చక్ర వడ్డీలకు అప్పులు ఇస్తారు.. అప్పు తీసుకుంటే నెల నెలా వడ్డీలు చెల్లించాలి.. అడిగిన టైమ్‌కి అప్పు తిరిగి ఇవ్వాలి.. లేదంటే అంతే సంగతలు. అవసరమైతే అప్పు రాబట్టేందుకు బెదిరిస్తారు.. కిడ్నాప్‌లు చేస్తారు.. చిత్రహింసలకు గురిచేస్తారు. ఇదంతా మహారాష్ట్రలోని పూణెకి చెందిన ఓ కిలేడీ గ్యాంగ్ నడిపిస్తున్న దందా. ఇలా అధిక వడ్డీ కోసం అకృత్యాలకు పాల్పడుతున్న ఐదుగురు సభ్యుల ముఠాను మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేయగా..వీరిలో నలుగురు మహిళలే ఉన్నారు. పూణెలోని విమన్ నగర్‌కు చెందిన వైషాలి కుల్కర్ణి(45) తన తండ్రి చికిత్స కోసం అత్యవసరంగా డబ్బు కావాల్సి వచ్చింది. నిందితుల నుంచి 2014, 2016లో రూ.24 లక్షలు వడ్డీకి తీసుకుంది. అయితే వడ్డీపై వడ్డీలు చెల్లించాలంటూ ఆ గ్యాంగ్ ఆమెను వేధింపులకు గురిచేసింది. అలా పలు దఫాలుగా ఆమె, ఆమె తల్లి, సోదరిని బెదిరించి రూ.1.43 కోట్లు రాబట్టారు. ఆ తర్వాత కూడా ఇంకా డబ్బు చెల్లించాలంటూ ఆమెను వేధించారు. తన ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకపోవడంతో ఇక తాను డబ్బులు చెల్లించలేనని వైషాలి చెప్పినా..ఆ లేడీ గ్యాంగ్ వేధింపులు ఆపలేదు. గత నెల ఈ ముఠా బాధితురాలు వైషాలితో పాటు ఆమె తల్లిని కిడ్నాప్ చేసి ఓ ఇంట్లో బంధించారు. మరోసారి బాధితురాలితో పాటు ఆమె తల్లి, చెల్లిపై దాడి చేసి గాయపరిచారు. ఖాళీ స్టాంప్ పేపర్లపై వారి చేత సంతకాలు చేయించుకున్నారు.
డబ్బు చెల్లించకుంటే ఆమె తల్లిని చంపేస్తామని బెదిరించారు. తమకు ముంబైలో చాలా మంది పోలీసు అధికారులతో పరిచయాలు ఉన్నాయని చెప్పుకున్నారు. డబ్బు తిరిగి చెల్లించకుంటే అక్రమ కేసులు పెట్టిస్తామని బెదిరించారు. వీరి వేధింపులు ఎక్కువ కావడంతో బాధిత మహిళ పూణెలోని విమన్ నగర్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు తెలిసాయి. ఈ అధిక వడ్డీ దందాను మహిళా గ్యాంగ్ నడిపిస్తున్నట్లు తెలుసుకుని విస్తుపోయారు.. నిందితులు షగుఫ్తా సయ్యద్(40), ఫర్దియా ఖాన్(42), ఆస్మా సయ్యద్(35), షెహనజ్ షేక్(49), అబిద్ షా(34)లను అరెస్టు చేశారు. వీరిపై మహారాష్ట్ర మనీ లెండింగ్ (రెగులేషన్) యాక్ట్ 2014 కింద కేసు నమోదు చేశారు. ఈ యాక్ట్ కింద నలుగురు మహిళలను పూణె పోలీసులు అరెస్టు చేయడం ఇదే తొలిసారి. నిందితులను కోర్టులో హాజరుపరచగా…కోర్టు వీరిని ఆదివారంనాటి వరకు పోలీసు కస్టడీకి అప్పగించింది.
నిందితుల దగ్గరి నుంచి రూ.41వేలు, 5 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ ఇనిస్పెక్టర్ మంగేష్ జగదీప్ తెలిపారు. బాధితురాలు రూ.24 లక్షల రుణం తీసుకోగా..ఇప్పటి వరకు లేడీ గ్యాంగ్ బెదిరింపులతో రూ.1.43 కోట్ల వరకు రాబట్టుకున్నట్లు తమకు ఫిర్యాదు అందినట్లు తెలిపారు. ఈ లేడీ గ్యాంగ్ బాధితులు చాలా మంది ఉండొచ్చని భావిస్తున్నారు. లేడీ గ్యాంగ్ అకృత్యాలపై మరింత లోతుగా కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు చెప్పారు.
Also Read..
టోక్యో ఒలంపిక్స్ 2021 లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం..ఇక్కడ క్లిక్ చేయండి
పెళ్ళైన ఐదు నెలలకే దారుణం.. కారు కొనేందుకు వరకట్నం తీసుకు రాలేదని.. భార్యతో యాసిడ్ తాగించిన భర్త..!