Maharashtra Polls 2024: నామినేషన్ల గడువు సమీపిస్తోంది.. రెండు కూటముల్లోనూ ఇంకా తేలని సీట్ల పంచాయితీ!

వివిధ పార్టీలు కలిసి కూటములుగా ఏర్పడ్డ మహారాష్ట్రలో పొత్తులు, సీట్ల సర్దుబాటు అంశంలో ఏకాభిప్రాయం కుదరకపోవడం మరో కారణంగా కనిపిస్తోంది.

Maharashtra Polls 2024: నామినేషన్ల గడువు సమీపిస్తోంది.. రెండు కూటముల్లోనూ ఇంకా తేలని సీట్ల పంచాయితీ!
Maharashtra Assembly Election 2024
Follow us
Mahatma Kodiyar, Delhi, TV9 Telugu

| Edited By: Balaraju Goud

Updated on: Oct 27, 2024 | 9:20 PM

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడానికి చివరి తేదీ సమీపిస్తోంది. మంగళవారం (అక్టోబర్ 29)తో చివరి తేదీ ముగియనుంది. కానీ రెండు ఇంకా చాలా పార్టీలు తమ అభ్యర్థులను ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వ్యవహరించడం జాప్యానికి కొంత కారణమైతే, వివిధ పార్టీలు కలిసి కూటములుగా ఏర్పడ్డ ఈ రాష్ట్రంలో పొత్తులు, సీట్ల సర్దుబాటు అంశంలో ఏకాభిప్రాయం కుదరకపోవడం కూడా మరో కారణంగా కనిపిస్తోంది. భారతీయ జనతా పార్టీ (BJP) సారథ్యంలోని ‘మహాయుతి’ ఓవైపు, కాంగ్రెస్ సారథ్యంలోని ‘మహా వికాస్ అఘాడీ’ (MVA) మరోవైపు హోరాహోరీగా తలపడుతున్న పరిస్థితుల్లో రెండు కూటముల్లోనూ సీట్ల పంచాయితీ ఇంకా కొలిక్కి రాలేదు. మొత్తం 288 నియోజకవర్గాలున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో.. మహా వికాస్ అఘాడి 239 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.. మహాయుతి 215 మంది అభ్యర్థులను మాత్రమే ప్రకటించింది. రెండు కూటముల నుంచి దాదాపు నాలుగో వంతు స్థానాలకు అభ్యర్థులను ఇంకా ప్రకటించాల్సి ఉంది. మహాయుతి ఇంకా 73 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉండగా, మహా వికాస్ అఘాడి 49 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.

‘మహా వికాస్ అఘాడి’లో సీట్ల వివాదం

మహావికాస్ అఘాడిలో భాగంగా ఉన్న కాంగ్రెస్, శివసేన (ఉద్ధవ్ బాల్ థాక్రే వర్గం), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ – NCP (శరద్ పవార్ వర్గం) పార్టీలు ప్రధాన భాగస్వాములుగా ఉండగా.. జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసుకున్న విపక్ష కూటమి (I.N.D.I.A)లో భాగంగా కమ్యూనిస్టులు, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) వంటి పార్టీలు కూడా ఈ కూటమిలోనే ఉన్నాయి. అయితే బీజేపీ సారథ్యంలోని కూటమి ఓటమే లక్ష్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ నుంచి విరమించుకుని మహా వికాస్ అఘాడీకి సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఇదిలా ఉంటే రాష్ట్రంలో బలమైన ప్రాంతీలుగా ఉన్న శివసేన, ఎన్సీపీలు కూటమిలో కాంగ్రెస్ పార్టీకి పెద్దన్న పాత్ర ఇవ్వడానికి ఇష్టపడడం లేదు. ఇదిలా ఉంటే.. సీట్ల సంఖ్య విషయంలోనూ మూడు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. ప్రాంతాలవారిగా కాంగ్రెస్ బలంగా ఉన్న విదర్భంలో శివసేన 16-17 సీట్లు కోరుతుండగా, అన్ని సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ ససేమిరా అంటోంది.

వీటన్నింటికీ తోడు మహా వికాస్ అఘాడీలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా తన పేరు ప్రకటించాలని శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే పరోక్షంగా పట్టుబడుతున్నారు. ముందుగానే ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించాల్సిన అవసరం లేదని, ఎన్నికల ఫలితాల అనంతరం తేల్చుకోవచ్చని కాంగ్రెస్ తెగేసి చెబుతోంది. ఇవన్నీ ఈ కూటమిలో లుకలుకలకు కారణమవుతున్నాయి. అయితే కూటమి పార్టీల మధ్య విబేధాలు ప్రత్యర్థులకు ఆయుధంగా మారతాయని కూటమి నేతలు ఆందోళన చెందుతున్నారు. పట్టువిడుపులు వీడి సర్దుకుపోతేనే విజయం సాధ్యపడుతుందని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ వంటి రాజకీయ కురువృద్ధులు సర్దిచెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు.

సీట్ల సంఖ్య విషయంలో శరద్ పవార్ జోక్యంతో మూడు పార్టీలు ముందు తలా 85 స్థానాలకు అభ్యర్థులను సిద్ధం చేసుకోవాలని నిర్ణయించుకున్నాయి. ఆ క్రమంలో కాంగ్రెస్ 87, శివసేన (ఉద్ధవ్ థాక్రే) పార్టీ 85, ఎన్సీపీ (శరద్ పవార్ గ్రూప్) 67 స్థానాల్లో అభ్యర్థుల పేర్లను ప్రకటించుకున్నాయి. మరో 49 స్థానాలకు సోమ, మంగళవారాల్లో అభ్యర్థులను ఖరారు చేసి ప్రకటించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి.

‘మహాయుతి’లోనూ స్పర్థలు

విబేధాలు, స్పర్థలు కేవలం మహా వికాస్ అఘాఢీలో మాత్రమే ఉన్నాయని, బీజేపీ సారథ్యంలోని ‘మహాయుతి’లో అంతా బాగానే ఉందని అనుకోడానికి వీల్లేదు. బీజేపీ, శివసేన (ఏక్‌నాథ్ షిండే) పార్టీల మధ్య పెద్దగా విబేధాలు లేకపోయినా.. ఎన్సీపీ (అజిత్ పవార్) వర్గం నుంచే పేచీ ఎదురవుతోంది. కొద్ది నెలల క్రితం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ పనితీరు ఆశించిన మేరకు లేదు. అయినప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు డిమాండ్ చేయడం ఒకెత్తయితే, మిత్రపక్షాలు బలంగా ఉన్న స్థానాలను కోరడం మరొకటి. అయితే మహా వికాస్ అఘాడీతో పోల్చుకుంటే ఈ కూటమిలో చెప్పుకోదగ్గ విబేధాలైతే కనిపించడం లేదు. అయినప్పటికీ మహాయుతి ఇప్పటి వరకు ప్రకటించిన అభ్యర్థుల సంఖ్య మహా వికాస్ అఘాడీ కంటే తక్కువే. కూటమిలో బీజేపీ అత్యధికంగా 121 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.. శివసేన షిండే వర్గం నుంచి 45 మంది అభ్యర్థులు, ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం నుంచి 49 మంది అభ్యర్థులను ప్రకటించారు. మొత్తంగా 215 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.. ఇంకా 73 స్థానాలకు ప్రకటించాల్సి ఉంది. అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేయడంలో బీజేపీ ముందే ఉన్నప్పటికీ.. ఏకాభిప్రాయం కుదరని స్థానాల విషయంలోనే జాప్యం జరుగుతోంది. నామినేషన్లు దాఖలు చేసేందుకు చివరి తేదీ సమీపించిన నేపథ్యంలో రెండు కూటములు మిగిలిన స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసి తుది జాబితాను విడుదల చేయనున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..