఎన్నికల వేళ మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ విచిత్రమైన అనుభవం ఎదురైంది. తన పార్టీ మక్కల్ నీది మయ్యంకి ఓటేయాలంటూ రిలీజ్ చేసిన వీడియోని డీఎంకే పార్టీ తమకు అనుకూలంగా వాడేసుకుంది. డీఎంకేకి ఓటు వేయాలంటూ ప్రచారానికి ఉపయోగించుకుంది. అది చూసి కమల్ హాసన్ షాక్ అయ్యారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో విమర్శిస్తూ కమల్ హాసన్ సినిమా స్టైల్లో ఓ వీడియోను రూపొందించారు. ‘దేశ మ్యాప్‌లో పైన(ఢిల్లీలో) ఉన్నారు కదా అని మీరు మాకంటే పెద్దవాళ్లు కాదు’ బీజేపీకి వార్నింగ్ ఇచ్చారు కమల్ హాసన్. అంతేకాదు.. ‘మేం ఏం తినాలి.. ఎలా బతకాలి.. ఏ బాష మాట్లాడాలి.. అనేది కేంద్రంలో ఉన్న బీజేపీ డిసైడ్ చేయొద్దు’ అనిని ఘాటైన వ్యాఖ్యలతో బీజేపీపై విరుచుకుపడ్డారు. గాంధీజి బతికుంటే ఇందుకా స్వతంత్ర్యం వచ్చింది అని బాధపడేవారంటూ సొంత వ్యాఖ్యానంతో కమల్ హాసన్ వీడియో రిలీజ్ చేశారు. ప్రస్తుతం చీకటిమయం అయిపోయిన రాష్ట్రంలో వెలుగులు రావాలంటే.. తన పార్టీ గుర్తు టార్చ్ లైట్‌కు ఓటు వేయాలంటూ కమల్ హాసన్ ఆ వీడియోలో టార్చ్ లైట్ వేసి చూపిస్తారు.
అయితే ఈ వీడియోను గమనించిన డీఎంకే శ్రేణులు.. వీడియో చివర్లో ఎడిట్ చేసి తమిళనాడులో చీకటి పోవాలంటే డీఎంకే అధికారంలోకి రావాలని కమల్ చెప్పినట్టుగా మార్చేశారు. అసలు వీడియోలో కమల్ టార్చ్ లైట్ చూపించగా.. దాన్ని ఎడిట్ చేసి ఆ స్థానంలో డీఎంకే పార్టీ గుర్తు ‘ఉదయించే సూర్యుడు’ ని సెట్ చేశారు. అనంతరం ఆ వీడియోను సోషల్ మీడియాలో వదిలారు. అది కాస్తా తీవ్రస్థాయిలో వైరల్ అవడం.. కమల్ కంట పడటం చకచకా జరిగిపోయాయి. డీఎంకే చేసిన ఈ స్ఫూఫ్ వీడియోపై కమల్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానని అన్నారు. తన వీడియోను డీఎంకే ఎలా వాడుతుందంటూ నిప్పులు చెరిగారు. మక్కల్ నీది మయ్యం పార్టీ శ్రేణులు కూడా డీఎంకే తీరుపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
Also read:
ISSF World Cup: ప్రపంచ కప్ షూటింగ్‌లో భారత షూటర్ల జోరు.. ఇండియా ఖాతాలో మరో బంగారు పతకం..