దుబ్బాక ఎన్నికలపై ‘టీవీ 9’లోగోతో ఫేక్ న్యూస్.. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు..
దుబ్బాక ఎన్నికలను ప్రభావితం చేసేలా కొందరు కేటుగాళ్లు 'టీవీ 9' లోగోను వాడి తప్పుడు బ్రేకింగ్ న్యూస్‌ను సృష్టించారు. దీనిని సోషల్ మీడియాలో పోస్టు చేసి వైరల్ చేస్తున్నారు.

Dubbaka By Poll: ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు ప్రచారం చేసేవాళ్లు ఎక్కువైపోయారు. అందులో కొందరైతే సంస్థలకు, వ్యక్తులకు చెడ్డపేరు తేవాలని టార్గెట్‌గా చేసుకుని దురుద్దేశాలతో లేనివాటిని ఆపాదిస్తూ దిగజారిపోయి అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ఇక తాజాగా దుబ్బాక ఎన్నికలను ప్రభావితం చేసేలా కొందరు కేటుగాళ్లు ‘టీవీ 9’ లోగోను వాడి తప్పుడు బ్రేకింగ్ న్యూస్‌ను సృష్టించారు. దీనిని సోషల్ మీడియాలో పోస్టు చేసి వైరల్ చేస్తున్నారు.
కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి.. టీఆర్ఎస్ గూటికి చేరుతున్నట్లుగా వీడియోలు సృష్టించారు. టీవీ 9 పేరుతో ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు. ఈ వీడియో పూర్తిగా కల్పితం. దానికి ‘టీవీ9’ కు ఎలాంటి సంబంధం లేదు. దుబ్బాక ఎన్నికల్లో ప్రజలను అయోమయానికి గురి చేయడానికే కొందరు ఫేక్‌గాళ్లు ఈ పనికి పాల్పడ్డారని తెలుస్తోంది. అలాంటి బ్రేకింగ్ న్యూస్ ఏదీ కూడా టీవీ 9 ఎప్పుడూ ప్రసారం చెయ్యలేదు. దీనిపైన టీవీ 9 సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా, టీవీ9 లోగో, గ్రాఫిక్స్‌తో తప్పుడు ప్రచారం చేసేవాళ్లపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని టీవీ9 హెచ్చరిస్తోంది.