Karnataka Elections 2023: కర్ణాటకలో అధికార పీఠం ఎవరిది? ప్రీ పోల్ సర్వేలో తేలిన ఆసక్తికర విషయాలు..

|

Mar 11, 2023 | 5:20 PM

Karnataka Assembly Elections 2023: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలపై నిర్వహించిన తాజా ప్రీ పోల్ సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.

Karnataka Elections 2023: కర్ణాటకలో అధికార పీఠం ఎవరిది? ప్రీ పోల్ సర్వేలో తేలిన ఆసక్తికర విషయాలు..
Karnataka Elections 2023
Image Credit source: TV9 Telugu
Follow us on

కర్ణాటకలో అధికార పీఠాన్ని దక్కించుకునేది ఎవరు? మరోసారి అధికార పగ్గాలు చేపట్టాలని ఉవ్విళ్లూరుతున్న బీజేపీ ఆశలు నెరవేరుతాయా? దీనిపై కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలపై నిర్వహించిన తాజా ప్రీ పోల్ సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. సాధారణ మెజార్టీతో కాంగ్రెస్ అధికారంలోకి రానుందని ‘లోక్ పోల్’ సర్వే తేల్చింది. 2018 అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే బీజేపీకి దక్కే ఓటింగ్ శాఖ గణనీయంగా తగ్గనుంది.

కర్ణాటకలో లోక్ పోల్ చేపట్టిన ఈ ప్రీ పోల్ సర్వే మేరకు.. కాంగ్రెస్ పార్టీకి 116 -122 అసెంబ్లీ స్థానాలు దక్కే అవకాశమున్నట్లు అంచనావేశారు. ఆ పార్టీకి 39-42శాతం ఓట్లు దక్కే అవకాశమున్నట్లు తేల్చారు. అయితే అధికార బీజేపీ కేవలం 77-83 స్థానాలకు పరిమితంకానుంది. ఆ పార్టీకి 33-36 శాతం ఓట్లు దక్కే అవకాశముంది. 15-18 శాతం ఓట్లతో జేడీఎస్ కేవలం 21-27 స్థానాలకు పరిమితంకానుంది. ఇతరులు 6-9 శాతం ఓట్లతో 1-4 స్థానాల్లో గెలిచే అవకాశాలున్నట్లు సర్వేలో తేలింది.

ఇవి కూడా చదవండి

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలపై ప్రీ పోల్ సర్వే..

ఓల్డ్ మైసూర్ ప్రాంతంలో గతంతో పోల్చితే బీజేపీ మెరుగైన ఫలితాలు సాధించొచ్చని ఆ సర్వేలో తేలింది. ఆ ప్రాంతాల్లో బీజేపీ 10-13 స్థానాల్లో సాధించే అవకాశముండగా.. కాంగ్రెస్ 21-24 సీట్లు, జేడీఎస్ 14-17 సీట్లను దక్కించుకునే అవకాశముంది.

కల్యాణ కర్ణాటక ప్రాంతంలో కాంగ్రెస్ అత్యధిక స్థానాలను గెలుచుకోవచ్చని సర్వే అంచనావేసింది. ఆ ప్రాంతంలో కాంగ్రెస్ 24-27 స్థానాలు, బీజేపీ 9-13 స్థానాలు, జేడీఎస్ 0-2 స్థానాలు, ఇతరులు 0-2 స్థానాలు దక్కించుకునే అవకాశముంది.

బెంగుళూరులోనూ కాంగ్రెస్‌దే పైచేయి..

అటు బెంగుళూరు మహానగరంలోనూ బీజేపీపై కాంగ్రెస్ పైచేయి సాధించనుంది. కాంగ్రెస్ 19-23 స్థానాలు, బీజేపీ 11-14 స్థానాలు, జేడీఎస్ 1-4 స్థానాలు గెలిచే అవకాశముంది.

కిట్టూర్ కర్ణాటక ప్రాంతంలో బీజేపీ పైచేయి సాధించే అవకాశమున్నట్లు సర్వే తేల్చింది. అక్కడ బీజేపీ 27-30 సీట్లు, కాంగ్రెస్ 19-22 సీట్లు, జేడీఎస్ 0-1 సీట్లు సాధించే అవకాశమున్నట్లు ప్రీ పోల్ సర్వే తేల్చింది.

కోస్తా కర్ణాటక ప్రాంతంలో బీజేపీ పైచేయి సాధించే అవకాశముంది. అక్కడ బీజేపీ 14-17 స్థానాలు, కాంగ్రెస్ 7-10 స్థానాలు, జేడీఎస్ 0-1 స్థానం సాధించే అవకాశముంది. సెంట్రల్ కర్ణాటకలో బీజేపీ 10-13 స్థానాలు, కాంగ్రెస్ 7-10 స్థానాలు, జేడీఎస్ 0-1 స్థానంలో గెలిచే అవకాశమున్నట్లు లోక్ పోల్ సర్వే వెల్లడించింది.

జనవరి 15 తేదీ నుంచి ఫిబ్రవరి 28 వరకు ఈ సర్వే నిర్వహించారు. 224 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 200 శ్యాంపిల్స్ సేకరించినట్లు లోక్ పోల్ తెలిపింది. మొత్తం 45 వేల శ్యాంపిల్స్ సేకరించినట్లు వెల్లడించింది. ప్రభుత్వంలో అవినీతి, పెరుగుతున్న నిరుద్యోగ సమస్య, ధరాఘాతం, అభివృద్ధి మందగమనం తదితర అంశాల ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతకు కారణమవుతున్నట్లు తెలిపింది.

2018 ఎన్నికల ఫలితాలు ఇలా..

2018లో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 224 స్థానాలకు గాను బీజేపీ 104 స్థానాలు గెలుచుకోగా, కాంగ్రెస్ 78 సీట్లు, జేడీఎస్ 37 సీట్లు కైవసం చేసుకుంది. కర్ణాటక ప్రజ్ఞావంత జనతా పార్టీ, బహుజన్ సమాజ్ వాదీ పార్టీ చెరో సీటు గెలుచుకున్నాయి. ఒక ఇండిపెండెంట్ సైతం గొలుపొందారు.

ప్రస్తుత కర్ణాటక అసెంబ్లీ పదవీకాలం మే 24వ తేదీ వరకు ఉండగా.. అంతకు ముందే ఎన్నికల ప్రక్రియను ముగించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది.

మరిన్ని జాతీయ వార్తలు చదవండి