Black Magic: ఎండు చేపలు, అన్నం ముద్దలతో క్షుద్రపూజలు.. ఆ పేపర్లలో ఏం గీశారంటే..?

|

Mar 16, 2021 | 11:23 AM

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో క్షుద్రపూజలు కలకలం రేపుతున్నాయి. ఊర్లోనే కాదు, పంట పొలాల వద్ద కూడా క్షుద్రపూజలు చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు గుర్తుతెలియని వ్యక్తులు.

Black Magic: ఎండు చేపలు, అన్నం ముద్దలతో క్షుద్రపూజలు.. ఆ పేపర్లలో ఏం గీశారంటే..?
Black Magic
Follow us on

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో క్షుద్రపూజలు కలకలం రేపుతున్నాయి. ఊర్లోనే కాదు, పంట పొలాల వద్ద కూడా క్షుద్రపూజలు చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు గుర్తుతెలియని వ్యక్తులు. సుల్తానాబాద్  శివారులో రాయికల్‌దేవ్‌పల్లి వెళ్లే రోడ్డులో చొప్పరి అంజయ్య అనే రైతు పొలం వద్ద భయంకరంగా క్షుద్ర పూజలు చేశారు. ఆదివారం అమావాస్య అర్థరాత్రి పూట గుర్తుతెలియని వ్యక్తులు అంజయ్య పొలం వద్ద ఇరవై కొబ్బరి కాయలు, జీడిగింజలు, మిరపకాయలు, నిమ్మకాయలు, కోడిగుడ్డు, ఎండు చేపలు, పసుపు, కుంకుమలతో కలిపిన అన్నం ముద్దలు, గవ్వలు విస్తరాకులు పెట్టి క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. అయితే రెండు పేపర్ల తీసుకుని.. ఒకదాంట్లో మనిషి బొమ్మ ఆనవాళ్లు గీసి.. మరో దాంట్లో చేతి అచ్చుల నమోనాలను గీసి పొలంలో క్షద్రపూజలు చేశారు.

తెల్లారేసరికి అంజయ్య పొలం వద్దకు రాగానే భయంకరంగా క్షుద్రపూజల ఆనవాళ్లు కనబడడంతో తనకు ఎవరో మంత్రాలు చేశారని భయపడిపోతున్నాడు. గతంలో ఒకసారి ఇంటివద్ద రాత్రిపూట గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్రపూజలు చేశారని, ఇప్పుడు పొలం వద్ద చేయడంతో భయాందోళనలకు గురవుతున్నాడు అంజయ్య. క్షుద్రపూజల విషయంపై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయనున్నట్టు అంజయ్య తెలిపాడు.

కాగా ఇటీవల కాలంలో క్షుద్రపూజలు, గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపిన ఘటనలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా నమోదవుతున్నాయి. తాజాగా  నిజామాబాద్‌ జిల్లాలో గుప్త నిధుల తవ్వకం కలకలం రేపింది. సిరికొండ మండలం పెద్దవాల్గోట్‌లో గుప్త నిధుల కోసం కొందరు దుండగులు తవ్వకాలు చేపట్టారు. ఓ పురాతన గడీలో గుప్తనిధులు ఉన్నట్లు భావించిన గుర్తు తెలియని వ్యక్తులు గుట్టుగా వేట మొదలుపెట్టారు.

పెద్ద వాల్గొట్ గ్రామంలోని పురాతన గడీలో గుప్త నిధుల కోసం ఓ ఇంట్లో తవ్వకాలు నిర్వహించారు. ఇంట్లోంచి పెద్దగా శబ్ధాలు రావడంతో అటుగా వచ్చిన గ్రామస్తులు…నిందితులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also Read:

గసగసాల ముసుగులో నిషేధిత మాదక ద్రవ్యాలు.. మామిడి తోటలో విచ్చలవిడిగా డ్రగ్స్.. పూర్తి వివరాలు ఇవిగో

బైక్‌పై వెనుక కూర్చున్న వ్యక్తి పడిపోతే పట్టించుకోకుండా వెళ్లిపోయాడు.. సైబరాబాద్ పోలీసులు ఏం చేశారంటే..?