Lok Sabaha Elections 2024: ఓటు వేసినప్పుడు వేలికి ఉండే సిరా త్వరగా చెరిగిపోదు.. అసలు కారణం ఇదే..

దేశంలో ప్రజాస్వామ్య పండుగ లోక్ సభ ఎన్నికలకు సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. భారతదేశంలో మొదటి లోక్‌సభ ఎన్నికల తర్వాత, ఎన్నికల ప్రక్రియలో అనేక మార్పులు వచ్చాయి. బ్యాలెట్ బాక్స్ స్థానంలో ఈవీఎం మెషీన్ వచ్చింది. అయితే దశాబ్దాలుగా ఉన్న ఒక సాంప్రదాయం మాత్రం తొలిగిపోలేదు. ఒక వ్యక్తి తన ఓటు వేసిన తరువాత సిరా గుర్తు వేస్తారు.

Lok Sabaha Elections 2024: ఓటు వేసినప్పుడు వేలికి ఉండే సిరా త్వరగా చెరిగిపోదు.. అసలు కారణం ఇదే..
Election Voting Ink
Follow us
Srikar T

|

Updated on: Apr 04, 2024 | 9:06 PM

దేశంలో ప్రజాస్వామ్య పండుగైన లోక్ సభ ఎన్నికలకు సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. భారతదేశంలో మొదటి లోక్‌సభ ఎన్నికల తర్వాత, ఎన్నికల ప్రక్రియలో అనేక మార్పులు వచ్చాయి. బ్యాలెట్ బాక్స్ స్థానంలో ఈవీఎం మెషీన్ వచ్చింది. అయితే దశాబ్దాలుగా ఉన్న ఒక సాంప్రదాయం మాత్రం తొలిగిపోలేదు. ఒక వ్యక్తి తన ఓటు వేసిన తరువాత సిరా గుర్తు వేస్తారు. ఈ సిరాకు సంబంధించి ప్రజల మదిలో అనేక ప్రశ్నలు ఉన్నాయి. దీనికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సందేహాలను ఇప్పుడు నివృత్తి చేసుకుందాం.

ఎడమ చేతి మొదటి వేలికి ఎన్నికల సిరా వేస్తారు పోలింగ్ అధికారులు. ఓటు వేసిన తర్వాత ఎన్నికల అధికారి ఓటరు వేలిపై నీలిరంగు సిరాను పూస్తారు. దీనివల్ల ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువసార్లు ఓటు వేయలేడని సూచికగా పరిగణిస్తారు. అయితే ఇది సులభంగా చెరిపివేసేందుకు వీలుపడదు. కాబట్టి, దీనిని చెరగని సిరా అని కూడా అంటారు. అయితే ఈ ఇంక్‌లో అంత తర్వాత చెరిగిపోకుండా ఉండటానికి గల కారణం ఏంటి? ఈ సిరా ఎక్కడ, ఎలా తయారు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎన్నికల సిరా ఎక్కడ తయారు చేస్తారు?

కర్ణాటక రాష్ట్రంలో ఉన్న మైసూర్ పెయింట్ అండ్ వార్నిష్ లిమిటెడ్ (MVPL) అనే కంపెనీలో ఎన్నికల సిరా తయారవుతుంది. ఈ కంపెనీని 1937లో అప్పటి మైసూర్ ప్రావిన్స్ మహారాజా నల్వడి కృష్ణరాజ వడియార్ స్థాపించారు. ఈ కంపెనీకి మాత్రమే దేశంలో ఎన్నికల సిరా తయారు చేయడానికి లైసెన్స్ జారీ చేయబడింది. ఈ కంపెనీ అనేక రకాల పెయింట్‌లను కూడా తయారు చేస్తున్నప్పటికీ, ఎన్నికల సిరాను తయారు చేయడం ద్వారా దీనికి ప్రత్యేక గుర్తింపు లభించింది. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత 1962లో జరిగిన ఎన్నికల్లో తొలిసారిగా ఈ సిరాను ఉపయోగించారు అధికారులు. భారత ఎన్నికల్లో నీలిరంగు సిరాను చేర్చిన ఘనత ఆ దేశ తొలి ప్రధాన ఎన్నికల కమిషనర్‌ సుకుమార్‌ సేన్‌కే దక్కుతుంది. MVPL కంపెనీ ఈ ఎన్నికల సిరాను పెద్దమొత్తంలో విక్రయించదు. ఈ సిరాను కేవలం ప్రభుత్వం లేదా ఎన్నికల సంబంధిత ఏజెన్సీలకు మాత్రమే సరఫరా చేస్తుంది.

ఎలక్షన్ ఇంక్ ఎందుకు తీసుకొచ్చారు?

ఎన్నికల సిరాలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే అది తేలికగా చెరిపివేయబడదు. నీటితో కడిగిన తర్వాత కూడా ఇది కొన్ని రోజులు అలాగే చెరిగిపోకుండా ఉంటుంది. అయితే ఇలా ఎందుకు ఉంది? అనే ప్రశ్న చాలా మందిలో తలెత్తుతుంది. దీన్ని అర్థం చేసుకోవాలంటే ఎన్నికల ఇంక్ తయారు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలి. 1950లోనే ఈ ప్రత్యేక ఇంక్ తయారు చేసే పనిలో ఎన్నికల యంత్రాంగం నిమఘ్నమయ్యింది. నకిలీ ఓటింగ్‌ను నిరోధించడమే దీని ప్రధాన ఉద్దేశం. దీనిని తయారు చేసేందుకు కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) శాస్త్రవేత్తలు నడుంబిగించారు. 1952లో నేషనల్ ఫిజికల్ లాబొరేటరీ (CSIR-NPL)లో చెరగని సిరా ఫార్ములాను రూపొందించి దానిని డెవలప్ చేశారు. ఆ తర్వాత నేషనల్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NRDC) పేటెంట్ రైట్స్‎ను పొందింది.

ఎన్నికల సిరా ఎందుకు చెరిగిపోదు?

ఎన్నికల సిరా తయారీకి సిల్వర్ నైట్రేట్ రసాయనాన్ని ఉపయోగిస్తారు. సిల్వర్ నైట్రేట్‌ను ఎందుకు ఎంచుకున్నారంటే.. ఇది నీటితో తాకినప్పుడు నల్లగా మారుతుంది పైగా మాసిపోదు. మరింత డార్క్ రంగులో మారుతుంది. ఎన్నికల అధికారి ఓటరు వేలిపై నీలిరంగు సిరాను పూసినప్పుడు, సిల్వర్ నైట్రేట్ మన శరీరంలోని ఉప్పుతో కలిసి సిల్వర్ క్లోరైడ్‌గా తయారవుతుంది. అందుకే ఇది క్రమక్రమంగా నలుపు రంగులోకి మారుతుంది.

సిల్వర్ క్లోరైడ్ నీటిలో కరగదు, పైగా చర్మాంలోకి బాగా ఇమడిపోతుంది. సబ్బుతో కూడా కడగడం సాధ్యం కాదు. కాంతి పడటం వల్ల ఈ గుర్తు మరింత ముదురు రంగులోకి మారుతుంది. ఎన్నికల సిరా రియాక్షన్ చాలా వేగంగా ఉంటుంది. అది వేలికి పూసిన ఒక సెకనులో దాని గుణాన్ని విడుదల చేస్తుంది. దీనికి కారణం ఇందులో ఆల్కహాల్ కూడా ఉన్నందున కేవలం 40 సెకన్లలోపు ఆరిపోతుంది. చర్మ కణాలు క్రమక్రమంగా పాతబడి పడిపోవడం ప్రారంభించినప్పుడే ఎన్నికల సిరా గుర్తు నెమ్మదిగా తొలగిపోతుంది. ఈ సిరా సాధారణంగా చర్మంపై 2 రోజుల నుండి 1 నెల వరకు కూడా ఉంటుంది. సిరా మసకబారడానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. మానవ శరీర ఉష్ణోగ్రత, పర్యావరణాన్ని బట్టి మారుతూ ఉంటుంది.

ఇంక్ ప్రపంచవ్యాప్తంగా సరఫరా..

ఎన్నికలకు లక్ష బాటిళ్లలో 10 ఎంఎల్ సిరా నింపి పోలింగ్ బూత్‎కు పంపుతారు. ఇది భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోని డజన్ల కొద్దీ దేశాలలో ఉపయోగించబడుతుంది. mygov నివేదిక ప్రకారం, మైసూర్ పెయింట్ అండ్ వార్నిష్ లిమిటెడ్.. ఇలాంటి ప్రత్యేక ఇంక్‌లను 25 కంటే ఎక్కువ దేశాలకు సరఫరా చేస్తోంది. వీటిలో కెనడా, ఘనా, నైజీరియా, మంగోలియా, మలేషియా, నేపాల్, దక్షిణాఫ్రికా, మాల్దీవులు లాంటి దేశాలకు ఎగుమతి చేస్తోంది. ఈ దేశాలు సిరా దరఖాస్తు కోసం వివిధ పద్ధతులను అనుసరిస్తాయి. ఈ సిరా తయారీ కంపెనీ కస్టమర్ కోరిన ప్రకారం ఇంక్‌ను తయారు చేసి సరఫరా చేస్తుంది. ఉదాహరణకు.. కంబోడియా, మాల్దీవులలో ఓటర్లు తమ వేలిని సిరాలో ముంచాలి. అలాగే బుర్కినా ఫాసోలో సిరాను బ్రష్‌తో పూస్తారు. ఈ సిరా ఫోటోసెన్సిటివ్ కాబట్టి ఇది ప్రత్యక్ష సూర్యకాంతికి గురికాకుండా ఉంటుంది. ఈ కారణంగానే సిరాను నీలి రంగు ప్లాస్టిక్ కంటైనర్లలో నిల్వ చేస్తారు.

మరిన్ని లోక్ సభ ఎన్నికల కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..